కన్నప్ప వ్యక్తిగా నన్నెంతో మార్చింది
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విష్ణు పలు విషయాల గురించి మాట్లాడాడు. కన్నప్ప సినిమాకు సంబంధించిన ఫస్ట్ రోడ్ షో గుంటూరులోనే జరిగిందని, ఇదొక మెమొరబుల్ జర్నీ అని చెప్పాడు.
By: Tupaki Desk | 8 Jun 2025 11:44 AM ISTమంచు విష్ణు హీరోగా మోహన్ బాబు, ప్రభాస్, శరత్ కుమర్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ కీలక పాత్రల్లో నటించిన పాన్ ఇండియా సినిమా కన్నప్ప. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, దాని కోసం గుంటూరు వెళ్లిన విష్ణు, మోహన్ బాబు అక్కడ జరిగిన కన్నప్ప రోడ్ షోలో పాల్గొన్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విష్ణు పలు విషయాల గురించి మాట్లాడాడు. కన్నప్ప సినిమాకు సంబంధించిన ఫస్ట్ రోడ్ షో గుంటూరులోనే జరిగిందని, ఇదొక మెమొరబుల్ జర్నీ అని చెప్పాడు. తన తండ్రి తనకు దేవుడు అని, ఆయన లేనిదే తాను లేనని చెప్పిన విష్ణు, సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ సినిమా విషయంలో బ్రహ్మానందం తనకు ధైర్యం చెప్తూనే ఉన్నారని చెప్పాడు.
కెరీర్లో నటుడిగా, డైరెక్టర్ గా, కొరియోగ్రఫర్ గా విపరీతమైన సక్సెస్ చూసిన ప్రభుదేవా ఆయన పనులన్నింటినీ పక్కన పెట్టి మూడు సాంగ్స్ చేశారని, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ కు భాష రాకపోయినా ఈ సినిమా చేశారన్నారు. మహాభారతం చూసి అదెంతో గొప్పగా తీశారు, ఇలా కన్నప్ప అనే సినిమా చేయాలనుకుంటున్నాం దాన్ని మీరే డైరెక్ట్ చేయాలని ఆయన్ని రిక్వెస్ట్ చేయగానే వెంటనే ఒప్పుకున్నారని, కన్నప్పను ఆయనెంతో బాగా తీశారని తెలిపాడు విష్ణు.
కన్నప్ప కోసం మ్యూజిక్ డైరెక్టర్ ను 2017లోనే అనుకున్నానని, ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరూ, ఆ శివాజ్ఞతోనే చేశారని అన్నాడు. ఈ సినిమాలో నటించాల్సిన అవసరం లేకపోయినా ప్రభాస్ తన తండ్రి మీద ప్రేమ, గౌరవం, అభిమానంతో కన్నప్పను చేశాడని, నువ్వు మా నాన్న కోసమే ఈ సినిమా చేశావు తప్పించి నా కోసం ఈ సినిమా చేయలేదని ప్రభాస్ ను ఉద్దేశిస్తూ విష్ణు మాట్లాడాడు. ఈ రోజుల్లో కూడా స్నేహానికి విలువ ఉంది అంటే దానికి ప్రభాస్ ఓ ఎగ్జాంపుల్ అని, ప్రభాస్ ను అందరూ తన స్టార్‌డమ్ చూసి ఫ్యాన్స్ అయిపోతారని, కానీ అతన్ని వ్యక్తిగా ప్రేమించాలని, అతనెంత మంచి వాడు, ఎంత గొప్పోడనేది దగ్గరగా చూసిన తమకు తెలుసని ప్రభాస్ ను ఆకాశానికెత్తేశాడు విష్ణు.
మోహన్ లాల్ గారు ఇండియాలోనే ఎంతో పెద్ద స్టార్. అడిగిన వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని, ఇప్పుడు ఆయన అందుబాటులో లేక ఈ ఈవెంట్ కు రాలేదని, ఫ్యూచర్ లో ఆయన కూడా కన్నప్ప ప్రమోషన్స్ లో పాల్గొంటారని, కన్నప్పకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్ చెప్తున్నానని విష్ణు అన్నాడు. కన్నప్ప సినిమా కోసం తాను చేసిన జర్నీ తనను వ్యక్తిగా విపరీతంగా మార్చిందని, కన్నప్ప కథను ప్రేక్షకులకు చెప్పమని ఆ శివుడే తనను ఎన్నుకున్నాడని నమ్ముతున్నానని, ఎన్నో ఏళ్లుగా కన్నప్ప సినిమాను తాము బిడ్డగా చూసుకున్నామని, జూన్ 27న ఈ సినిమాను అందరూ చూడాలని విష్ణు కోరాడు.
