Begin typing your search above and press return to search.

మోహ‌న్ బాబు కు శివ‌రాజ్ కుమార్ ఆఫ‌ర్

అదే ఈవెంట్ లో శివరాజ్ కుమార్ కూడా మాట్లాడారు. ఈ జెన‌రేష‌న్ లో ఇలాంటి క‌థ తీసినందుకు విష్ణుపై గౌరవం చాలా పెరిగింద‌ని

By:  Tupaki Desk   |   31 May 2025 3:32 PM
మోహ‌న్ బాబు కు శివ‌రాజ్ కుమార్ ఆఫ‌ర్
X

మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సినిమా క‌న్న‌ప్ప‌. మోహ‌న్ బాబు న‌టిస్తూ నిర్మించిన ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. జూన్ 27న క‌న్న‌ప్ప ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ముకేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా చిత్ర యూనిట్ బెంగుళూరుకు వెళ్లి అక్క‌డ ఓ ఈవెంట్ చేయ‌గా, అందులో శివ‌రాజ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఈ సినిమా గురించి మోహ‌న్ బాబు కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను వెల్ల‌డించారు. క‌న్న‌ప్ప సినిమా చేద్దామ‌నుకున్న‌ప్పుడు ముందుగా క‌న్న‌ప్ప పాత్ర కోసం శివ‌రాజ్ కుమార్ ను అనుకున్నామ‌ని, కానీ ఆ త‌ర్వాత డేట్స్ కుదర‌క‌పోవ‌డం వ‌ల్ల దాన్ని విష్ణు తో చేశామ‌ని తెలిపారు. క‌న్న‌డ ప్ర‌జ‌ల‌న్నా, క‌న్న‌డ రాష్ట్ర‌మ‌న్నా త‌న‌కు ముందుగా గుర్తొచ్చేది రాజ్‌కుమార్ గారేన‌ని, ఆయ‌న లాంటి గొప్ప వ్య‌క్తి ఆశీస్సులు నాకు, నా బిడ్డ‌కు కావాల‌ని, ఆయ‌న యాక్టింగ్ గురించి మాట్లాడ‌టానికి కూడా మేం స‌రిపోమ‌ని మోహ‌న్ బాబు అన్నారు.

క‌న్న‌డ‌లో త‌న‌కు అంబ‌రీష్ అత్యంత ఆత్మీయుడ‌ని, ఆయ‌న చ‌నిపోయాక ఇక్క‌డికి రావ‌డానికి కూడా వెనుక‌డుగేస్తూ ఉండేవాడిన‌ని చెప్పారు. త‌న‌కు ఎప్ప‌ట్నుంచో ఏదైనా క‌న్న‌డ సినిమాలో న‌టిస్తే బావుండేద‌నిపిస్తూ ఉండేదని, అంబ‌రీష్ ను అడిగితే న‌వ్వి ఊరుకునేవాడ‌ని, ఆ త‌ర్వాత రాజ్‌కుమార్ గారిని అడిగే ధైర్యం చేయ‌లేద‌ని, కానీ ఇప్పుడు ఆయన కొడుకు శివ‌రాజ్ కుమార్ ను అడుగుతున్నానని, త‌న త‌ర్వాతి సినిమాలో విల‌న్ గా ఛాన్స్ ఇవ్వ‌మ‌ని కోరారు మోహ‌న్ బాబు.

అప్ప‌ట్లో రాజ్‌కుమార్ తీసిన శ్రీ కాళ‌హ‌స్తీశ్వ‌ర మ‌హ‌త్మ్యం సినిమాను తానెన్నో సార్లు చూశాన‌ని, కానీ దాన్ని తెలుగులో తీయాల‌నే ఆలోచ‌న రాలేదని, ఆ సినిమాలో క‌న్న‌ప్ప‌గా శివ‌రాజ్ కుమార్ చాలా బాగా చేశార‌ని అన్నారు. క‌న్న‌ప్ప‌ను తెలుగులో కృష్ణంరాజు గారు చేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత ఈ సినిమాను తెలుగులో తాము చేస్తున్నామ‌ని, విష్ణు ఈ క‌థ‌పై ఏడెనిమిదేళ్లు వ‌ర్క్ చేశాడ‌ని, దైవాసీస్సులతోనే ఈ సినిమాను పూర్తి చేయ‌గ‌లిగామ‌ని ఆయ‌న అన్నారు.

అదే ఈవెంట్ లో శివరాజ్ కుమార్ కూడా మాట్లాడారు. ఈ జెన‌రేష‌న్ లో ఇలాంటి క‌థ తీసినందుకు విష్ణుపై గౌరవం చాలా పెరిగింద‌ని, అంద‌రికీ తెలిసిన క‌థ చేయాలంటే ఎంతో ధైర్య‌ముండాలని సినిమాలోని విజువ‌ల్స్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంద‌ని, మోహ‌న్ బాబు లాంటి యాక్ట‌ర్, నిర్మాత ఈ క‌థ‌కు ఓకే చెప్ప‌డం అభినంద‌నీయ‌మ‌ని, ఈ సినిమా త‌ప్ప‌కుండా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని, జూన్ 27న టికెట్ కొనుక్కుని మ‌రీ క‌న్న‌ప్ప‌ సినిమా చూస్తాన‌ని చెప్పారు. వాస్త‌వానికి ఈ సినిమాలో తాను కూడా న‌టించాల్సింద‌ని, కానీ డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డంతో చేయ‌లేక‌పోయాన‌ని, ఈసారి విష్ణు ఏం అడిగినా చేస్తాన‌ని, దానికి రెమ్యూన‌రేష‌న్ కూడా అవ‌స‌రం లేద‌ని, తామంతా ఒకటే ఫ్యామిలీ అని అన్నారు. ఇదే సంద‌ర్భంగా మోహ‌న్ బాబు కోరిక‌పై కూడా శివ‌రాజ్ కుమార్ స్పందించారు. నా సినిమాలో విల‌న్ పాత్ర చేయాల‌ని అడిగారు, కానీ తాను ఆయ‌న‌తో ఫైట్ చేయాల‌నుకోవ‌డం లేద‌ని, అంత‌కంటే మంచి పాత్ర ఒక‌టి త‌న ద‌గ్గ‌రుంద‌ని, ఒక హై క్వాలిటీ అన్న‌య్య పాత్ర ఉంద‌ని, ఆయ‌న‌కు ఓకే అయితే ఆ పాత్ర ఇస్తాన‌ని శివ‌రాజ్ కుమార్ చెప్పారు.