లైగర్ బ్యూటీ.. పాస్ పోర్ట్ వెనక రొమాన్స్
అసలు కలిసి పని చేస్తారో లేదో అనే సందేహాలు ఉన్నా, ఆ ఇద్దరూ తిరిగి ఒక ప్రాజెక్ట్ కోసం కలుస్తున్నారు. ఓ క్రేజీ రొమాంటిక్ కామెడీ కోసం సన్నాహకాలు కొద్ది రోజుల క్రితం ప్రారంభమయ్యాయి.
By: Tupaki Desk | 3 Jun 2025 9:15 AM ISTఅసలు కలిసి పని చేస్తారో లేదో అనే సందేహాలు ఉన్నా, ఆ ఇద్దరూ తిరిగి ఒక ప్రాజెక్ట్ కోసం కలుస్తున్నారు. ఓ క్రేజీ రొమాంటిక్ కామెడీ కోసం సన్నాహకాలు కొద్ది రోజుల క్రితం ప్రారంభమయ్యాయి. ఆసక్తికరంగా ఈ సినిమాలో ఔట్ సైడర్ సరసన ఇన్ సైడర్ హీరోయిన్ రొమాన్స్ చేస్తోంది. ఈ కథంతా ఓ ముగ్గురి గురించి... ఆ ముగ్గురు ఎవరు? అంటే.. కరణ్ జోహార్ - కార్తీక్ ఆర్యన్- అనన్య పాండే.
కరణ్ జోహార్ పూర్తిగా ఇన్ సైడర్స్ కి మాత్రమే అవకాశాలు కల్పిస్తాడనే ఆరోపణలున్నాయి. అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' చిత్రంతో అతడే వెండితెరకు పరిచయం చేసాడు. కానీ కార్తీక్ ఆర్యన్ ఔట్ సైడర్. పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ప్రతిభనే నమ్ముకున్నాడు. అతడు ఇంతింతై పెద్ద స్టార్ గా ఎదిగాడు. కొన్నేళ్ల క్రితం కార్తీక్ ఆర్యన్ తో ధర్మ ప్రొడక్షన్స్ లో 'దోస్తానా 2' చిత్రాన్ని ప్రారంభించిన కరణ్ జోహార్ మధ్యలోనే ఆ ప్రాజెక్టును వదిలేసాడు. దానికి కారణం కార్తీక్ ఆర్యన్ క్రమశిక్షణా రాహిత్యం అంటూ ఆరోపించాడు. ప్రాజెక్టు నుంచి కార్తీక్ ని తొలగించడమే గాక, అతడితో ధర్మ ప్రొడక్షన్స్ ఎప్పటికీ కలిసి పని చేయదని ప్రకటించాడు.
కానీ కాలంతో పాటే మార్పు. ఇప్పుడు కరణ్ కోపం తగ్గింది. కార్తీక్ తో వివాదాల్ని పరిష్కరించుకున్నాడు. ఇన్ సైడర్ అనన్యను- ఔట్ సైడర్ కార్తీక్ ని కలుపుతూ కరణ్ జోహార్ ఒక రొమాంటిక్ కామెడీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ రొమాంటిక్-కామ్ టైటిల్ `తు మేరీ మై తేరా మై తేరా తు మేరీ`. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రానుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో కార్తీక్ ఆర్యన్ రేగా .. బబ్లీ అనన్య పాండే రూమిగా నటించారు. ఈ చిత్రం నవ్వులు, ప్రేమ, కొంచెం అల్లరితో కూడిన అందమైన సన్నివేశాలతో సాగుతుందని కరణ్ బృందం ప్రకటించింది.
తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. పాస్‌పోర్ట్ పట్టుకుని కార్తీక్ అనన్యపై నుదిటి మీద ముద్దు పెట్టే స్నాప్‌షాట్ యువతరాన్ని ఆకర్షిస్తోంది. ఈ కథలో ప్రేమతో పాటు పాస్ పోర్ట్ డ్రామా కూడా ఉందని అర్థమవుతోంది. ఈ పాస్ పోర్ట్ తోనే ఏదో ఒక చిక్కు ఉంటుందని ఊహిస్తున్నారు. దీని నుంచి రోడ్ ట్రిప్ డ్రామా, రొమాన్స్ ని రాబట్టే ప్లాన్ వేసారు. నిజానికి ఇందులో కథానాయికగా శర్వరి వాఘ్ నటించాల్సి ఉన్నా, అనూహ్యంగా లైగర్ బ్యూటీ అనన్య పాండే ఆ ఛాన్స్ కొట్టేసింది.
