'కన్నప్ప' ఎఫెక్ట్.. యూనివర్శిటీలో కొత్త కోర్స్
హైదరాబాద్‌లో ఉన్న కంపెనీతో పాటు విదేశాల్లో ఉన్న మొత్తం 8 కంపెనీలకు ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ను అప్పగించాను.
By: Tupaki Desk | 5 Jun 2025 12:30 PMమంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన 'కన్నప్ప' ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా గత ఏడాదిలోనే విడుదల కావాల్సి ఉన్నా కూడా వీఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం కావడం వల్ల సినిమా విడుదల చాలా నెలలుగా వాయిదాలు పడుతూ వచ్చింది. సినిమా షూటింగ్ పూర్తి అయ్యి ఆరు నెలలకు పైగానే అయింది. ఇప్పటి వరకు విడుదల చేయక పోవడంకు కారణం వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాకపోవడం అంటూ మంచు విష్ణు పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌కి ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా కూడా ఆశించిన స్థాయిలో క్వాలిటీ రావడం లేదు అంటూ మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇటీవల కన్నప్ప సినిమా ప్రమోషన్‌లో భాగంగా మంచు విష్ణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీఎఫ్ఎక్స్ వర్క్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కన్నప్ప సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ కోసం తాను గతంలో ఎప్పుడూ లేనంత ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఒక వీఎఫ్‌ఎక్స్ వర్క్ సినిమాను తీయడం ఎంత కష్టమో అర్థం అయింది. ఇండియాలో అందుకు తగ్గట్లుగా టెక్నీషియన్స్ లేకపోవడంతో వర్క్ చాలా ఆలస్యం అవుతోంది. విదేశాల్లో ఈ వర్క్ ను చేయించాల్సి వచ్చింది. అందుకే సినిమా విడుదల విషయంలో జాప్యం అవుతుంది. పైగా ఒక అనుభవం లేని వ్యక్తికి వీఎఫ్‌ఎక్స్ వర్క్ బాధ్యతలను అప్పగించడం వల్ల చాలా నష్టపోయాను అన్నాడు.
హైదరాబాద్‌లో ఉన్న కంపెనీతో పాటు విదేశాల్లో ఉన్న మొత్తం 8 కంపెనీలకు ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ను అప్పగించాను. అన్ని కంపెనీలు చేస్తున్నప్పటికీ మ్యాన్ పవర్ తక్కువగా ఉండటం వల్ల సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయలేక పోతున్నాం. నా ఒక్క సినిమా మాత్రమే కాకుండా చాలా సినిమాలకు ఇదే పరిస్థితి. అందుకే ఇండియాలో వీఎఫ్‌ఎక్స్ నిపుణులను రెడీ చేయాలనే ఉద్దేశంతో మా మోహన్ బాబు యూనివర్శిటీలో ఇందుకు సంబంధించిన కోర్స్ ను ప్రారంభించాలని నిర్ణయించాం. మూడు సంవత్సరాలు ఉండే ఈ వీఎఫ్‌ఎక్స్ కోర్స్‌కు సంబంధించిన డిగ్రీని మా యూనివర్శిటీలో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని నిర్ణయించాం.
ఇండియాలో ఉన్న వీఎఫ్‌ఎక్స్ నిపుణుల అవసరంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న అవసరంను బట్టి అత్యాధునిక టెక్నాలజీని విద్యార్థిని విద్యార్థులకు అందించబోతున్నట్లుగా మంచు విష్ణు ప్రకటించాడు. కన్నప్ప సినిమాకు తాను పడ్డ కష్టం మరే నిర్మాత, దర్శకుడు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో యూనివర్శిటీలో వీఎఫ్‌ఎక్స్ కి సంబంధించిన కోర్స్‌ను ఏర్పాటు చేయడం అనేది అభినందనీయం అంటూ మంచు అభిమానులతో పాటు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన సినిమాకు వీఎఫ్‌ఎక్స్ ఆలస్యం, మళ్లీ వర్క్ చేయడం వంటి కారణాల వల్ల దాదాపుగా రూ.20 కోట్ల నష్టం వచ్చిందని మంచు విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు. యూనివర్శిటీలో ప్రారంభించబోతున్న కోర్స్ గురించి మంచు విష్ణు త్వరలో మరిన్ని వివరాలను వెళ్లడిస్తానంటూ ప్రకటించాడు.