Begin typing your search above and press return to search.

క‌ర‌ణ్ ధ‌ర్మం నాలుగు పాదాల‌పై న‌డ‌వక‌పోతే!

క‌నీసం మాస్ క‌థ‌ల్ని కూడా సౌత్ త‌ర‌హాలో వినోదాత్మ‌క పంథాలో అందించ‌డంలో వెన‌క‌బ‌డ‌టం కూడా దేశంలోని అతి పెద్ద సినీప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందిగా మారింది

By:  Tupaki Desk   |   10 April 2025 8:30 AM IST
Will Karan Johar Redefine Bollywood’s Fortunes?
X

ఒరిజిన‌ల్ క‌థ‌లు లేక రొటీన్ రీమేక్ క‌థ‌ల‌పై ఆధార‌ప‌డ‌డంతో బాలీవుడ్ ప్ర‌భ మ‌స‌క‌బారింది. క‌నీసం మాస్ క‌థ‌ల్ని కూడా సౌత్ త‌ర‌హాలో వినోదాత్మ‌క పంథాలో అందించ‌డంలో వెన‌క‌బ‌డ‌టం కూడా దేశంలోని అతి పెద్ద సినీప‌రిశ్ర‌మ‌కు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ‌లు ఇటీవ‌ల క‌థ‌ల ఎంపిక‌లో త‌ప్పులు చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంద‌ని ట్రేడ్ విశ్లేషించింది. ఇటీవ‌ల చ‌ర్చా స‌మావేశాల్లో సినీపెద్ద‌లు, విశ్లేష‌కులు బాలీవుడ్ త‌ప్పుల్ని విశ్లేషిస్తూ, కొన్నిటిని ప్ర‌త్యేకంగా ఎత్తి చూపుతున్నారు. దీంతో ప‌రిశ్ర‌మ అంత‌ర్మ‌థ‌నంలో ప‌డింది.

ప‌రిశ్ర‌మ‌లో అగ్ర బ్యాన‌ర్ గా పేరున్న కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సైతం ఆశించిన విజయాల‌ను అందుకోవ‌డంలో వెన‌క‌బ‌డి ఉంది. అయితే 2025 లో క‌ర‌ణ్ పూర్తిగా ప్లాన్ మార్చారు. ఈ ఏడాది రిలీజ్ బ‌రిలోకి తెస్తున్న నాలుగు పెద్ద సినిమాల‌పై పెద్ద హోప్స్ పెట్టుకున్నారు. గిప్పీ గ్రేవాల్ దర్శకత్వం వహించిన పంజాబీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా `అకాల్`పై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. దీనికి కార‌ణం క‌థాంశం ఎత్తుగ‌డ ప‌రంగా పాన్ ఇండియా అప్పీల్ తో క‌నిపిస్తోంది. పంజాబ్ చ‌రిత్ర‌లో జ‌రిగిన ఒక నిజ క‌థ‌ను వెండితెర‌పైకి తెస్తున్నారు. వారియ‌ర్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన ఈ చిత్రంలో ఎమోష‌న్స్ ని అద్భుతంగా ఆవిష్క‌రించేందుకు ఛాన్స్ ఉండ‌టంతో ఇది అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ లో ధ‌ర్మాన్ని నిల‌బెట్టే సినిమాగా ఇది క‌న‌బ‌డుతోంది. ఏప్రిల్ 10 రిలీజ్ కావ‌డంతో స‌మ్మ‌ర్ సెల‌వుల‌కు సిద్ధ‌మైన స్కూల్, కాలేజీ పిల్ల‌ల్ని ఇది థియేట‌ర్ల‌కు లాగే ఛాన్సుంది.

అలాగే అక్ష‌య్ కుమార్ లాంటి పెద్ద స్టార్ న‌టించిన `కేసరి: చాప్టర్ 2` ఏప్రిల్ 18 న విడుదలవుతోంది. జలియన్ వాలాబాగ్ ఊచకోతను కోర్టు డ్రామా నేప‌థ్యంలో ర‌క్తి క‌ట్టించేలా చూపించ‌డంతో ఎమోష‌న్స్ కి ఆస్కారం ఉన్న సినిమా ఇది కూడా. చారిత్రాత్మ‌క క‌థాంశాన్ని కరణ్ సింగ్ త్యాగి తెర‌పై ఎలా చూపించారు? అన్న‌ది వేచి చూడాలి. సెల్ఫీ, ఖేల్ ఖేల్ మెయిన్ వంటి పరాజయాలు ఉన్నా క‌ర‌ణ్ సింగ్ స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ ఫ్లాపుల్లో ఉన్న ద‌ర్శ‌కుడిని న‌మ్మి అవ‌కాశం ఇచ్చినందుకు దానిని నిల‌బెట్టాల్సి ఉంది.

సన్నీ సంస్కారి కి తులసి కుమారి (ఎస్.ఎస్.కే.టి.కే) కూడా ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో రూపొందుతోంది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ ధావన్-జాన్వి కపూర్ జంట‌గా న‌టిస్తున్నారు. ఈ రొమాంటిక్ కామెడీ ఏమేర‌కు ఆక‌ట్టుకోనుందో వేచి చూడాలి. ఇది బద్రీనాథ్ కి దుల్హానియాకు సీక్వెల్ అని ప్ర‌చారం ఉంది. రొమాన్స్ కుర్ర‌కారును థియేట‌ర్ల‌లోకి లాగుతుందా లేదా చూడాలి.

సిద్ధాంత్ చతుర్వేది -త్రిప్తి దిమ్రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో ధ‌డ‌క్ 2 తెర‌కెక్కిస్తున్నారు. కానీ దీనిపై స‌రైన అప్ డేట్ లేదు. పార్ట్-1 ఆశించినంత విజ‌యం సాధించ‌లేదు గ‌నుక ఈ సీక్వెల్ పై ఆస‌క్తిని పెంచ‌డంలో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ విఫ‌లమైంది. సినిమా రిలీజ్ గురించి ఇంకా స్ప‌ష్ఠ‌త లేదు. ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ సినిమాలు ఆశించిన విజ‌యం సాధించిన‌ప్పుడే క‌రణ్ మ‌న‌సు శాంతిస్తుంది. చాలా కాలంగా విజ‌యాల్లేక ఆవురావురుమ‌ని ఎదురు చూస్తున్న అత‌డిని నిల‌బెట్టే సినిమాలు ఏవి? అన్న‌ది వేచి చూడాలి. వీట‌న్నిటిపైనా 500-1000 కోట్ల బెట్టింగ్ సాగుతున్నందున‌ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ లో నాలుగు సినిమాలు విజ‌యాల‌ను అందుకుని ధ‌ర్మాన్ని నాలుగు పాదాల‌పై న‌డిపించాల్సి ఉంది.