‘కాంతార’ ఫ్రాంచైజ్‌లో మరో సర్ ప్రైజ్!
‘కాంతార’ సినిమా 2022లో విడుదలై భారతీయ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకర్షించిందో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 3 Jun 2025 1:30 AM‘కాంతార’ సినిమా 2022లో విడుదలై భారతీయ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకర్షించిందో అందరికీ తెలిసిందే. రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం, నటనలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ కన్నడ చిత్రం, కర్ణాటకలోని దక్షిణ కన్నడ గ్రామంలో సాగే కథతో అందరి హృదయాలను గెలుచుకుంది. సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా, భూత కోలా సంప్రదాయాన్ని, ప్రకృతి మానవ సంఘర్షణను అద్భుతంగా చూపించింది.
ఇక సినిమా పాన్ ఇండియా విజయంతో రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, 70వ జాతీయ అవార్డ్స్‌లో రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు, సినిమాకు ఉత్తమ వినోదాత్మక చిత్రం అవార్డులను గెలుచుకుంది. ‘కాంతార’ విజయం తర్వాత, ఈ ఫ్రాంచైజ్‌లో రెండో సినిమాగా ‘కాంతార: చాప్టర్ 1’ రూపొందుతోంది. ఇది మొదటి సినిమాకు ప్రీక్వెల్‌గా, కదంబ రాజవంశం హయాంలో సాగే కథతో రిషబ్ శెట్టి మరోసారి దర్శకత్వం వహిస్తూ, నటిస్తున్నాడు. ఇక సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది, ఇది గాంధీ జయంతి, దసరా సందర్భంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సినిమాలో రిషబ్ శెట్టి నాగ సాధువుగా, అతీంద్రియ శక్తులతో కనిపించనున్నాడు, జయరామ్, కిషోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా కోసం ఈ మధ్య 500 మంది ఫైటర్స్‌తో ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. లేటెస్ అప్డేట్ ప్రకారం, ‘కాంతార’ ఫ్రాంచైజ్‌లో మూడో సినిమా కూడా రానుంది. ఈ విషయాన్ని ‘కాంతార: చాప్టర్ 1’ విడుదల సమయంలో అధికారికంగా ప్రకటించనున్నారు. హోంబలే ఫిల్మ్స్ ఈ ఫ్రాంచైజ్‌ను మరింత విస్తరించే ఆలోచనలో ఉందని, మూడో సినిమా కథ కూడా కర్ణాటక సంప్రదాయాలు, ఆధ్యాత్మికత చుట్టూ సాగుతుందని టాక్ నడుస్తోంది.
ఈ సినిమా కథ ‘కాంతార’ యూనివర్స్‌లోనే సాగుతూ, మరో కొత్త కోణాన్ని చూపించనుందని అంటున్నారు. మూడో సినిమా కోసం రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తాడా లేక వేరే దర్శకుడిని ఎంచుకుంటారా అనేది ఇంకా తెలియరాలేదు. అయితే, ఈ ఫ్రాంచైజ్‌ను ఒక సినిమాటిక్ యూనివర్స్‌గా మార్చాలని హోంబలే ఫిల్మ్స్ భావిస్తోంది. ‘KGF’ ఫ్రాంచైజ్‌తో సత్తా చాటిన ఈ నిర్మాణ సంస్థ, ‘కాంతార’తో మరో భారీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
‘కాంతార: చాప్టర్ 1’ కోసం రిషబ్ శెట్టి కలరిపయట్టు, కత్తి పోరాటం, గుర్రపు స్వారీ వంటి శిక్షణలు తీసుకున్నాడు. ఈ సినిమా కుందాపురలోని కదంబ రాజవంశ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది, ఇది ప్రేక్షకులను చారిత్రక కాలంలోకి తీసుకెళ్లనుంది. ఇక ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది.