Begin typing your search above and press return to search.

ఆ ఫ్యామిలీ వారసులు సక్సెస్‌ కాలేరా?

సినిమా ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది సర్వసాధారణమైన విషయం.

By:  Tupaki Desk   |   29 March 2025 10:26 AM IST
Why Arjun & Harshvardhan Kapoors Success Remains Elusive
X

సినిమా ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది సర్వసాధారణమైన విషయం. బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న యంగ్‌ హీరోల్లో ఎక్కువ శాతం వారసులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం బాలీవుడ్‌ మాత్రమే కాకుండా టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ వారసులు ఉన్నారు. అయితే వారసుల సక్సెస్ రేటు మాత్రం సౌత్‌లో అధికంగా ఉంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల్లో అత్యధిక శాతం వారసులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్‌లో తండ్రుల వారసత్వంతో వచ్చిన అమ్మాయిలు హీరోయిన్స్‌గా సక్సెస్ అవుతున్నారు. సౌత్‌లో మాత్రం తండ్రుల వారసత్వంతో వచ్చిన అబ్బాయిలు హీరోలుగా సక్సెస్ అవుతున్నారు.

బాలీవుడ్‌లో తండ్రుల వారసత్వంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోలు కొద్ది మంది మాత్రమే ఒక మోస్తరు విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఎక్కువ శాతం మంది హీరోలు సక్సెస్ కోసం పాట్లు పడుతున్నారు. బాలీవుడ్‌ అనగానే కపూర్ ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మెగా, నందమూరి ఫ్యామిలీతో పాటు మరికొన్ని ఫ్యామిలీలు ఎలా అయితే రూల్‌ చేస్తున్నాయో అలాగే బాలీవుడ్‌లో ఎప్పటి నుంచో కపూర్ ఫ్యామిలీ ఆదిపత్యం కొనసాగుతూ వస్తుంది. కానీ ఈమధ్య కాలంలో హీరోలుగా కపూర్‌ ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన వారు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నారు. ముఖ్యంగా బోనీ కపూర్‌ తనయుడు అర్జున్‌ కపూర్‌ హీరోగా ఎందుకు సినిమాలు చేస్తున్నాడో అర్థం కావడం లేదంటూ విమర్శలు వచ్చే స్థాయిలో ఆయన సినిమాలు డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి.

కోట్ల రూపాయల బడ్జెట్‌తో అర్జున్‌ కపూర్‌ సినిమాలు రూపొందుతూ ఉంటే.. కలెక్షన్స్ లక్షల్లో కూడా నమోదు కావడం లేదు. అర్జున్ కపూర్‌ హీరోగా నటించిన 'లేడీ కిల్లర్‌' అనే సినిమా చెత్త సినిమాల్లో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. రెండేళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌తో రూపొందితే బాక్సాఫీస్ వద్ద కనీసం రూ.50 వసూళ్లు రాబట్టలేక పోయింది. ఇటీవల అర్జున్‌ కపూర్‌ హీరోగా నటించిన 'మేరీ హస్బెండ్‌కి బీవీ' సినిమా విడుదలైంది. మరోసారి అర్జున్‌ కపూర్‌కి అదే ఫలితం దక్కింది. ఈసారి కాస్త నెంబర్స్‌ అటు ఇటుగా మారాయేమో కానీ ఫలితం మాత్రం అదే. అర్జున్ కపూర్ కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రేక్షకులు ఆయన సినిమాల విషయంలో ఆసక్తి కనబర్చడం లేదు.

బాలీవుడ్‌ మరో కపూర్‌ స్టార్‌ అనిల్‌ కపూర్‌ తన వారసుడు హర్థ వర్ధన్ కపూర్‌ ను ఇండస్ట్రీలో పరిచయం చేశాడు. మూడు పదుల వయసు దాటినప్పటికీ ఇంకా నటుడిగా గుర్తింపు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇండస్ట్రీలో ఇతడు అడుగు పెట్టి చాలా కాలం అయినా ఇప్పటి వరకు ఇతడిని గుర్తించే వారు లేరు. అనిల్ కపూర్ కొడుకుగానే ఇతడిని జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇతడికంటూ ప్రత్యేక ఇమేజ్ దక్కలేదు.. ముందు ముందు అయినా ఇతడు సక్సెస్‌ అవుతాడా అంటే కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తమ పేరు చివర కపూర్‌ అంటూ అంత పెద్ద బ్రాండ్‌ ఉన్నప్పటికీ వీరిద్దరూ సక్సెస్‌ దక్కించుకోలేక పోతున్నారు. ఇకపై అయినా వీరు కపూర్‌ పేరుకు న్యాయం చేస్తారనే నమ్మకం ఎవరిలోనూ కనిపించడం లేదు.

మరోవైపు బోనీకపూర్‌, అనిల్ కపూర్‌ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన అమ్మాయిలు జాన్వీ కపూర్‌, సోనమ్‌ కపూర్‌లు హీరోయిన్స్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఖుషి కపూర్‌ సైతం ఎంట్రీ ఇచ్చి స్టార్‌డం దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కపూర్‌ ఫ్యామిలీని ముందు ముందు నిలబెట్టేది అమ్మాయిలే అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్‌ చేస్తున్నారు. కపూర్‌ ఫ్యామిలీ నుంచి ముందు ముందు మరింత మంది హీరోలు వస్తారు అనుకుంటే అర్జున్‌ కపూర్‌, హర్థ వర్ధన్ కపూర్‌లను చూస్తూ ఉంటే కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌ ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో స్టార్స్‌గా ఎదగరని, ట్యాలెంట్‌ కచ్చితంగా ఉండాలని వీళ్లను చూస్తే అనిపిస్తుందని కొందరు అంటున్నారు. కపూర్‌ ఫ్యామిలీ వారసులపై మీ అభిప్రాయం ఏంటి?