'కాంతార' ప్రీక్వెల్‌ని వెంటాడుతున్న విషాదాలు!
రిషబ్ శెట్టి నటిస్తూ ఈ ప్రీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నాడు. 80వ దశకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రిషబ్‌శెట్టి పాత్ర చిత్రణ, మేకోవర్ సరికొత్తగా ఉండనున్నాయి.
By: Tupaki Desk | 13 Jun 2025 9:29 AM ISTకన్నడ క్రేజీ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `కాంతార`. 2022లో కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కేజీఎఫ్ మేకర్స్‌కి ఈ సినిమా ఊహించని లాభాల్ని తెచ్చి పెట్టింది. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా రూ.450 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురిచేసింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి లభించిన అనూహ్య స్పందనని దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందం దీనికి ప్రీక్వెల్‌ని ప్లాన్ చేసింది.
రిషబ్ శెట్టి నటిస్తూ ఈ ప్రీక్వెల్‌ని తెరకెక్కిస్తున్నాడు. 80వ దశకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రిషబ్‌శెట్టి పాత్ర చిత్రణ, మేకోవర్ సరికొత్తగా ఉండనున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అంచనాల్ని పెంచేసింది. ఇప్పటికే మొదలైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ చిత్ర బృందాన్ని వరుస మరణాలు కలవరపెడుతున్నాయి.
ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన దగ్గరి నుంచి వరుస అపశ్రుతులు ఆందోళన కలిగిస్తున్నాయి. మే 6న జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయాడు. దీంతో టీమ్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అయితే ఆ తరువాత కూడా మరో ఆర్టిస్ట్ చనిపోవడంతో షాక్‌కు గురి చేసింది. ఈ మూవీలో నటిస్తున్న ఆర్టిస్ట్ విజు వికె చాతినొప్పితో మరిణించాడు.
ఈ వరుస మరణాల నుంచి టీమ్ తేరుకోకుండానే ఈ మూవీ టీమ్‌కు చెందిన మరో వ్యక్తి గుండెపోటుతో మరణించడంతో అసలు `కాంతార 2` విషయంలో ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా వరుస మరణాలు సంభవిస్తున్నాయనే చర్చ మొదలైంది. మే 12న ఈ సినిమాలో హీరో రిషబ్ శెట్టి కి స్నేహితుడిగా నటిస్తున్న రాకేష్ పూజారి గుండెపోటుతో మృతి చెందడం టీమ్‌ని, హీరో రిషబ్ శెట్టిని షాక్‌కు గురి చేసింది. కాంతారని ఓ యజ్ఞంలా సూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్న రిషబ్ శెట్టికి ఇలా షూటింగ్ దశలోనే వరుస మరణాలు సంభవిస్తుండటం అంతుచిక్కడం లేదట. ఇలా ఎందుకు జరుగుతోంది? ఎందుకు వివిధ కారణాలతో టీమ్ మెంబర్స్ చనిపోతున్నారు? అని కన్నడ సినీ ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందట.
