కన్నప్పపై నెగిటివ్ ప్రచారం చేస్తే తీవ్ర చర్యలు తప్పవు: నిర్మాణ సంస్థ వార్నింగ్
టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందిన పౌరాణిక చిత్రం కన్నప్ప విడుదలకు సిద్ధమైంది.
By: Tupaki Desk | 25 Jun 2025 1:15 PM ISTటాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందిన పౌరాణిక చిత్రం కన్నప్ప విడుదలకు సిద్ధమైంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషించగా, ప్రభాస్, మోహన్ బాబు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ తాజా ప్రకటన ఒకటి రిలీజ్ చేసింది.
సినిమా విడుదలకు ముందు నిర్మాతలు విడుదల చేసిన నోటీసు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా పై ఇన్‌టెన్షనల్ నెగిటివ్ ప్రొపగండా చేస్తున్న వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “తప్పుడు ఉద్దేశాలతో రూమర్లు, కావాలని నెగిటివ్ కామెంట్స్ చేస్తే మేము సహించము” అంటూ వారు తెలిపారు. అన్ని సర్టిఫికేషన్లు, లీగల్ క్లియరెన్సులతో సహా కన్నప్ప సినిమా చట్టబద్ధంగా రూపొందించబడిందని స్పష్టం చేశారు.
ముందుగా సినిమా చూశాకే స్పందించండి, ముందే నిర్ణయించుకుని విమర్శించకండి.. అని విమర్శకులకు విజ్ఞప్తి చేశారు. అలాగే సోషల్ మీడియాలో కేవలం వ్యక్తిగత అసహ్యం లేదా ప్రచార ఉద్దేశాలతో విమర్శలు చేస్తే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సృజనాత్మక కృషిపై తప్పుడు వ్యాఖ్యలు మానవ హక్కుల ఉల్లంఘన అని కోర్టులే పేర్కొన్న నేపథ్యంలో.. ఇలాంటి దుశ్చర్యలపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వారు స్పష్టం చేశారు.
ఢిల్లీ హైకోర్టు గతంలోనే మోహన్ బాబు, మంచు విష్ణుల ప్రైవసీ హక్కుల్ని రక్షిస్తూ తీర్పు ఇచ్చిందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. వారి వ్యక్తిత్వాన్ని తారుమారు చేసేలా కామెంట్లు చేయడం, ఫేక్ కంటెంట్ ప్రచారం చేయడం జరగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వెల్లడించారు. ఎవరు అయినా సినిమాను అనుమతులులేకుండా ప్రదర్శించాలన్నా, స్ట్రీమ్ చేయాలన్నా, లేదా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయాలన్నా వారి మీద సివిల్, క్రిమినల్, సైబర్ చట్టాల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
చివరగా, ప్రేక్షకుల ప్రేమ, మద్దతుతో కన్నప్ప విజయం అందుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాపై ఉన్న అంచనాలను దృష్టిలో ఉంచుకుని, మరింత ఎత్తుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని, తప్పుడు ప్రచారాలతో సినిమాను దెబ్బతీయాలని చూస్తే ఊరుకోబోమని నిర్మాతలు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అధికారిక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమా రిలీజ్ అనంతరం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
