'కన్నప్ప' ఆలస్యంకు అదన్నమాట కారణం..!
కన్నప్ప సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.
By: Tupaki Desk | 24 May 2025 5:35 PM ISTమంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమా విడుదలకు సిద్ధం అయింది. గత ఏడాది నుంచి అదుగో ఇదుగో అంటూ వాయిదా పడుతూ వచ్చిన కన్నప్పను కచ్చితంగా ఏప్రిల్‌లో విడుదల చేస్తామని ప్రకటించిన మంచు విష్ణు మరోసారి విఫలం అయ్యాడు. ఏప్రిల్ బరి నుంచి తప్పుకున్న కన్నప్ప సినిమాను ఎట్టకేలకు జూన్ 27న విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమా విడుదలకు దాదాపుగా నాలుగు వారాల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో మంచు విష్ణు ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు. గత కొన్ని నెలలుగా సినిమా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్న మంచు విష్ణు విడుదల సమయం దగ్గర పడుతుండగా మరింత యాక్టివ్ అయ్యాడు.
కన్నప్ప సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ప్రధానంగా కన్నప్ప సినిమా విడుదల వాయిదాకు గల కారణం పై విష్ణు సమాధానం ఇచ్చారు. నెలల తరబడి సినిమా వాయిదా పడటంతో బడ్జెట్ విపరీతంగా పెరుగుతుంది కదా అంటూ ప్రశ్నించిన సమయంలో కంటెంట్ బాగా రావడం కోసం రాజీ పడకుండా సీజీ వర్క్ చేయించినట్లు పేర్కొన్నాడు. అందుకు గాను ఆలస్యం అయిందని పేర్కొన్నాడు. తనకు మొదటి నుంచి కొత్త వారిని, కొత్త ట్యాలెంట్‌ను ప్రోత్సహించడం అలవాటు. ఆ అలవాటుతోనే కన్నప్ప సినిమా కోసం వీఎఫ్‌ఎక్స్‌కు గాను కొత్త వారిని ఎంకరేజ్ చేయాలని అనుకున్నాను.
వీఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో కొత్త వారిని ఎంకరేజ్ చేయాలని అనుకున్న తనకు షాక్ ఇచ్చారు. సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం అనుభవం లేని వారిని తీసుకోవడం ద్వారా డబ్బు, సమయం రెండూ వృధా అయ్యాయని మంచు విష్ణు అన్నాడు. ఈ సినిమా కోసం అతడిని తీసుకోవడం చాలా పెద్ద తప్పు అని ఆ తర్వాత నాకు అర్థం అయింది. అతడి వల్లే సినిమా ఆలస్యం అయింది తప్ప మరే కారణం లేదని, సినిమా కంటెంట్ క్వాలిటీ విషయంలో రాజీ పడలేదని, వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం ఎక్కడా రాజీ పడలేదని, చాలా షాట్స్ విదేశాల్లో అత్యంత ఖర్చు చేసి గ్రాఫిక్స్ వర్క్ చేయించినట్లుగా మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. సరైన సమయంకు మా సినిమా వస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
గత రెండు మూడు సంవత్సరాలుగా మంచు విష్ణు 'కన్నప్ప' సినిమాపై వర్క్ చేస్తున్నాడు. అంతకు ముందు నుంచే ఆయన ఈ ప్రాజెక్ట్‌పై వర్క్ చేయడం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో దర్శకుడు మారాడు, ఇంకా చాలా విషయాలు ముందుగా అనుకున్నట్లు కాకుండా కొత్తగా వచ్చి చేరాయి. ఈ సినిమాలో ప్రభాస్ ముఖ్య పాత్రలో గెస్ట్‌గా కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి. మెరుపు తీగ అన్నట్టుగా కాకుండా ప్రభాస్ పాత్ర కాస్త ఎక్కువ సమయం ఉంటుందని మంచు విష్ణు మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ప్రభాస్ మాత్రమే కాకుండా ఈసినిమాలో మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ తదితర ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. జూన్ 27న పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది.
