1000 కోట్లకు వాటా అమ్మకం.. గుట్టు విప్పిన అగ్రనిర్మాత
చిత్రపరిశ్రమలో ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించిన సంస్థ ధర్మ ప్రొడక్షన్స్. కానీ ఈ రోజు ఈ సంస్థ వరుస పరాజయాలతో నిరాశపరుస్తోంది.
By: Tupaki Desk | 8 May 2025 3:58 AMచిత్రపరిశ్రమలో ఎన్నో క్లాసిక్ హిట్స్ అందించిన సంస్థ ధర్మ ప్రొడక్షన్స్. కానీ ఈ రోజు ఈ సంస్థ వరుస పరాజయాలతో నిరాశపరుస్తోంది. అయితే దీనిని అంగీకరించని ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్, ధర్మ ప్రొడక్షన్స్ తెలివిగా సినిమాలు తీస్తోందని చెబుతున్నారు. అలాగే తన కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ లో 50శాతం వాటాను సీరం అధినేత ఆదార్ పూనవలాకు విక్రయించడానికి కారణం ఏమిటో కూడా ఇటీవలి రాజ్ షమణి పాడ్ కాస్ట్ లో వెల్లడించాడు.
2023 తర్వాత తమ సంస్థకు మూలధనం అవసరం పడిందని, డబ్బు అవసరం రీత్యా సీరం అధినేతతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నామని, 2024లో సగం వాటాను (ఈక్విటీ) ఆయనకు కట్టబెట్టామని కరణ్ జోహార్ తెలిపారు. దాదాపు 1000 కోట్లకు ఈ డీల్ కుదిరింది. ఇటీవల ధర్మ ప్రొడక్షన్స్ ఈ డబ్బుతోనే వ్యాపారం చేస్తోంది. అయితే ఫ్లాపుల్ని అందిస్తోంది. అయినా దీనిపై ధర్మాధినేత బింకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆదార్ పూనవలా మంచి వ్యాపారి అని, అతడి నిర్వహణ అద్భుతంగా ఉందని అన్నాడు. ఆర్థిక పరంగా అతడు చూసుకుంటున్నాడు. క్రియేటివిటీ పరంగా నేను చూసుకుంటున్నాను! అని తెలివిగా సమాధానమిచ్చాడు కరణ్.
ఆర్థిక భద్రతను కాకుండా తన తండ్రి యష్ జోహార్ ఖ్యాతిని వారసత్వంగా పొందానని కూడా అతడు చెప్పాడు. ధర్మ ప్రొడక్షన్స్ `కుచ్ కుచ్ హోతా హై` సినిమాతో విజయం అందుకోక ముందు ఐదు వరుస ఫ్లాపుల్ని ఎదుర్కొందని కరణ్ తెలిపాడు. ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. నా తండ్రి నుండి నాకు వారసత్వంగా వచ్చింది డబ్బు కాదు, మంచి మనసు! అని కరణ్ అన్నాడు. తన తండ్రి భావోద్వేగ ప్రయాణం, కీర్తి ప్రతిష్ఠల వారసత్వం తన ప్రయాణానికి సహకరించాయని కరణ్ తెలిపాడు. డబ్బు కోసం కాదు.. మంచి కోసం ప్రయాణమని అభివర్ణించాడు.
అలాగే కరణ్ జోహార్ ప్రారంభంలో కొన్ని పెద్ద సినిమాల కోసం నిర్మాణ భాగస్వాములతో కలిసి పని చేసాడు. దానికి కారణం నిధులు సరిపోకపోవడమే. ఆ తర్వాత ఆ విధానాన్ని పూర్తిగా వదిలేసాడు. వాటాదారులకు ఏదైనా ధర్మంగానే ఇవ్వాలి. ``లాభదాయకత ధర్మంలోనే ఉండాలని నేను కోరుకున్నాను. అప్పుడే నేను ఇతరులతో సహకార ప్రాజెక్టులు చేయడం మానేశాను!`` అని ఆయన వివరణ ఇచ్చారు. కభీ ఖుషీ కభీ ఘమ్, కల్ హో నా హో, కభీ అల్విదా నా కెహ్నా వంటి హిట్స్ ధర్మ ప్రొడక్షన్స్‌కు ఊపునిచ్చాయి. కానీ అది అంత తేలికైన ప్రయాణం కాదని కూడా కరణ్ తెలిపారు. 2004లో తన తండ్రి మరణం తర్వాత, స్నేహితుడు ప్రస్తుత ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అయిన అపూర్వ మెహతాపై కరణ్ ఆధారపడ్డానని తెలిపాడు. తన కోసం అతడు రాత్రికి రాత్రే లండన్ వదిలేసి వచ్చాడని కూడా కరణ్ వెల్లడించాడు. ఇప్పటివరకు నాకు వ్యాపార చతురత లేదు. కానీ బలమైన స్వభావం ఉంది. అపూర్వ వ్యాపారాన్ని మేనేజ్ చేస్తాడు.. నేను సృజనాత్మకతను మేనేజ్ చేస్తాను! అని కరణ్ చెప్పాడు. పదునైన ప్రవృత్తి ఉన్న సీరం అధినేత ఆదార్ పూనవలాతో భాగస్వామ్యం తర్వాత తాను మరింత జవాబుదారీగా ఉన్నానని తెలిపాడు. ఇది వేరొకరి డబ్బు.. విజయం అందించాలనే స్పృహతో ఉన్నానని కూడా వెల్లడించాడు.