కాంతార2 ను వదలని ప్రమాదాలు..
కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న కాంతార2 షూటింగ్ లో ప్రమాదం జరిగింది.
By: Tupaki Desk | 7 May 2025 3:12 PM ISTకన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న కాంతార2 షూటింగ్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశత్తూ నదిలో నీట మునిగి ప్రాణాలు కోల్పోయి మరణించాడు. ఈ ఘటన ఉడిపి జిల్లా బైందూరులోని కొల్లూరులో జరిగింది.
కపిల్ షూటింగ్ పూర్తయ్యాక తన టీమ్ తో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈత కొట్టేందుకు వెళ్లగా, అక్కడ నీటి లోతు తెలియక నదిలో మునిగి చనిపోయాడని సమాచారం. జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ మరణంతో చిత్ర యూనిట్ తీవ్ర విషాదంలో ఉంది. కొల్లూరు పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాంతారా2 షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆ సినిమాను వరుసపెట్టి ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొన్నాళ్ల కిందట కొల్లూరులోనే జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్ సడెన్ గా బోల్తా పడింది. ఆ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత గాలి వాన వల్ల రావడం వల్ల భారీ సెట్ కూలిపోయింది.
సెట్ కూలినప్పుడు కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఇప్పుడు ఈ తాజా ప్రమాదంలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఏకంగా ప్రాణాలను కోల్పోయాడు. దీంతో అసలిలా ఎందుకు జరుగుతుందని కాంతార2 చిత్ర యూనిట్ అయోమయంలో పడింది. అయితే కపిల్ మరణం విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అతను కేరళకు చెందిన వ్యక్తి అనే సమాచారం మాత్రమే ఉంది.
ఇక సినిమా విషయానికొస్తే కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. కన్నడలో రిలీజైన ఈ సినిమా రికార్డుస్థాయి కలెక్షన్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి పార్ట్ మంచి హిట్ గా నిలవడంతో రెండో పార్ట్ ను కాంతార: చాప్టర్1 పేరుతో తెరకెక్కిస్తున్నారు. 2022లో వచ్చిన కాంతార సినిమాకు ఇది ప్రీక్వెల్ గా తెరకెక్కుతుంది. అక్టోబర్2, 2025న కాంతార: చాప్టర్1 రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
