కోర్టు ఆజ్ఞ కాదు దైవిక ఆజ్ఞ: అమ్మవారిని కించపరిస్తే స్టార్ హీరోకి అయినా తప్పదు!
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత సంచలనం సృష్టించిన `కాంతార` సినిమా వివాదం ఎట్టకేలకు ఒక కీలక ఘట్టానికి చేరుకుంది.
By: Sivaji Kontham | 26 May 2026 4:54 PM ISTఓవైపు రణ్ వీర్ సింగ్ ని బాలీవుడ్ నుంచి నిషేధిస్తూ ముంబైలో ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయ్స్ సంఘం తీసుకున్న నిర్ణయం సంచలనం కాగా, ఇంతలోనే అతడు `కాంతార` కోర్టు వివాదాన్ని పరిష్కరించుకునే దిశగా ప్రయత్నిస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత సంచలనం సృష్టించిన `కాంతార` సినిమా వివాదం ఎట్టకేలకు ఒక కీలక ఘట్టానికి చేరుకుంది. గత ఏడాది కాలంగా సాగుతున్న ఈ వివాదంలో భాగంగా బాలీవుడ్ అగ్ర హీరో రణ్‌వీర్ సింగ్ కర్ణాటకలోని పాపులర్ పుణ్యక్షేత్రమైన మైసూరు చాముండేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన కఠినమైన ఆదేశాల మేరకు రణ్ వీర్ ఈ ఆలయానికి విచ్చేసి అక్కడ దేవతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సినీ పరిశ్రమలో ఒక నటుడి ప్రవర్తన కారణంగా తలెత్తిన వివాదం.. న్యాయస్థానం వరకు వెళ్లి ఈ రకమైన పరిహార పూజలకు దారితీయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ వివాదానికి ప్రధాన కారణం.. గత ఏడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర మహోత్సవం (ఇఫీ) వేడుకలు. ఆ సమయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రణ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. `కాంతార` సినిమాలో చూపించిన దైవికమైన `పంజూర్లి` దైవారాధన సంప్రదాయాలు, భూతకోల ఆచారాలను ఉద్దేశించి కొన్ని అపహాస్యపు వ్యాఖ్యలు చేశారు. బయటకు అంతగా కనిపించని ఆచారాలను, స్థానిక నమ్మకాలను హేళన చేసే విధంగా ఆయన మాట్లాడిన తీరు దక్షిణ భారతదేశంలో.. ముఖ్యంగా కర్ణాటక తీరప్రాంత ప్రజలలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. శతాబ్దాలుగా వస్తున్న పవిత్రమైన సాంస్కృతిక, దైవిక క్రతువులను రణ్‌వీర్ సింగ్ అవమానించారంటూ భక్తులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు.
రణ్‌వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయనపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. స్థానిక సంస్కృతీ సంప్రదాయాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదని.. స్టార్ హోదా ఉందనే అహంకారంతో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం క్షమార్హం కాదని భక్తులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ కేసుల విచారణ కర్ణాటక హైకోర్టు ముందుకు రాగా న్యాయస్థానం ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించింది. వాదోపవాదాలు విన్న అనంతరం భక్తుల సెంటిమెంట్లను గౌరవించాల్సిన బాధ్యత నటులపై ఉందని స్పష్టం చేస్తూ.. మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రాయశ్చిత్త పూజలు నిర్వహించాలని రణ్‌వీర్ సింగ్‌ను హైకోర్టు ఆదేశించింది.
ఇటీవల కాలంలో ఒకవైపు సినిమారంగ సంస్థల నుండి ఎదుర్కొంటున్న నిషేధాల ఒత్తిడి.. మరోవైపు కోర్టు చట్టపరమైన ఉత్తర్వుల నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ మైసూరు చేరుకున్నారు. చాముండేశ్వరి ఆలయ అర్చకుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు, హోమాలు నిర్వహించి తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆయన అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. స్థానిక సంప్రదాయాలను గాయపరిచినందుకు నివారణగా కోర్టు సూచించిన మార్గంలోనే ఈ పూజలు జరిగాయని న్యాయవాద వర్గాలు ధృవీకరించాయి.
`కాంతార సినిమా వివాదం..రణ్‌వీర్ సింగ్ పూజా కార్యక్రమాల ఉదంతం సినీ రంగానికి ఒక బలమైన హెచ్చరిక లాంటిదని చెప్పవచ్చు. సృజనాత్మక స్వేచ్ఛ లేదా వ్యక్తిగత అభిప్రాయాల పేరుతో సమాజంలోని ఒక వర్గం విశ్వాసాలను, శతాబ్దాల నాటి పవిత్ర ఆచారాలను అపహాస్యం చేయడం సరికాదని ఈ ఘటన నిరూపించింది. ఎంతటి స్టార్ హీరోలైనా సరే ప్రజల సెంటిమెంట్లను గౌరవించకపోతే చట్టపరమైన, సామాజికపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే విలువైన పాఠాన్ని ఈ న్యాయస్థాన తీర్పు ఇండస్ట్రీకి నేర్పింది.
