కాంతార-2 కావాలా.. వంద కోట్లు కట్టండి
రూ.15 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కాస్తా.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
By: Tupaki Desk | 23 Aug 2025 8:08 PM ISTగత కొన్నేళ్లలో చడీచప్పుడు లేకుండా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు రేపిన రీజనల్ మూవీ అంటే.. ‘కాంతార’నే అని చెప్పాలి. ఈ కన్నడ చిత్రం.. ముందు కర్ణాటక వరకే రిలీజై అద్భుత స్పందన తెచ్చుకుంది. ఆ సినిమా చూసిన వాళ్లందరూ ఆహా ఓహో అంటూ అందరూ మాట్లాడుకోవడంతో ఇతర భాషల్లోనూ దానిపై ఆసక్తి కలిగింది. రెండు వారాల తర్వాత తెలుగు, హిందీ భాషల్లో రిలీజైన ‘కాంతార’.. ఈ రెండు చోట్లా సంచలన వసూళ్లు సాధించింది.
రూ.15 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా కాస్తా.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దీంతో దీనికి కొనసాగింపుగా తీస్తున్న ‘కాంతార-2’ మీద అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఐతే ఈ క్రేజ్‌ను సొమ్ము చేసుకోవడం కోసం నిర్మాతలు ఆ సినిమా హక్కుల కోసం చెబుతున్న రేట్లు చూసి బయ్యర్లు దిమ్మదిరిగిపోతున్నారు.
తెలుగులో కూడా ‘కాంతార-2’ మీద భారీ అంచనాలున్న మాట వాస్తవం. ఐతే తెలుగు హక్కుల కోసం ఏకంగా రూ.100 కోట్ల రేటు చెబుతున్నారట హోంబలే ఫిలిమ్స్ అధినేతలు. ఓ డబ్బింగ్ సినిమాకు ఇంత రేటు ఎప్పుడూ పలికింది లేదు. అత్యధికంగా ‘రోబో-2’ను రూ.80 కోట్లకు కొని రిలీజ్ చేశారు. కానీ అందులో హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. పైగా అది ‘రోబో’కు సీక్వెల్. ఇటీవల ‘వార్-2’ను రూ.80 కోట్లతో కొన్నాడు నాగవంశీ. కానీ అందులో మన జూనియర్ ఎన్టీఆర్ ఒక హీరోగా నటించాడు.
‘కాంతార-2’ మంచి కంటెంట్ ఉన్న సినిమానే కావచ్చు కానీ.. వంద కోట్లను వర్కవుట్ చేసే స్టార్ పవర్ ఇందులో లేదు. సినిమా ఎంత బాగున్నా అంత మొత్తంలో షేర్ రాబట్టడం చాలా చాలా కష్టం. కాబట్టి దీనికి దరిదాపుల్లో కూడా రేటు పెట్టడానికి టాలీవుడ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లెవ్వరూ ముందుకు రాకపోవచ్చు. ఇటీవల ‘కూలీ’ సినిమా మీద రూ.50 కోట్లు పెడితే.. విపరీతమైన హైప్ ఉండి కూడా ఆ సినిమాకు బ్రేక్ ఈవెన్ కావడం కష్టమైంది. కాబట్టి ‘కాంతార-2’ మేకర్స్‌ది మరీ అత్యాశ అనడంలో సందేహం లేదు. మేకర్స్ చెబుతున్న దాంట్లో సగానికి మించి రేటు పలకడం కష్టమే.
