కపిల్ శర్మ విదేశీ కేఫ్‌పై గ్యాంగ్ స్టర్స్ ఫైరింగ్
సినిమా టీవీ రంగంలోని సెలబ్రిటీలు ఇతర పారిశ్రామిక వేత్తల్లానే దేశవిదేశాల్లో వ్యాపారాలను నిర్వహిస్తూ అన్ని చోట్లా పైచేయి సాధిస్తున్నారు.
By: Tupaki Desk | 11 July 2025 11:00 AM ISTసినిమా టీవీ రంగంలోని సెలబ్రిటీలు ఇతర పారిశ్రామిక వేత్తల్లానే దేశవిదేశాల్లో వ్యాపారాలను నిర్వహిస్తూ అన్ని చోట్లా పైచేయి సాధిస్తున్నారు. చాలామంది స్టార్ హీరోలకు విదేశాల్లో రెస్టారెంట్లు ఉన్నాయి. పలువురు హీరోలు దుబాయ్ సహా గల్ఫ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్ని నిర్వహిస్తున్నారు. చాలామందికి ఫ్యాషన్ లేబుల్స్ ఉన్నాయి.
ఇప్పుడు టీవీ హోస్ట్, కమెడియన్ కపిల్ శర్మ కూడా విదేశాల్లో వ్యాపారాలను విస్తరిస్తున్నారు. అతడికి కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలో ఒక కేఫ్ కూడా ఉంది. `కాప్స్` పేరుతో నిర్వహిస్తున్న ఈ కేఫ్ ఇప్పుడు ఊహించని కారణాలతో అంతర్జాతీయ మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది. తాజాగా అందిన సమాచారం మేరకు.. కపిల్ శర్మకు చెందిన `కాప్స్ కేఫ్`పై కొందరు ఖలిస్తానీ ఉగ్రవాదులు గన్ ఫైరింగ్ చేసినట్టు కథనాలొస్తున్నాయి. దక్షిణాసియా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని కొంత కాలంగా బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలో గ్యాంగ్ స్టర్స్ చెలరేగిపోతున్నారు. కొందరు వ్యాపారులను బెదిరించి డబ్బు గుంజేందుకు ప్రయత్నిస్తున్నారు. దుండగుల దోపిడీలు, ఇతర అరాచకాలకు హద్దు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తమవుతోంది.
బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో బుధవారం రాత్రి హాస్యనటుడు కపిల్ శర్మ యాజమాన్యంలోని కొత్తగా ప్రారంభించిన రెస్టారెంట్ `కాప్స్ కేఫ్`పై కాల్పులు జరిగాయి. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసుల వివరాల ప్రకారం...సర్రే - నార్త్ డెల్లా 120 స్ట్రీట్‌లోని 8400 బ్లాక్‌లో ఉన్న కేఫ్‌పై కనీసం ఎనిమిదిసార్లు కాల్పులు జరిపారు. తెల్లవారుజామున 1:50 గంటలకు కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు కానీ ఆస్తికి నష్టం జరిగింది. ఏ ఉద్ధేశంతో దుండగులు కాల్పులు జరిపారో ఇంకా నిర్థారించాల్సి ఉంది. ఇంతలో నిషేధిత ఉగ్రవాద సంస్థ `బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI)` కార్యకర్త, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) జాబితాలో ఉన్న మోస్ట్ వాంటెడ్ ఇండియన్ గ్యాంగ్ స్టర్ లలో ఒకరైన హర్జిత్ సింగ్ లడ్డి సోషల్ మీడియా పోస్ట్‌లో దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించాడు. నిహాంగ్స్‌పై కపిల్ శర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలే తన కోపానికి కారణమని అతడు చెప్పాడు. హర్జిత్ సింగ్- తుఫాన్ సింగ్ బృందం దీనికి బాధ్యత వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కెనడా వాంకోవర్ లో దక్షిణాసియా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి సంచలనంగా మారింది. ఇప్పటికే ఇద్దరిని ఈ కేసులో అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే ఆ ఏరియాలో లక్ష్మీ నారాయణ్ మందిర్ ఆలయ అధ్యక్షుడు, రిఫ్లెక్షన్స్ బాంకెట్ హాల్ యజమాని సతీష్ కుమార్ పేరు కూడా టార్గెట్ లిస్ట్ లో ఉంది. ఆయనను 2 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందిగా గ్యాంగ్ స్టర్లు బెదిరించారు.
