కన్నప్ప.. బాక్సాఫీస్ వద్ద గట్టిగానే!
అయితే రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన కన్నప్ప.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.
By: Tupaki Desk | 30 Jun 2025 12:35 AM ISTటాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రెండు రోజుల క్రితం థియేటర్స్ లో రిలీజ్ అయన విషయం తెలిసిందే. బాలీవుడ్ మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. రూ.200 కోట్ల వ్యయంతో సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.
అయితే రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొల్పిన కన్నప్ప.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. పౌరాణిక కథాంశం, గ్రాండ్ ప్రొడక్షన్ స్కేల్ సహా ప్రభాస్ వంటి ప్రసిద్ధ నటులు కీలక పాత్రల్లో నటించడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది. మొదటి రోజు మంచి స్పందన వచ్చింది. చాలా థియేటర్లు హౌస్ ఫుల్ అవ్వడం విశేషం.
అలా టీమ్ లో ఫుల్ జోష్ నింపిన కన్నప్ప.. మొదటి రోజు 20 కోట్ల రూపాయలకు దగ్గరగా వసూలు చేసిందని తెలుస్తోంది. రెండో రోజు 22.5 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అలా ఇప్పటివరకు రెండు రోజులు కలిపి 42.5 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్లు వినికిడి. త్వరలో రూ.50 కోట్ల క్లబ్ లో చేరనుందని టాక్ వినిపిస్తోంది.
మూడో రోజు సండే కావడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కన్నప్ప బాక్సాఫీస్ స్థిరంగానే ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. కానీ హిందీ మార్కెట్ లో స్టార్టింగ్ లో కాస్త నెమ్మదిగా ఉన్నప్పటికీ.. రెండో రోజు నుంచి వసూళ్లలో మెరుగుదల కనిపించినట్లు తెలుస్తోంది.
కన్నప్ప హిందీ వెర్షన్ రెండో రోజు కలెక్షన్లలో దాదాపు 40 శాతం పెరుగుదల ఉన్నట్లు సమాచారం. అయితే తమిళ, మలయాళ మార్కెట్లలో మూవీకి స్పందన అంచనాలకు తగ్గట్టుగానే ఉందట. ఏదేమైనా టాలీవుడ్, బాలీవుడ్ లో మంచి వసూళ్లు సాధిస్తే.. మేకర్స్ సినిమా కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా వెనక్కి రావడం ఈజీ అని చెప్పాలి.
అయితే సినిమా వసూళ్ల వివరాలు వెల్లడించమని ఇప్పటికే మంచు విష్ణు తెలిపారు. కేవలం శివ భక్తిపై తీసిన సినిమా అని, కమర్షియల్ చిత్రంగా రూపొందించలేదని క్లారిటీ ఇచ్చారు. అందుకే వసూళ్ల వివరాలను ఇప్పుడు చెప్పలేమని అన్నారు. కానీ ఆదివారం మొదటి రెండు రోజుల కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతుందని అంచనాలు ఉన్నాయి. మొత్తానికి కన్నప్ప బాక్సాఫీస్ వద్ద గట్టిగానే వెళ్తోంది. ఫైనల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో వేచి చూడాలి.