కన్నప్పపై బ్రాహ్మణ సంఘాల ఫైర్.. విష్ణు రెస్పాన్స్ ఇలా!
ఇప్పుడు ఆ క్యారెక్టర్లపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 8 Jun 2025 10:28 AM ISTటాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీపై కొన్ని బ్రాహ్మణ సంఘాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. తమ వర్గాన్ని కించపరిచేలా కన్నప్ప మేకర్స్.. సినిమాలో రెండు పాత్రలకు పేర్లు పెట్టారని చెబుతున్నాయి. బ్రాహ్మణ పాత్రలకు అభ్యంతరకర పేర్లు పెట్టడం కరెక్ట్ కాదని, వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.
లేకుంటే సినిమాను బహిష్కరిస్తామని, కోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నాయి. అయితే కన్నప్పలో పిలక - గిలక క్యారెక్టర్లలో బ్రహ్మానందం, సప్తగిరి నటిస్తున్నారు. బ్రాహ్మణులుగా నటిస్తున్న వాళ్లిద్దరి ఫస్ట్ లుక్ గత ఏడాది మేకర్స్ రిలీజ్ చేశారు. చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట నేర్పిన గుగ్గురువులు అంటూ వారిని పరిచయం చేశారు.
ఇప్పుడు ఆ క్యారెక్టర్లపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కాగా.. తాజాగా ఆ వివాదంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంచు విష్ణు. ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన.. శ్రీకాళహస్తి ప్రధాన అర్చకులకు ఫస్ట్ కాపీ చూపించినట్లు వెల్లడించారు.
"గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం కావడంతో సినిమా రిలీజ్ లేట్ అయింది. ఆ సమయంలో నాకు ఓ ఆలోచన వచ్చింది. శ్రీకాళహస్తి ఆలయ ప్రధాన అర్చకులను సంప్రదించారు. సంస్కృత కాలేజీ ప్రిన్సిపాల్ తో పాటు, శ్రీకాళహస్తి టెంపుల్ ఛైర్మన్ ను కూడా పిలిపించాను. వాళ్లందరికీ ఫస్ట్ కాపీ రెడీ అవ్వకముందే సినిమా చూపించా" అని విష్ణు తెలిపారు.
"సినిమా చూపించినప్పుడు.. ఏమైనా తప్పులు ఉంటే చెప్పమని కోరాను. తప్పులుంటే ఇప్పుడే మార్చుకుంటానని కూడా చెప్పాను. వారంతా సినిమా చూశారు. మొత్తం మూవీ అంతా ఓకే అని చెప్పారు. ఒక్క డైలాగ్ కూడా ఛేంజ్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. అంతే కాదు భక్తి అంటే ఇలా ఉండాలి" అని పొగిడారు అని చెప్పారు.
అయితే ప్రముఖ పుణ్యక్షేత్ర ప్రధాన అర్చకులు సినిమాలో ఎలాంటి ఛేంజెస్ లేవని చెప్పినప్పుడు.. ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయం విష్ణు వ్యాఖ్యల్లో క్లియర్ గా తెలుస్తోంది. ఆయన వరకు అదే కరెక్ట్ అవ్వొచ్చు. కానీ కొన్ని బ్రాహ్మణ సంఘాలు పిలక- గిలక పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరి ఆ విషయంలో చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
