'కన్నప్ప' రన్ టైం ఎంత.. ప్రభాస్ ఎంతసేపు?
తెలుగు పరిశ్రమ నుంచి త్వరలో రాబోతున్న భారీ చిత్రాల్లో 'కన్నప్ప' ఒకటి. మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం మీద ఏకంగా రూ.200 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టారట.
By: Tupaki Desk | 26 May 2025 7:20 AMతెలుగు పరిశ్రమ నుంచి త్వరలో రాబోతున్న భారీ చిత్రాల్లో 'కన్నప్ప' ఒకటి. మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం మీద ఏకంగా రూ.200 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టారట. ఇన్ని రోజులు బడ్జెట్ రూ.100 కోట్లు అటు ఇటు ఉండొచ్చని అనుకున్నారు కానీ.. విష్ణునే స్వయంగా బడ్జెట్ దాని మీద డబుల్ అయిందని వెల్లడించాడు. విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో ఆలస్యం వల్ల ఈ సినిమా వాయిదా పడి జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు లాంటి పెద్ద పెద్ద తారలు నటిస్తున్న ఈ సినిమా రన్ టైం ఎంత ఉండొచ్చు.. ముఖ్యంగా ప్రభాస్ సినిమాలో ఎంతసేపు కనిపిస్తాడు అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. దీనికి విష్ణు ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు. ‘కన్నప్ప’ రన్ టైం 3 గంటల 10 నిమిషాలని విష్ణు వెల్లడించాడు. అందులో ప్రభాస్ అరగంట పాటు కనిపిస్తాడని అతను చెప్పాడు. మోహన్ లాల్ పాత్ర మాత్రం 15 నిమిషాలే ఉంటుందని విష్ణు తెలిపాడు.
ప్రభాస్ది చిన్న పాత్రే అని, కొన్ని నిమిషాలే కనిపిస్తాడనే అంచనాలు ఉన్నాయి. అరగంట నిడివితో తన పాత్ర ఉంటుందంటే అది అభిమానులకు ఎంతో ఆనందాన్నిచ్చే విషయమే. ప్రభాస్ అంతసేపు కనిపిస్తాడంటే తన అభిమానులు థియేటర్లకు పరుగులు పెట్టడం ఖాయం. ముందు ప్రభాస్‌తో శివుడి పాత్ర చేయించాలని విష్ణు అండ్ టీం అనుకున్నప్పటికీ అతను మాత్రం ‘రుద్ర’ అనే పాత్ర నచ్చి దాన్ని ఎంచుకున్నాడు. కన్నప్పలో మార్పు తెచ్చి అతణ్ని భక్తి మార్గం వైపు నడిపించే పాత్రగా దీన్ని చెప్పుకుంటున్నారు. సినిమాలో ప్రభాస్‌కు, మోహన్ బాబుకు మధ్య వాగ్వాదం జరిగే ఒక ఎపిసోడ్ మేజర్ హైలైట్‌గా ఉంటుందని మంచు విష్ణు చెబుతున్నాడు.