Begin typing your search above and press return to search.

క‌మ‌ల్‌హాస‌న్ ఆస్తులు అంత త‌క్కువా?

కమల్ హాసన్ కి చెన్నై స‌హా త‌మిళ‌నాడులో ప‌లు అపార్ట్ మెంట్లు, సొంత ఇల్లు, విల్లాలు ఉన్నాయి. అలాగే లండ‌న్ లో విలాసవంతమైన ఇల్లు ఉంది.

By:  Tupaki Desk   |   7 Nov 2023 7:46 AM GMT
క‌మ‌ల్‌హాస‌న్ ఆస్తులు అంత త‌క్కువా?
X

భారతీయ దిగ్గ‌జ నటుడు, లెజెండ‌రీ కమల్ హాసన్ ఈరోజు తన 69వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా అత‌డిపై మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా క‌మ‌ల్ హాస‌న్ కొన్ని వ‌రుస ప‌రాజ‌యాల త‌ర్వాత విక్ర‌మ్ తో గ్రేట్ కంబ్యాక్ అయిన విధానం, అత‌డు జీవితాంతం సంపాదించిన ఆస్తుల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ నెట్ వర్త్ ఎంత‌? ద‌శాబ్ధాల పాటు క‌థానాయ‌కుడిగా రాణించిన అత‌డు బిగ్ బాస్ హోస్ట్ గా కొన‌సాగుతూ ఎంత మొత్తం సంపాదించారు? ఎన్ని ఇల్లు, ఆస్తులు ఉన్నాయి? ఎన్ని క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్సులున్నాయి? ఎన్ని ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి? అంటూ అభిమానులు ఆరాలు తీస్తున్నారు. నిజానికి ఏ ఇత‌ర స్టార్ తో పోల్చినా సినీరంగంలో చాలా చిన్న వ‌య‌సు నుంచి కొన‌సాగుతున్న న‌టుడు క‌మ‌ల్ హాస‌న్.

విల‌క్ష‌ణ న‌టుడిగా అత‌డు చేసిన‌న్ని ప్ర‌యోగాలు వేరొక హీరో చేయ‌లేదు అంటే అతిశ‌యోక్తి కాదు. న‌ట‌విశ్వ‌రూపానికి మీనింగ్ అత‌డు. ఇటీవ‌లే 'విక్రమ్' చిత్రంతో కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టారు. ఆ సంవత్సరం భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు చేసిన సినిమాలలో ఇది ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా తమిళ బిగ్ బాస్ కొత్త‌ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

కమల్ హాసన్ కి చెన్నై స‌హా త‌మిళ‌నాడులో ప‌లు అపార్ట్ మెంట్లు, సొంత ఇల్లు, విల్లాలు ఉన్నాయి. అలాగే లండ‌న్ లో విలాసవంతమైన ఇల్లు ఉంది. ఉల‌గ‌నాయ‌గ‌న్ గ్యారేజీలో హై-ఎండ్ కార్లు అర‌డ‌జ‌ను పైగానే ఉ్నన్నాయి. అత‌డు విలాసవంతమైన జీవనశైలిని క‌లిగి ఉన్నాడు.

