అగ్రనిర్మాత 7 నెలల్లో 20కేజీలు తగ్గడం వెనక సీక్రెట్
అసలు ఎలాంటి మందులు వాడకుండా, క్లినిక్ లకు వెళ్లకుండా అధిక బరువును తగ్గడం ఎలా? దీనికి ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఇచ్చిన సలహా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
By: Tupaki Desk | 16 May 2025 9:26 AM ISTఅసలు ఎలాంటి మందులు వాడకుండా, క్లినిక్ లకు వెళ్లకుండా అధిక బరువును తగ్గడం ఎలా? దీనికి ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఇచ్చిన సలహా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అతడు కొంత కాలంగా అనూహ్యంగా బరువు తగ్గిపోయి కనిపించాడు. బాగా సన్నగా మారిపోయి అందరికీ షాకిచ్చాడు. కరణ్ డ్రగ్ వాడకంతో ఇలా మారాడు అంటూ ప్రచారం సాగింది. ఒజెంపిక్ ప్రాభావం అంటూ ప్రచారం చేసారు.
కానీ కరణ్ తాను ఇలా మారడానికి కారణాలను తాజా ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. అతడు రోజుకు ఒక మీల్ (ఓఎంఏడి) విధానాన్ని అనుసరించానని తెలిపాడు. ఎలాంటి మెడిసిన్ తీసుకోలేదని అన్నాడు. రాత్రి పూట 8 నుంచి 8.30 మధ్య ఒక భోజనం చేసేవాడిని అని మిగతా రోజంతా ఉపవాసం చేసానని వెల్లడించాడు. తొలి ఏడు రోజులు కష్టంగా అనిపించినా కానీ తర్వాత నెమ్మదిగా అలవాటైంది. ఏడు నెలలు ఇలా చేసాను.. అని తెలిపాడు. దీని వల్ల ఏకంగా 20 కేజీల బరువు తగ్గినట్టు వెల్లడించాడు. గ్లూకోజ్, లాక్టోస్, గ్లూటెన్ వంటివి తాను తీసుకోలేదని కూడా తెలిపాడు.
OMAD డైట్ ప్లాన్ అంటే ఏమిటి? అంటే... ఇది ఒక రోజుకు ఒక భోజనం మాత్రమే. మిగిలిన సమయం ఉపవాసం చేయాలి. నీరు, బ్లాక్ కాఫీ, హెర్బల్ టీలు వంటి కేలరీలు లేని ద్రవాలను తాగాలి. ఇది కేలరీల లోటును సృష్టిస్తుంది, ఇది బరువు తగ్గడానికి కారణమవుతుంది. దీనివల్ల జీర్ణ ప్రక్రియ కూడా మెరుగవుతుంది. అయితే ఓఎంఏడి అందరికీ సరిపడదు. ఇది వేగంగా కొవ్వును కరిగించే ప్రక్రియ. వైద్యుని పర్యవేక్షణలో మాత్రమే ఆచరించాలి. ఈ ప్రక్రియ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అందుకే దీనిని వైద్య నిపుణుడిని సంప్రదించాకే అనుసరించాలి. ప్రస్తుతం కరణ్ కొంత బరువు పెరగాలని కూడా అనుకుంటున్నాడు. దానికోసం మళ్లీ తినడం ప్రారంభించానని తెలిపాడు. కానీ ఏం తినాలో చార్ట్ ఉంటుందని కూడా వెల్లడించాడు.
