Begin typing your search above and press return to search.

క‌న్నాంబ‌ను నిజంగా పిచ్చిద‌నుకున్నార‌ట‌!

అయితే అస‌లు టాకీలు మొద‌లైన కొత్త‌ల్లో అంటే 30,40 ద‌శ‌కంలో షూటింగ్ అంటే చాలా మందికి తెలియ‌దు.

By:  Tupaki Desk   |   6 March 2025 9:00 PM IST
క‌న్నాంబ‌ను నిజంగా పిచ్చిద‌నుకున్నార‌ట‌!
X

సినీ ఇండ‌స్ట్రీ ఒక‌ప్పుడున్న‌ట్టు ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఏం చేయాల‌న్నా ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సిందే. ఒక‌ప్పుడు అలా కాదు. ఎప్పుడ‌నుకుంటే అప్పుడు సినిమాలు చేసేవారు. షూటింగ్స్ కు కూడా పెద్ద‌గా ఎక్కువ స‌మ‌యం ప‌ట్టేది కాదు. అయితే అస‌లు టాకీలు మొద‌లైన కొత్త‌ల్లో అంటే 30,40 ద‌శ‌కంలో షూటింగ్ అంటే చాలా మందికి తెలియ‌దు.

సినీ తార‌ల‌ను చూడ్డానికి జ‌నాలు తెగ ఎగ‌బ‌డేవారు. వాళ్ల‌ను కంట్రోల్ చేయ‌డానికే చిత్ర యూనిట్‌కు చాలా టైమ్ ప‌ట్టేది త‌ప్పించి మిగిలిన దేనీకీ పెద్ద‌గా టైమ్ ప‌ట్టేది కాదు. ఇప్ప‌టికీ సెల‌బ్రిటీల విష‌యంలో ఫ్యాన్స్ అంతే ఎగ్జైట్ అవుతున్నారు. అయితే సినిమాలు స్టార్ట్ అయిన టైమ్ లో అస‌లు షూటింగ్ అంటే ఏంటో, ఎలా ఉంటుందో చాలా మందికి తెలియ‌ద‌ట‌.

1938లో గృహల‌క్ష్మి షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు అందులో హీరోయిన్ గా న‌టించిన క‌న్నాంబ‌కు ఓ వింత ప‌రిస్థితి ఎదురైంది. ఆ సినిమా క్లైమాక్స్ లో ఆమె పిచ్చిదైపోయి దేవుడు లేడు, స‌త్యం జ‌యించ‌దూ అని అరుస్తూ రోడ్ల‌పై పరిగెత్తే సీన్ ను చెన్నై జార్జ్ టౌన్ లో తీశారట‌. ఆ జ‌నాన్ని తోసుకుంటూ, బండ్లూ, కార్ల‌ను త‌ప్పించుకుంటూ క‌న్నాంబ ఆ సీన్ లో వెళ్తూ ఉంటుంది.

దాన్నంత‌టినీ ఓ మూల‌న కెమెరా పెట్టి షూట్ చేస్తున్నార‌ట‌. ఆ రోజుల్లో అస‌లు జ‌నాల‌కు షూటింగ్స్ అంటే ఏంటో తెలియ‌క‌పోవ‌డంతో ఎవ‌రో పిచ్చిది రోడ్ల‌పై ప‌రిగెత్తుతుంద‌ని, దేనికిందైనా ప‌డిపోతుంద‌ని భ‌యంతో ఆమెను ఆపేసి ఓ ప‌క్క‌కు కూర్చోబెట్టార‌ట‌. అయితే తాను సినిమా షూటింగ్ లో భాగంగా ఇదంతా చేస్తున్నాన‌ని వివ‌రించి చెప్తే కానీ ఆమెను వాళ్లు వ‌దిలిపెట్ట‌లేద‌ట‌.

ఇక క‌న్నాంబ విష‌యానికొస్తే సినీ ఇండ‌స్ట్రీలో ఆమె తెలియ‌ని వారుండ‌రు. ఏకంగా 170 సినిమాల్లో న‌టించిన ఆమె అప్ప‌ట్లో సినీ రంగంలోనే అత్యంత ధ‌న‌వంతురాలిగా నిలిచింది. కేవ‌లం తెలుగులో మాత్ర‌మే కాకుండా తమిళంలో కూడా ఆమె అదేవిధంగా సినిమాలు చేస్తూ రాణించింది. వీర‌త్వం, క‌రుణ ఉట్టిప‌డి పాత్ర‌ల్లో క‌న్నాంబ ఎంత గొప్ప‌గా ఒదిగిపోయేది.