స్టార్ హీరోయిన్ కు షాక్ ఇచ్చిన సీనియర్ జర్నలిస్ట్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి ప్రధాన పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 23 April 2025 10:44 AM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి ప్రధాన పాత్రలో నటించిన 'ఎమర్జెన్సీ' జనవరి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేట్రికల్ రిలీజ్ అయిన ఎమర్జెన్సీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆధరణ దక్కలేదు. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ నమోదు కాలేదు. కానీ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన సమయంలో అత్యధికులు ఈ సినిమాను చూశారు, ఇంకా చూస్తూనే ఉన్నారు. కొన్ని వారాల పాటు సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ట్రెండ్ అయింది. ఓటీటీ స్ట్రీమింగ్ సమయంలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు, ఎంతో మంది ప్రముఖులు, సామాన్యులు సైతం సినిమా పై ప్రశంసలు కురిపించారు.
సినిమా థియేట్రికల్ రన్ పూర్తి అయింది, ఓటీటీలోనూ ఇప్పటికే ప్రేక్షకులు చూశారు ఇలాంటి సమయంలో సినిమా చుట్టూ వివాదం రాజుకోవడం చర్చనీయాంశం అయింది. ఈ సినిమాను సీనియర్ జర్నలిస్ట్, రచయిత కూమి కపూర్ రచించిన 'ది ఎమర్జెన్సీ : ఎ పర్సనల్ హిస్టరీ' అనే పుస్తకం ఆధారంగా రూపొందించినట్లు టైటిల్ కార్డ్‌లో పేర్కొన్నారు. ఇప్పుడు అదే పెద్ద వివాదంగా మారింది. కూమి కపూర్ ఇటీవల మీడియా ముందుకు వచ్చి తాను పుస్తకంలో రాసినట్లుగా కాకుండా పలు సన్నివేశాలను వక్రీకరించారు, తమకు తోచిన విధంగా కథను మార్చుకున్నారని ఆరోపించారు. అలా వక్రీకరించిన కథను తన పుస్తకం నుంచి తీసుకున్నట్లుగా టైటిల్ కార్డ్ వేయడంతో తన పరువుకు భంగం కలిగిందని కూమి కపూర్ కోర్టును ఆశ్రయించారు.
కూమి కపూర్ తన ఫిర్యాదులో.. పుస్తకం హక్కులను కొనుగోలు చేసిన సమయంలోనే ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందం ప్రకారం రచయిత అనుమతి లేకుండా ప్రచారం కోసం ఆమె పేరును కానీ, పుస్తకం పేరును కానీ వినియోగించకూడదు. సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసిన సమయంలో తాను గోవాలో ఉన్నాను అని, స్క్రిప్ట్ చదవలేక పోయాను అంది. వాళ్లు ఒప్పందాన్ని గౌరవిస్తారని అనుకున్నాను. కానీ నా అనుమతి లేకుండానే వారు నా పేరును వినియోగించుకున్నారు, వారు నా పుస్తకం పేరును కూడా సినిమా టైటిల్ కార్డ్స్‌లో వేశారు. సినిమా కథలో చాలా లోపాలు ఉన్నాయి. నేను రాసిన దాన్ని రచయిత చాలా మార్పులు చేయడం కనిపించిందని ఆమె పేర్కొన్నారు.
ఒప్పందాన్ని గౌరవించలేదని కొన్ని రోజుల క్రితమే లీగల్ నోటీసులు పంపించాను. కంగనా, నెట్‌ఫ్లిక్స్ సంస్థ వారు లీగల్ నోటీసులకు స్పందించలేదు. అందుకే కోర్ట్ కి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె పేర్కొంది. తన అనుమతి లేకుండా తన పేరును, తన పుస్తకం పేరును వినియోగించినందుకు గాను పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. సినిమా నిర్మాతపై మరియు నెట్‌ఫ్లిక్స్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్ట్‌ను కోరుతున్నట్లు ఆమె తెలియజేసింది. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న కంగనా రనౌత్ ను రాజకీయంగా కూడా ఈ వివాదం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి.
