పాన్ ఇండియా హిట్లతో దూసుకెళ్లిన ఇండస్ట్రీకి పీడకల!
కన్నడ చిత్ర పరిశ్రమ (శాండల్‌వుడ్) ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే నిజంగానే విచారకరం. అలాగే ఆశ్చర్యకరంగా ఉంది. ఒకప్పుడు కేజీఎఫ్, కాంతార వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పరిశ్రమ ఈ ఏడాది తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
By: Sivaji Kontham | 13 Jun 2026 3:00 PM ISTకన్నడ చిత్ర పరిశ్రమ (శాండల్‌వుడ్) ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే నిజంగానే విచారకరం. అలాగే ఆశ్చర్యకరంగా ఉంది. ఒకప్పుడు కేజీఎఫ్, కాంతార వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ పరిశ్రమ ఈ ఏడాది తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సంవత్సరం విడుదలైన కన్నడ చిత్రాలలో కేవలం రెండు సినిమాలు మాత్రమే డబుల్ డిజిట్ (10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ) వసూళ్లను సాధించాయంటే అక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరింత విడ్డూరం ఏమిటంటే.. ఈ ఏడాది ముగిసే సమయానికి కర్ణాటక బాక్సాఫీస్ వద్ద స్థానిక కన్నడ సినిమాల కంటే.. పరభాషా చిత్రాలైన టాలీవుడ్ (తెలుగు), బాలీవుడ్ (హిందీ), కోలీవుడ్ (తమిళం), హాలీవుడ్ సినిమాలు ఎక్కువ సంఖ్యలో డబుల్ డిజిట్ వసూళ్లను సాధించేలా కనిపిస్తున్నాయి. కర్ణాటక మార్కెట్‌ను ఇతర పరిశ్రమలు పూర్తిగా ఆక్రమించేస్తుంటే స్థానిక పరిశ్రమ మాత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో తీవ్రంగా విఫలమవుతోంది. బలమైన కథలు.. విజువల్ గ్రాండియారిటీ.. స్టార్ హీరోల సినిమాలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఇక కన్నడ చిత్రసీమలో ఇండస్ట్రీని నడిపించాల్సిన టాప్ హీరోలలో ఒకరైన `దర్శన్` జైలుపాలై అప్పుడే రెండేళ్లు పూర్తి కావడం గమనార్హం. ఒకవైపు థియేటర్లలో సరైన కంటెంట్ లేక.. మరోవైపు ఉన్న పెద్ద స్టార్ హీరోలు వివాదాల్లో చిక్కుకుని జైలు పాలవ్వడంతో శాండల్‌వుడ్ పూర్తిగా డీలా పడిపోయింది. ఈ సంక్షోభం నుండి కన్నడ పరిశ్రమ ఎప్పుడు కోలుకుంటుందో.. మళ్లీ పాత వైభవాన్ని ఎప్పుడు అందుకుంటుందో వేచి చూడాలి.
కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార, కాంతార 2 వంటి విప్లవాత్మక చిత్రాలతో కన్నడ చలనచిత్ర పరిశ్రమ (శాండల్‌వుడ్) భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సరికొత్త వేవ్‌ను సృష్టించింది. దర్శకులు ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి వంటి అసాధారణ ప్రతిభావంతులు కన్నడ ఇండస్ట్రీ రేంజ్‌ను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చారు. అప్పటివరకు కేవలం ప్రాంతీయ మార్కెట్‌కే పరిమితమైన కన్నడ సినిమాను ప్రపంచస్థాయిలో నిలబెట్టి ఇతర పరిశ్రమలు సైతం ఆశ్చర్యపోయేలా చేశారు. అయితే వారు సృష్టించిన ఆ ఊపును, మార్కెట్‌ను అదే స్థాయిలో ముందుకు తీసుకెళ్లడంలో నేటితరం దర్శకులు పూర్తిగా విఫలమయ్యారనేది జగమెరిగిన సత్యం. సినిమా పరిశ్రమ అనేది ఎప్పుడూ ఒకరిద్దరు దర్శకులపైనే ఆధారపడి నడవకూడదనే చేదు నిజాన్ని శాండల్‌వుడ్ ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతున్నాయి.
ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి ట్రెండ్ సెట్ చేసిన తర్వాత వారి స్థాయి విజయాన్ని లేదా కనీసం పాన్-ఇండియా గుర్తింపును తెచ్చే మరో దర్శకుడు కన్నడ ఇండస్ట్రీలో కనిపించకపోవడం విచారకరం. ఆ ఇద్దరు దర్శకులు వేరే ప్రాజెక్ట్‌లతో బిజీ అవ్వగానే ఇండస్ట్రీ ఒక్కసారిగా డీలా పడిపోయింది. కొత్త కథలతో, వినూత్న ఆలోచనలతో పరిశ్రమను ముందుకు నడిపించే ప్రత్యామ్నాయ శక్తులు లేదా తదుపరి తరం మేకర్స్ ఇక్కడ పుట్టుకురాలేదు. ఫలితంగా బలమైన కంటెంట్ లేక కన్నడ ప్రేక్షకులు ఇతర భాషా చిత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒక పరిశ్రమ నిలకడగా రాణించాలంటే నిరంతరం కొత్త ప్రతిభ, వైవిధ్యమైన దర్శకులు రావాలని... కేవలం ఇద్దరు ముగ్గురిపైనే భారం వేస్తే ఇండస్ట్రీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని కన్నడ సినిమా ప్రస్తుత పరిస్థితి ఒక గట్టి హెచ్చరికలా నిలుస్తోంది.
