కన్నప్ప హార్డ్ డిస్క్.. ఏం జరిగిందో చెప్పిన మూవీ టీమ్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప హార్డ్ డిస్క్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
By: Tupaki Desk | 27 May 2025 5:17 PM ISTటాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప హార్డ్ డిస్క్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూవీకి సంబంధించిన హార్డ్ డ్రైవ్ ను అనుమతి లేకుండా తీసుకెళ్లారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
అయితే ఆ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కన్నప్ప నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారికంగా స్పందించింది. కన్నప్పలోని రెండు ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కీలకమైన VFX వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ మిస్ అయిందని వెల్లడించింది.
ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి తమ కార్యాలయానికి హార్డ్ డ్రైవ్ రావాల్సి ఉందని తెలిపింది. కానీ పార్సిల్ ను తమకు రాకుండా చట్టవిరుద్ధంగా అడ్డగించారని పేర్కొంది. చరిత అనే మహిళ సూచనల మేరకు శ్రీ రఘు అనే వ్యక్తి సంతకం చేసి ప్యాకేజీని తీసుకున్నారని చెప్పింది. వారిద్దరూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, ప్రతినిధులు కారని వెల్లడించింది.
దీంతో అది దొంగతనమేనని తెలిపింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశామని, దీని వెనుక ఉన్న వారికి సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అధికారులకు అందించామని చెప్పింది. ఈ వ్యవహారాన్ని ఎవరు నడిపించారనేది రహస్యం కాదు, ఆ శక్తుల గురించి తమకు బాగా తెలుసని పేర్కొంది. వారి ఉద్దేశం స్పష్టంగా ఉందని వెల్లడించింది.
అయితే హార్డ్ డిస్క్ ను దొంగిలించిన వ్యక్తులే కన్నప్ప మూవీ రిలీజ్ ను ఆపడానికి, 90 నిమిషాలకు పైగా ఫుటేజ్ ను లీక్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారని ఇటీవల విశ్వసనీయ నిఘా వర్గాలు వెల్లడించాయని చెప్పింది. అందుకే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేశారని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొంది.
పరిశ్రమలో ఇటువంటి చౌకబారు వ్యూహాలు అమలు చేయడం నిరాశపరిచిందని, తెలుగు సినిమా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న సమయంలో ఇలాంటి స్థాయికి దిగజారడం అవమానకరమని కన్నప్ప నిర్మాణ సంస్థ తెలిపింది. కన్నప్పను సినిమాటిక్ ల్యాండ్ మార్క్ గా మార్చడానికి అచంచలమైన నిబద్ధతతో తమ టీమ్ ఐక్యంగా ఉన్నట్లు పేర్కొంది.
పిరికి ప్రయత్నాలకు తాము భయపడమని, ఎప్పటిలాగే నిజం గెలుస్తుందని నమ్ముతున్నామని తెలిపింది. ఏదైనా పైరేటెడ్ కంటెంట్ బయటపడితే దాన్ని ప్రసారం చేయవద్దని కోరుతున్నట్లు తెలిపింది. మూవీ కోసం కొన్నేళ్లుగా కష్టపడుతున్న నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడాలని కోరుతున్నట్లు చెప్పింది.
