సూపర్ స్టార్లను మించి సూపర్‌స్టార్ డైరెక్టర్‌లు తోపులు
తాజాగా ఆదిత్యా ధర్ దర్శకత్వంలో వచ్చిన దురంధర్ 2 సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో క్వీన్ సోషల్ మీడియా వేదికగా దర్శకుల ప్రాముఖ్యత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Sivaji Kontham | 22 March 2026 5:00 PM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడూ హీరోలదే పైచేయిగా ఉంటుంది. కానీ ఈ ధోరణి మారాలని.. దర్శకులే అసలైన సూపర్‌స్టార్లని నటి కంగనా రనౌత్ గట్టిగా వాదిస్తున్నారు. తాజాగా ఆదిత్యా ధర్ దర్శకత్వంలో వచ్చిన దురంధర్ 2 సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో క్వీన్ సోషల్ మీడియా వేదికగా దర్శకుల ప్రాముఖ్యత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిత్యా ధర్ ఒక `సూపర్‌స్టార్ డైరెక్టర్`గా ఎదగడం ఈ సినిమా సాధించిన అతిపెద్ద విజయమని కొనియాడారు.
హాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఉదాహరణగా తీసుకుంటూ కంగనా మన దేశంలోని పరిస్థితులను విశ్లేషించారు. హాలీవుడ్‌లో స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్, క్వింటన్ టరాంటినో వంటి దర్శకులకు అక్కడ ఉండే అగ్ర హీరోల కంటే ఎక్కువ క్రేజ్, గౌరవం ఉంటుందని గుర్తు చేశారు. అక్కడ మేకర్స్ స్థానం ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుందని.. మన దగ్గర కూడా అటువంటి మార్పు రావాలని క్వీన్ ఆకాంక్షించారు. దర్శకుడి విజన్ బాగుంటేనే సినిమా అద్భుతంగా వస్తుందని.. కానీ మన దగ్గర క్రెడిట్ అంతా హీరోలకే వెళ్తోందని కంగన అభిప్రాయపడ్డారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కంగనా సూటిగా స్పందించారు. మన దర్శకులు విపరీతమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, అయినప్పటికీ వారికి దక్కాల్సిన గౌరవం కానీ సరైన పారితోషికాలు కానీ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా.. పరిశ్రమలోని కొందరు సూపర్ స్టార్ హీరోలు దర్శకులను వేధింపులకు గురిచేస్తున్నారని కంగన సంచలన ఆరోపణ చేశారు. ఇలాంటి కారణాల వల్లే యువత టెక్నికల్ రంగాల వైపు రావడానికి ఆసక్తి చూపడం లేదని విశ్లేషించారు.
నేటి తరం యువతలో ప్రతి ఒక్కరూ నటులు కావాలని మాత్రమే కోరుకుంటున్నారని.. కానీ ఎవరూ సినిమాటోగ్రాఫర్లుగానో లేదా టెక్నీషియన్లుగానో స్థిరపడాలని కలలు కనడం లేదని కంగనా పేర్కొన్నారు. అందరూ హీరోల గ్లామర్ చూసి మోసపోతున్నారని.. కానీ అసలైన సినిమాను సృష్టించేది టెక్నీషియన్లే అని గుర్తు చేశారు. ఆదిత్యా ధర్ వంటి దర్శకులు హీరోల కంటే ఎక్కువ షైనింగ్ గా మెరుస్తున్నారని.. అతడిని చూసి భవిష్యత్తులో ఎంతోమంది దర్శకులు కావాలని ఆశపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతిమంగా `దురంధర్ 2` సక్సెస్ క్రెడిట్ పూర్తిగా దర్శకుడు ఆదిత్యాధర్‌కే ఇచ్చారు. ఈ విషయంలో చిత్ర హీరో రణవీర్ సింగ్‌ను కనీసం ట్యాగ్ కూడా చేయకపోవడం గమనార్హం. కేవలం నటుల మీద ఆధారపడి సినిమాలు నడవవని.. దర్శకుడి సృజనాత్మకతకు తగిన గుర్తింపు ఇచ్చినప్పుడే పరిశ్రమ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని కంగనా స్పష్టం చేశారు. ఆదిత్యా ధర్ సినిమాటిక్ విజన్‌కు సెల్యూట్ చేస్తూ.. భారతీయ సినిమాలో ఇకనైనా దర్శకుల ప్రాముఖ్యత పెరగాలని తన అభిప్రాయాన్ని బలంగా వినిపించారు. అయితే కంగన వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత రణ్ వీర్ సింగ్ లేదా స్టార్ హీరోలను తగ్గించేందుకే ఇలా దర్శకులను హైలైట్ చేసారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. అయినా టెక్నీషియన్ ని ప్రశంసించాలనే తన తపనను అందరూ ప్రశంసిస్తున్నారు. కంగన మోటో ఏమిటన్నది అందరూ అర్థం చేసుకుంటున్నారు. అన్నట్టు ఎమర్జెన్సీ తర్వాత మళ్లీ కంగనలోని దర్శకురాలు నిదుర లేచేది ఎపుడో చెప్పాలని చాలా మంది అడుగుతున్నారు. దీనికి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.
