కన్నప్పకు కొత్త టికెట్ రేట్లు.. ఎంత పెంచారంటే..
పాన్ ఇండియా స్థాయిలో భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన చిత్రం కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.
By: Tupaki Desk | 26 Jun 2025 11:02 AM ISTపాన్ ఇండియా స్థాయిలో భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన చిత్రం కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న తరుణంలో, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరొక కీలక అప్డేట్ బయటకు వచ్చింది.
తాజాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సినిమా యూనిట్‌కు టికెట్ ధరల పెంపుపై గ్రీన్ సిగ్నల్ లభించింది. మోహన్ బాబు నేతృత్వంలోని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరఫున చేసిన అభ్యర్థనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సినిమాకు మంచి బజ్ ఉండటంతో మొదటి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించి మేమో జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఏపీ రాష్ట్రంలోని మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్లలో హయ్యర్ క్లాస్ టికెట్లపై మాత్రమే అదనంగా రూ.50 వరకూ (GST తో పాటు) ధర పెంచుకునే వీలుంటుంది. ఇదంతా సినిమా మొదటి ప్రదర్శనైన జూన్ 27 నుంచి పది రోజుల వరకే వర్తించనుంది. ఈ ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలోని కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, లైసెన్సింగ్ అధికారులు, పోలీసు కమిషనర్లు తదితరులందరూ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మల్టీ లాంగ్వేజ్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో తొలి వారంలోనే రికార్డ్ వసూళ్లను ఆశిస్తున్నారు నిర్మాతలు. ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెరగడం వల్ల ఆదాయం మరింతగా పెరిగే అవకాశముంది. ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్లు కనిపించనున్నారు.
ఇప్పటికే రిలీజ్‌కు ముందు ప్రమోషన్ పాజిటివ్ గా నడుస్తుండగా, ఇప్పుడు టికెట్ ధరల పెంపు అనుమతితో చిత్ర యూనిట్ మరింత జోష్ తో కనిపిస్తోంది. ఇక తొలి వారం వసూళ్లపైనే కన్నప్ప హిట్ రేంజ్ మీద నిర్ణయం పడే అవకాశముంది. ఇక సినిమాకు సంబంధించి ఎవరైనా కావాలని తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని మేకర్స్ ఇదివరకే వార్నింగ్ ఇచ్చారు. ఇక సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
