Begin typing your search above and press return to search.

'కంగువ' అంటే నిప్పులు కురిపించే డేగ‌?

ద‌క్షిణ భార‌త‌దేశంలో వేగంగా పాన్ ఇండియా హీరోల్ని నిర్మించిన ప‌రిశ్ర‌మ‌గా టాలీవుడ్ పేరు మార్మోగుతోంది.

By:  Tupaki Desk   |   15 Jan 2024 5:59 AM GMT
కంగువ అంటే నిప్పులు కురిపించే డేగ‌?
X

ద‌క్షిణ భార‌త‌దేశంలో వేగంగా పాన్ ఇండియా హీరోల్ని నిర్మించిన ప‌రిశ్ర‌మ‌గా టాలీవుడ్ పేరు మార్మోగుతోంది. ర‌జ‌నీకాంత్- క‌మ‌ల్ హాస‌న్- విజ‌య్- అజిత్ లాంటి పాన్ ఇండియా స్టార్ల‌తో తమిళ చిత్ర‌ప‌రిశ్ర‌మ చాలా ప్ర‌యోగాలు చేసినా కానీ 1000 కోట్ల క్ల‌బ్ సినిమాల్ని అందించ‌డంలో ఇప్ప‌టికీ వెన‌క‌బ‌డే ఉంది. ఇది మ‌ద్రాసీల‌ను మ‌రిగిస్తోంది.


అందుకే ఆ లోటును పూడ్చేందుకు స్టార్ డ‌మ్ ని మ‌రో స్థాయికి తీసుకెళ్లేందుకు త‌మిళ స్టార్ హీరో సూర్య శివ‌కుమార్ త‌హ‌త‌హ‌లాడుతున్నాడు. అదే క్ర‌మంలో అత‌డు నటిస్తున్న తాజా చిత్రం `కంగువ‌`కు బోలెడంత హైప్ నెల‌కొంది. ఈ చిత్రానికి తెలుగు వాడైన ద‌రువు శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. కంగువ అనే టైటిల్ ని ప్ర‌క‌టించ‌గానే దీని అర్థం ఏమిటో తెలుసుకోవాల‌నే త‌ప‌న కూడా అభిమానుల్లో పెరిగింది. కంగువ ఫ‌స్ట్ లుక్ మ‌రింత ఉత్కంఠ‌ను పెంచింది.

నేటి సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని కంగువ టీమ్ ఒక ఆస‌క్తిక‌ర అప్ డేట్ ని చెప్పింది. క‌నుమ రోజున అంటే 16 జ‌న‌వ‌రి 2024న ఉద‌యం 11 గం.ల‌కు ఉత్కంఠ రేకెత్తించే కంగువ సెకండ్ లుక్ ని రిలీజ్ చేస్తున్నామ‌ని టీమ్ ప్ర‌క‌టించింది. ప్రీపోస్ట‌ర్ లో ప్ర‌జ‌ల‌కు హామీ ఇస్తున్న సూర్య చేయి భ‌గ‌భ‌గ మండే నీలికిర‌ణాల‌ను వెద‌జ‌ల్లుతూ గంభీరంగా క‌నిపిస్తోంది. ఆ చేతిపై తీక్ష‌ణమైన క‌నుగుడ్ల‌తో చూస్తున్న డేగ (ఈగిల్) ముఖాకృతిని టాటూ వేయించిన తీరు, అలాగే మోచేతి డిజైన‌ర్ లుక్.. దాని నుంచి దూసుకువ‌స్తున్న అగ్ని క‌ణాలు (బ్లూ రేస్ అనాలి) స్ప‌ష్ఠంగా క‌నిపిస్తున్నాయి. దీంతో అగ్నికి కంగువ‌కు ఉన్న క‌నెక్ష‌న్ ఏమిట‌న్న‌ది తెలుసుకోవాల‌నిపిస్తోంది.

ఇంత‌కుముందే ద‌రువు శివ త‌న సినిమా క‌థ గుట్టు కూడా విప్పాడు. ఇది సూప‌ర్ హీరో సినిమా కాద‌ని, సూర్య‌కు అతీంద్రీయ శ‌క్తులేవీ ఉండ‌వ‌ని కూడా అన్నాడు. ఇది నిజాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే క‌థాంశమే అయినా కానీ త‌మిళుల చ‌రిత్ర‌తో ముడిప‌డిన అంశాలతో రూపొందుతున్న సినిమా అని కూడా తెలిపాడు. సూర్య 42 టైటిల్‌ను కంగువ అని ప్ర‌క‌టించ‌గానే అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొంది. కంగువ అంటే ఏమిటి? గొప్ప‌ శక్తులు ఉన్న పౌరాణిక హీరో సినిమానా? కంగువ ప్రపంచాన్ని ఎలా నిర్మిస్తున్నారు? అంటూ దర్శకుడు శివకు ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయట‌.

