లాక్ అప్-2 లో ఒకరికి బధులు ఇద్దరు!
ఓటీటీ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన బోల్డ్ రియాలిటీ షో లాక్ అప్ సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.
By: Srikanth Kontham | 11 Jun 2026 10:00 PM ISTఓటీటీ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన బోల్డ్ రియాలిటీ షో లాక్ అప్ సరికొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. అయితే రెండో సీజన్‌లో నిర్వాహకులు ఊహించని భారీ మార్పును చేశారు. మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించి తనదైన శైలిలో షోను నడిపించిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, నటి కంగనా రనౌత్ ఈసారి షోలో కనిపించడం లేదు. ఆమె స్థానంలో ప్రముఖ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్.. బాలీవుడ్ క్రేజీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ జంటగా కొత్త హోస్ట్‌లుగా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు విడుదలైన అధికారిక టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొదటి సీజన్ ఘనవిజయం సాధించడంలో కంగనా రనౌత్ హోస్టింగ్ అప్పట్లో కీలక పాత్ర పోషించింది. కంటెస్టెంట్లను తనదైన శైలిలో ప్రశ్నిస్తూ జైలర్ తరహాలో అమ్మడు ప్రదర్శించిన కఠినమైన వైఖరి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం కంగన రాజకీయాలలో బిజీగా ఉండటం .. ఇతర సినిమా ప్రాజెక్టుల వల్ల ఈ సీజన్‌కు అందుబాటులో లేకపోయింది. కంగనా వంటి పవర్‌ఫుల్ హోస్ట్ స్థానాన్ని భర్తీ చేయడం సాధారణ విషయం కానప్పటికీ మేకర్స్ ఇద్దరు ప్రముఖ సెలబ్రిటీలను రంగంలోకి దించి షోపై అంచనాలను మరింత పెంచేశారు.
తాజాగా విడుదలైన సరికొత్త టీజర్‌లో ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్‌లు సరికొత్త కారాగార వాతావరణంలో దర్శనమిచ్చారు. `లాక్ అప్ సీజన్ 2` మరింత కఠినంగా, వినోదాత్మకంగా , మునుపటి కంటే భిన్నమైన నియమ నిబంధనలతో సాగుతుందని టీజర్ తో అర్దమవుతుంది. ఈసారి జైలు నిబంధనలు మారాయి. ఆట తీరు మారింది అంటూ వారు చెప్పిన డైలాగులు షో ఎంత బోల్డ్‌గా ఉండబోతోందో హింట్ ఇస్తున్నాయి. సరికొత్త హోస్ట్‌ల కాంబినేషన్ షోకు సరికొత్త ఎనర్జీని తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.
హోస్ట్‌లుగా రాబోతున్న ఫరా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్‌లకు టెలివిజన్ - ఓటీటీ రియాలిటీ షోలను నడిపించిన గత అనుభవం ఉంది. ఫరా ఖాన్ గతంలో `బిగ్ బాస్` వంటి పెద్ద షోలకు తాత్కాలిక హోస్ట్‌గా వ్యవహరించి తనదైన కామెడీ , కౌంటర్లతో మెప్పించారు. ఇక రితేష్ దేశ్‌ముఖ్ సైతం రీజినల్ రియాలిటీ షోలను విజయవంతంగా హోస్ట్ చేసి హోస్టింగ్‌లో తనకంటూ ప్రత్యేక శైలిని సంపాదించుకున్నారు. ఇద్దరి మధ్య ఉండే మంచి బాండింగ్, హుషారైన మాటతీరు షోను మరో స్థాయికి తీసుకెళ్తాయని మేకర్స్ నమ్ముతున్నారు.
లాక్ అప్ షో ప్రత్యేకత ఏమిటంటే? ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు తమ జీవితంలోని అత్యంత వివాదాస్పదమైన రహస్యాలను వెల్లడిస్తూ జైలు రూమ్స్ నుండి తదుపరి దశకు అర్హత సాధించాల్సి ఉంటుంది. మొదటి సీజన్‌లో మునావర్ ఫారుఖీ విజేతగా నిలిచి భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు. రెండో సీజన్ కోసం కూడా చిత్ర పరిశ్రమ, సోషల్ మీడియాకు చెందిన పలువురు వివాదాస్పద , ప్రముఖ సెలబ్రిటీలను ఎంపిక చేసినట్లు సమాచారం. హోస్ట్లు మారిన నేపథ్యంలో కంటెస్టెంట్లపై ఎలాంటి కఠినమైన చర్యలు ఉంటాయో చూడాలి.
