Begin typing your search above and press return to search.

ప‌ని మాట్లాడాలి త‌ప్ప పీఆర్ ఏజెన్సీలు కాదు!

బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత కరణ్ జోహార్ చిత్ర పరిశ్రమలో మారుతోన్న పోకడలపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Srikanth Kontham   |   27 April 2026 6:00 AM IST
ప‌ని మాట్లాడాలి త‌ప్ప  పీఆర్ ఏజెన్సీలు కాదు!
X

బాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత కరణ్ జోహార్ చిత్ర పరిశ్రమలో మారుతోన్న పోకడలపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి తరం నటీనటులు పనికంటే ఎక్కువగా పబ్లిక్ రిలేషన్స్ పైనా, సోషల్ మీడియా ఇమేజ్ పైనా ఆధారపడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. బాలీవుడ్ ఇకనైనా ఇలాంటి కృత్రిమ ప్రచారాలను ఆపి, ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. నటుల పనితీరే వారి గురించి మాట్లాడాలి తప్ప పీఆర్ ఏజెన్సీలు కాదని గట్టిగా కౌంట‌ర్ వేసారు. ప్రస్తుత కాలంలో ఒక సినిమా విజయం సాధించాలన్నా ? నటుడు పాపులర్ అవ్వాలన్నా? పీఆర్ స్టంట్లు తప్పనిసరి అయిపోయాయి.

విమానాశ్రయాల్లో ఫోటోలకు ఫోజులివ్వడం, జిమ్ బయట కెమెరాలకు చిక్కడం వంటివన్నీ పక్కా ప్లానింగ్‌తో జరుగుతున్నాయని విమర్శించారు. ఇవన్నీ ప్రేక్షకులను మభ్యపెట్టడమేనని, వీటివల్ల నటుల అసలైన ప్రతిభ మరుగున పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ప్రచారంతోనే స్టార్‌డమ్ వస్తుందనే భ్రమలో నటులు ఉండటం పరిశ్రమకు మంచిది కాదని హితవు పలికారు. గతంలో నటీనటులు నటనతో, బాక్సాఫీస్ వసూళ్లతో గుర్తింపు తెచ్చుకునేవారన్నారు. కానీ ఇప్పుడు డిజిటల్ నాయిస్ పెరిగిపోయిందని కరణ్ విశ్లేషించారు.

ఒక నటుడికి ఎన్ని లైకులు వచ్చాయి? ఎన్ని మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారనేది నటనకు కొలమానం కాకూడదని అభిప్రాయ‌పడ్డారు. పీఆర్ బృందాలు సృష్టించే హైప్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లుగా మారడం లేదన్నారు. ఇది కేవలం నీటి బుడగ లాంటిదని హెచ్చరించారు. నటులు తమ సమయాన్ని పీఆర్ వ్యూహాల కోసం కాకుండా స్క్రిప్ట్ సెలక్షన్ , నటనను మెరుగు పరుచుకోవడంపై పెట్టాలని సూచించారు. పీఆర్ కల్చర్ వల్ల పరిశ్రమలో ఖర్చులు కూడా అనవసరంగా పెరుగుతున్నాయని కరణ్ జోహార్ పేర్కొన్నారు. ప్రతి చిన్న విషయానికి భారీ ఎత్తున ప్రచారం చేయడం వల్ల నిర్మాతలు ఒత్తిడికి లోనవుతున్నారన్నారు.

అది సినిమా బడ్జెట్‌పై ప్రభావం చూపుతోందని అభిప్రాయపడ్డారు. సహజంగా వచ్చే క్రేజ్ కి, పీఆర్ ద్వారా సృష్టించే క్రేజ్ కి చాలా వ్యత్యాసం ఉంటుంద‌న్నారు. ప్రేక్షకులు కూడా చాలా తెలివైన వారని ఏది నిజమో? ఏది కృత్రిమ ప్రచారమో సులభంగా గుర్తించగలరని వివరించారు. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీస్తు న్నాయి. ఒకప్పుడు స్టార్ మేకర్‌గా పేరున్న కరణ్ జోహార్ నేరుగా స్టార్లనే విమర్శించడం ఆస‌క్తిక‌రం. ఆయన మాటల్లో నిజం ఉందని చాలా మంది విశ్లేషకులు సైతం మద్దతు తెలుపుతున్నారు. నటులు తమ పనిని తాము చేసుకుంటూ పోతే గుర్తింపు దానంతట అదే వస్తుందని పీఆర్ ఏజెన్సీల తోడ్పాటు అవసరం లేద‌న్నారు. ఈ మార్పు బాలీవుడ్ భవిష్యత్తుకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.