అలాగే టైటిల్ మీనింగ్ ఏమిటో కూడా శివ వివ‌రించాడు. కంగువ‌ అనే తమిళ పదానికి అగ్ని అని అర్ధం. కంగువ అంటే అగ్నిలా ద‌హించే శక్తి ఉన్న మనిషి! అని ద‌ర్శ‌కుడు శివ ఇంత‌కుముందే సూర్య పాత్ర‌పై లీక్ ఇచ్చారు. దానిని సాహిత్యపరమైన అర్థంలో తీసుకోవద్దని కూడా హెచ్చరించాడు. చారిత్ర‌క అంశాల‌తో బ్యాక్ గ్రౌండ్ సెట్టింగ్ ఎవరైనా దీనిని నమ్మేలా చేస్తుంది. అయితే కంగువ అనేది ఫాంటసీ చిత్రం కాదు.. సూర్య సర్ పాత్రకు ఎలాంటి సూపర్ పవర్స్ లేవు. అయితే అగ్నితో సంబంధం ఏమిటి? అన్న‌ది తెర‌పై చూపిస్తాను. పురాతన కాలంలో మనం అగ్నిని ఆరాధించేవాళ్ళం.. అందులోని అంశాలను సినిమాలో ఉపయోగించాం! అని శివ వెల్లడించారు.

భారీ సెట్టింగుల గురించి మాట్లాడుతూ.. నేను ఎప్పటినుంచో ఒక ఊహాత్మక ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నాను.. కంగువతో ఆ కలను సాకారం చేసుకోగలిగాను అని శివ చెప్పారు. ఇది 1500 సంవత్సరాల క్రితం సాగే చిత్రం.. పురాతన తమిళ సంస్కృతి భార‌త‌దేశంలోని ఇతర సంస్కృతుల నుండి అన్ని ప్రాంతాలలోని అంశాలను ఉపయోగించుకునే క‌థ‌. కంగువ అనేది బలమైన చారిత్రిక అంశాలు, వాస్తవాలతో ఊహాత్మక ప్రపంచంలో జరిగే కల్పిత కథ అని కూడా తెలిపాడు. కంగువ వంటి గొప్ప ప్రపంచాన్ని నిర్మించాలంటే గొప్ప‌ సాంకేతిక నైపుణ్యం..విస్తృతమైన కళాత్మక అంశాల‌తో కూడుకున్న సెట్ల‌ నిర్మాణాన్ని చేప‌ట్టాల్సి ఉంటుంది. మునుముందు మేకింగ్ వీడియోతో కంగువ ప్రపంచాన్ని వెలుగులోకి తెచ్చేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందని శివ చెప్పారు. కంగువ కళాకృతి పెద్ద లేబొరేటరీ లాంటి ప్రదేశాలలో రూపొందించామ‌న్నారు. ప్రేక్షకులకు దానిని చూపిస్తామ‌ని అన్నారు.

టైటిల్ లాంచ్ లో ఒక కుక్క, గుర్రం .. సూర్య ముసుగు గురించి కూడా తెలిపారు. ముఖ్యంగా ఇందులో చూపిస్తున్న డేగ పాత్ర కూడా చాలా కీల‌కం అని అన్నారు. ఈ చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేయడమే కాకుండా కంగువను 3డిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 3D మ‌హ‌దాద్భుతాన్ని ఆస్వాధించేలా ఇందులో ఏడు సన్నివేశాలు ఉన్నాయని కూడా శివ తెలిపారు. దాదాపు అర‌వై శాతం చిత్రీక‌ర‌ణ పూర్తయింది. కంగువ 2024 ప్రారంభంలో విడుదల చేస్తామ‌ని తెలిపారు. కంగువ కోసం మూడు సంవత్సరాలుగా పని చేస్తున్నామ‌ని కూడా శివ తెలిపారు. సూర్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తున్నార‌ని అన్నారు. స్టూడియె గ్రీన్ ప‌తాకంపై జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు.