Begin typing your search above and press return to search.

అలా ప్ర‌శ్నించ‌గానే బోరున ఏడ్చాను: క‌ర‌ణ్‌

తల్లి లేకుండా పిల్లలను పెంచాలనే తన నిర్ణయంపై ఒక కామెంట్ తనను పూర్తిగా కదిలించిందని, తన తల్లిదండ్రుల పునాదినే ప్రశ్నించేలా చేసిందని అంగీకరించాడు క‌ర‌ణ్ జోహార్

By:  Tupaki Desk   |   1 July 2025 8:45 AM IST
అలా ప్ర‌శ్నించ‌గానే బోరున ఏడ్చాను: క‌ర‌ణ్‌
X

తల్లి లేకుండా పిల్లలను పెంచాలనే తన నిర్ణయంపై ఒక కామెంట్ తనను పూర్తిగా కదిలించిందని, తన తల్లిదండ్రుల పునాదినే ప్రశ్నించేలా చేసిందని అంగీకరించాడు క‌ర‌ణ్ జోహార్. అత‌డు సరోగ‌సీలో ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌ని, పెంచి పోషిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి అయ్యాక‌, తన‌లోని మార్పుల గురించి అత‌డు నిరంత‌రం మాట్లాడుతూనే ఉంటాడు.

అయితే పిల్ల‌ల‌కు త‌ల్లి లేకుండా చేయ‌డంపై నెటిజ‌నుల ఘాటైన‌ వ్యాఖ్య‌ల‌ను త‌ట్టుకోలేక‌పోయానని క‌రణ్ అన్నారు. ఓ చాటింగ్ సెష‌న్ లో కరణ్ తాను ఒక కఠినమైన వ్యాఖ్యను ఫేస్ చేసాన‌ని తెలిపాడు. ``మీరు మీ పిల్లలకు తల్లిని నిరాకరించారని మీరు గ్రహించారా?`` అని ఒక నెటిజ‌న్ కామెంట్ చేసాడు. అది నా హృద‌యాన్ని ముక్క‌లు చేసింది. ఎందుకంటే మొదటిసారిగా, నేను సింగిల్ పేరెంట్‌గా ఉండాలనే నా నిర్ణయాన్ని ప్రశ్నించాడు. నేను వారికి ప్రతిదీ కాగలనని నమ్మాను. తల్లిదండ్రులు, వారి తల్లి, వారి తండ్రి, వారి తాతామామలు.. నాకు ఆ ప్రేమ ఉంది. కానీ నా పిల్ల‌ల‌కు? ఆ వ్యాఖ్య తో నేను సరైన పని చేశానా అని రెండవసారి ఆలోచించుకునేలా చేసింది! అని అతడు చెప్పాడు.

2017లో సరోగసీ ద్వారా కవలలు యష్ , రూహిలకు తండ్రి అయిన కరణ్, తండ్రిగా త‌న‌లోని పెను మార్పుల గురించి బ‌హిరంగంగా మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే ఆ కామెంట్ ని అత‌డు త‌ట్టుకోలేక‌పోయానని తెలిపాడు.

``ఆ రోజు ఉదయం, ఆ కామెంట్ ని చదివినప్పుడు నాకు ఒక క్షణం పట్టలేదు. నేను ఒక్కసారిగా విలపించాను. నా గదిలో ఒంటరిగా కూర్చుని ఏడ్చాను. పిల్ల‌ల గదిలోకి వెళ్లి, `మీరు సంతోషంగా ఉన్నారా?` అని అడిగాను. ``అవును, చాలా సంతోషంగా ఉంది దాదా`` అని అన్నారు. నేను వారిని ఎందుకు అని అడిగాను. ``ఎందుకంటే మీరు మా దాదా`` అని పిల్ల‌లు అన్నారు.. అని గుర్తు చేసుకున్నాడు.

కరణ్ జోహార్ ప్రస్తుతం ది ట్రెయిటర్స్‌ను హోస్ట్ చేస్తున్నారు. ఇది జూలై 3న అమెజాన్ ప్రైమ్‌లో ముగియ‌నుంది. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో నిర్మించిన `స‌ర్జ‌మీన్` చిత్రం ఓటీటీలో విడుద‌ల కావాల్సి ఉంది.