Begin typing your search above and press return to search.

అంత ధీమా ఏంటి విష్ణు?

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్తున్న కన్న‌ప్ప సినిమా జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ముకేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో మోహ‌న్ బాబుతో పాటూ ప‌లువురు భారీ తారాగ‌ణం న‌టించారు.

By:  Tupaki Desk   |   10 Jun 2025 12:35 PM IST
అంత ధీమా ఏంటి విష్ణు?
X

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్తున్న కన్న‌ప్ప సినిమా జూన్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ముకేష్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో మోహ‌న్ బాబుతో పాటూ ప‌లువురు భారీ తారాగ‌ణం న‌టించారు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్, మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ తో పాటూ టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌న్న‌ప్ప‌లో కీలక పాత్ర‌ల్లో న‌టించారు.

ఈ సినిమాను మంచు ఫ్యామిలీ భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌డ‌మే కాకుండా ఈ సినిమా కోసం విష్ణు ఎన్నో ఏళ్ల టైమ్ ను కేటాయించాడు. క‌న్న‌ప్ప సినిమాకు రూ.100 కోట్లు అనుకుంటే అది డ‌బుల్ అయింద‌ని కూడా విష్ణు చెప్పాడు. సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్నప్ప‌టికీ క‌న్న‌ప్ప సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ ఇంకా క్లోజ్ అవ‌లేద‌ని స్వ‌యంగా విష్ణు తెలిపాడు.

ప్ర‌స్తుత రోజుల్లో కొంచెం పేరున్న సినిమాల‌కు, పేరున్న కాంబినేష‌న్ల‌కు ఎంతో ముందుగానే డిజిట‌ల్ రైట్స్ ను అమ్మేసి, దాంతో నిర్మాత‌లు సేఫ్ అవాల‌ని చూస్తున్నారు. మూవీ రిలీజ్ త‌ర్వాత రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో తెలీదు కాబ‌ట్టి రిలీజ్ కు చాలా ముందుగానే బిజినెస్ డీల్స్ ను క్లోజ్ చేసేస్తున్నారు. కొన్ని సినిమాలైతే క‌నీసం షూటింగ్ కూడా పూర్తి కాక‌ముందే ఈ డీల్స్ ను క్లోజ్ చేసుకుంటున్నాయి.

కానీ క‌న్న‌ప్ప సినిమాకు ఇప్ప‌టివర‌కు డిజిట‌ల్ రైట్స్ అమ్మ‌కం పూర్త‌వ‌లేద‌ట‌. క‌న్న‌ప్ప సినిమాకు వ‌చ్చిన డీల్ ను విష్ణు రిజెక్ట్ చేశాడ‌ట‌. సినిమా రిలీజ‌య్యాకే డిజిట‌ల్ రైట్స్ అమ్మాల‌ని, అప్పుడే సినిమాకు ఎక్కువ రేటొస్తుంద‌ని భావించి విష్ణు ఆ డెసిష‌న్ తీసుకున్నాడ‌ట. కొన్ని నెల‌ల ముందే ఓ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌తో డిస్క‌ష‌న్స్ జ‌ర‌గ్గా, తాను ఆశించిన నెంబ‌ర్ వాళ్లు చెప్ప‌లేద‌ని, వాళ్లు చెప్పిన రేటు త‌న‌కు న‌చ్చ‌లేద‌ని అందుకే డిజిట‌ల్ రైట్స్ అమ్మ‌లేద‌ని విష్ణు వెల్ల‌డించాడు.

ఆ డిస్క‌ష‌న్స్ లో ఒక‌వేళ సినిమా హిట్టై, ఎక్కువ క‌లెక్ట్ చేస్తే అప్పుడెంత రేటిస్తార‌ని అడిగితే, స‌ద‌రు ఓటీటీ ప్ర‌తినిధులు ఓ నెంబ‌ర్ చెప్పార‌ని, ఆ నెంబ‌ర్ త‌న‌కు న‌చ్చింద‌ని, సినిమా రిలీజై పెద్ద హిట్ట‌య్యాక మ‌ళ్లీ వ‌స్తా, డ‌బ్బులు రెడీ చేసుకోమ‌ని వాళ్ల‌కు చెప్పి వ‌చ్చేశాన‌ని విష్ణు తెలిపాడు. క‌న్న‌ప్ప సినిమా కోసం తాను పెట్టిన డ‌బ్బంతా థియేట‌ర్ల నుంచే వ‌స్తాయ‌ని కూడా విష్ణు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఏదేమైనా క‌న్న‌ప్ప సినిమా అవుట్‌పుట్ పై మంచు విష్ణు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.