'కాంచన' ఫ్యాన్స్‌కి ఓ గుడ్ న్యూస్
రాఘవ లారెన్స్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కాంచన ప్రాంచైజీకి తమిళ ప్రేక్షకుల్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు
By: Tupaki Desk | 12 July 2025 11:12 AM ISTరాఘవ లారెన్స్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కాంచన ప్రాంచైజీకి తమిళ ప్రేక్షకుల్లోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ పెద్ద ఎత్తున అభిమానులు ఉంటారు. ముని నుంచి మొదలుకుని వచ్చిన ప్రతి ప్రాంచైజీ మూవీకి తెలుగులో భారీ విజయం దక్కింది. తమిళ్‌తో సమానంగా తెలుగు మార్కెట్‌లో వసూళ్లు సాధిస్తున్న కాంచన ప్రాంచైజీ నుంచి మరో సినిమా రాబోతోంది. కాంచన 4 టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన కీలక అప్‌డేట్ తమిళ సినీ వర్గాల నుంచి అందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఉండబోతున్నట్లు మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు.
ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసినట్లు కొన్ని రోజుల క్రితం రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చాడు. అధికారికంగా ఎలాంటి అప్డేట్ లేనప్పటికీ సినిమా గురించి ఎప్పటికప్పుడు మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మహాభలిపురంలో సాగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. రాఘవ లారెన్స్‌తో పాటు షూటింగ్‌లో పూజా హెగ్డే పాల్గొంది. ఇంకా కీలక పాత్రలో నటిస్తున్న నటీ నటులు సైతం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో వచ్చిన కాంచన సినిమాలతో పోల్చితే మరింత భయపెట్టి నవ్వించే విధంగా ఈ సినిమా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న మహాభలిపురం షెడ్యూల్‌ను మరో రెండు మూడు రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే తుది షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టులో సినిమా ను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అతి త్వరలోనే సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమాను విజువల్ వండర్‌గా రూపొందించే ఉద్దేశంతో దర్శకుడు లారెన్స్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కాంచన 4 సినిమాకు హిందీ మార్కెట్‌లోనూ మంచి బజ్ ఉంది కనుక అక్కడ భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాలో లారెన్స్, పూజా హెగ్డేతో పాటు ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ప్రాంచైజీలో కనిపించిన కొందరు నటీనటులు ఈ సినిమాలోనూ కనిపించబోతున్నారు. కాంచన 4పై ఉన్న అంచనాల నేపథ్యంలో దర్శకుడు రాఘవ లారెన్స్ బడ్జెట్ ను గత చిత్రాలతో పోల్చితే ఎక్కువగా ఖర్చు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. కాంచన 4 సినిమాతో వంద కోట్లకు మించి వసూళ్లు సాధిస్తామని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. నవ్విస్తూ, భయపెడుతున్న సినిమాలకు ఈ మధ్య కాలంలో మంచి స్పందన ఉంది. స్త్రీ 2 సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. అందుకే కాంచన 4 సినిమా పాన్ ఇండియా మార్కెట్‌లో కుమ్మేయడం ఖాయం అంటున్నారు.
