సినిమా రంగాన్ని వైసీపీలా ఏడిపించం: మంత్రి కందుల
జనసేన నాయకుడు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ యాక్టివ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలి సిందే.
By: Tupaki Desk | 14 April 2025 9:53 AM ISTజనసేన నాయకుడు, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ యాక్టివ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలి సిందే. పర్యాటక రంగాన్ని ఆయన విన్నూత్న రీతిలో పరుగులు పెట్టిస్తున్నారు. పెట్టుబడులు ఆకర్షించ డంతోపాటు.. వినూత్న రీతిలో పర్యాటక రంగానికి కొత్త సొబగులు అద్దుతున్నారు. ఈ పరంపరలో ఇప్పుడు సినిమా నిర్మాణానికి కూడా కొత్త పాలసీ తీసుకువస్తామని కందుల ప్రకటించారు. ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు.
తాజాగా.. ఆదివారం విజయవాడలో `వారాహి ఆర్ట్స్ అండ్ శక్తి క్రియేషన్స్` నిర్మిస్తున్న `వెస్ట్రన్ లవ్` అనే సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కందుల.. తొలి క్లాప్ కొట్టారు. అనంతరం ఆయన మాట్లాడు తూ... ఏపీలో సినిమా రంగానికి గతంలో దుర్గతి పట్టిందని.. సినిమాలను, హీరోలను కూడా రాజకీయంగా వేధించారని అన్నారు. అయితే.. వైసీపీ ప్రభుత్వం మాదిరిగా కూటమి ప్రభుత్వం సినిమా రంగానికి ఎలాంటి ఇబ్బందులు రానివ్వదని చెప్పారు.
``వైసీపీలా మేం ఎవరినీ ఏడిపించం. ఎవరినీ మా చుట్టూ తిప్పుకోం. మీరు మంత్రుల కమిటీ చుట్టూ తిరిగే అవకాశం కూడా ఇవ్వం`` అని కందుల వ్యాఖ్యానించారు. సినిమా షూటింగ్ లకు ఏపీ అనువైన ప్రాంతమన్న ఆయన.. చిత్ర పరిశ్రమ ఇక్కడ అభివృద్ధి చెందాలని సీఎం, డిప్యూటీ సీఎం సహా మంత్రులు సైతం అభిలషిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో స్టూడియోలు ఉన్నప్పటికీ వినియోగంలో లేవని, సత్వరమే వాటిని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే.. రాష్ట్రంలో షూటింగులు చేసే నిర్మాతలు, దర్శకులు.. ఇక్కడి వారికి ఉపాధి కల్పించాలన్నదే తమ సూచనగా.. కందుల చెప్పారు. ఈ విషయంలో తప్ప. ఇతర ఏ విషయంలోనూ తమ వైపు నుంచి ఎలాంటి కోరికలు, డిమాండ్లు లేవన్నారు. కుదిరితే.. కోనసీమను సినిమాలకు పర్యాటక కేంద్రంగా మార్చే ఆలోచన ఉందన్నారు. చిత్ర పరిశ్రమతో స్థానికంగా యువతకు, సిబ్బందికి ఉపాధి లభించాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించి త్వరలోనే కొత్త పాలసీ ని తీసుకురానున్నట్టు మంత్రి చెప్పారు.