కమల్ హాసన్ ఇప్ప‌టివ‌ర‌కూ కూడ‌బెట్టిన ఆస్తుల‌ను ప‌రిశీలిస్తే.. తన వద్ద రూ.131 కోట్ల విలువైన ఆస్తులు (స్థిర ఆస్తులు) ఉన్నాయని, ఇందులో రూ.17 కోట్ల విలువైన వ్యవసాయ భూమి ఉందని మీడియాలో క‌థ‌నాలు వస్తున్నాయి. కమల్ హాసన్ చెన్నై నివాసంతో పాటు విలాసవంతమైన ఫాంటసీ ప్యాలెస్‌ను కలిగి ఉన్నారు. అక్కడ అతని పెద్ద కుటుంబం ఇటీవల ఒక గెట్-టుగెదర్ పార్టీలో క‌లుసుకున్న‌ప్ప‌టి ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. చెన్నైలో ఒక సొంత ఇల్లు ఉంది. అతను ఇటీవల తన అద్భుతమైన భవనాన్ని అధునాత‌న వ‌స‌తుల‌తో పూర్తిగా రీమోడ‌లింగ్ చేయించాడు. GQ నివేదికల ప్రకారం, కమల్ హాసన్ మొత్తం చెన్నై రియల్ ఎస్టేట్ ఆస్తులు, అతని వాణిజ్య భవనాలు, ఇతర ఆస్తులు సహా మొత్తం 92.5 కోట్ల రూపాయల ఆస్తి విలువ‌ను క‌లిగి ఉన్నాడు. ఇత‌ర‌త్రాలు అన్నీ క‌లుపుకుని 131 కోట్లు పైగా ఆస్తుల‌ను క‌మ‌ల్ హాస‌న్ క‌లిగి ఉన్నారు. ఇటీవ‌ల విక్ర‌మ్ స‌క్సెస్ త‌ర్వాత ఒక్కో సినిమాకి 30కోట్లు పైగా అందుకుంటూ ఆ సంపాద‌న‌ను త‌న నిక‌ర ఆస్తికి అద‌నంగా జోడిస్తున్నాడ‌ని కూడా విశ్లేషిస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ ఇటీవ‌ల సంత‌కాలు చేసిన‌ ప్రాజెక్టుల నుంచి సుమారు 100 కోట్లు ఆర్జించాడ‌ని కూడా టాక్ ఉంది. ఇక విక్ర‌మ్ స‌క్సెస్ తో త‌న పాత అప్పుల‌న్నీ తీర్చేశాడు గ‌నుక, ఇప్పుడు సంపాదించేదంతా బోన‌స్ అన్న చ‌ర్చా అభిమానుల్లో సాగుతోంది.

నిజానికి నేటిత‌రం హీరోలు, హీరోయిన్లు చాలా వేగంగా ఆస్తుల‌ను కూడ‌బెడుతున్నారు. కోట్లాది రూపాయ‌ల ఆస్తుల‌ను సంపాదిస్తున్నారు. తెలివిగా రియ‌ల్ వెంచ‌ర్లు, ఇత‌ర వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. ప్ర‌ముఖ బాలీవుడ్ హీరోయిన్లు త‌క్కువ కెరీర్ లోనే దీపిక ప‌దుకొనే, అనుష్క శ‌ర్మ లాంటి స్టార్లు వంద‌ల కోట్ల ఆస్తుల‌ను ఆర్జించారు. కానీ క‌మ‌ల్ హాసన్ లాంటి స్టార్, సుదీర్ఘ కాలం పాటు న‌టుడిగా కొన‌సాగినా కానీ వారితో పోలిస్తే ఆర్జ‌న‌లో వెన‌క‌బ‌డ్డార‌ని కూడా అభిమానులు విశ్లేషిస్తున్నారు. బ‌హుశా క‌ళాతృష్ణ త‌ప్ప క‌మ‌ర్షియ‌ల్ మార్గంలో అత‌డు ఆలోచించ‌లేదా? ఆస్తుల‌ను పెంచుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదా? అని కూడా ఒక సెక్ష‌న్ విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

కమల్ హాసన్ స్వాంకీ కార్ కలెక్షన్:

క‌మ‌ల్ హాస‌న్ డీలక్స్ లెక్సస్ Lx 570 & BMW 730Ldతో సహా అనేక హై-ఎండ్ వాహనాలను కలిగి ఉన్నాడు, ఇవన్నీ అతని గ్యారేజీలో ఉన్నాయి. విలాసవంతమైన ఈ కార్ల‌ మొత్తం విలువ రూ. 3.69 కోట్లు. ఇవేగాక ఖ‌రీదైన యాక్సెస‌రీస్ ని క‌మ‌ల్ హాస‌న్ క‌లిగి ఉన్నారు.