Begin typing your search above and press return to search.

ఏడు పదుల వయసులో కుర్ర స్పీడ్‌..!

యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అయిన అన్బుమణి, అరివుమణి (అన్బరివ్‌) ల దర్శకత్వంలో తన 237వ సినిమా ను చేసేందుకు సిద్ధం అయ్యాడు.

By:  Tupaki Desk   |   13 Jan 2024 7:41 AM GMT
ఏడు పదుల వయసులో కుర్ర స్పీడ్‌..!
X

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ విక్రమ్‌ సినిమాకు ముందు వరకు ఆయన మళ్లీ పుంజుకోవడం కష్టం, కెరీర్‌ లో నిలదొక్కుకోవడం అసాధ్యం అన్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ విక్రమ్‌ సినిమా తో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన కమల్‌ హాసన్ ఒక్కసారిగా మునుపటి ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు.

ఈ మధ్య కాలంలో స్టార్‌ హీరోలు ముఖ్యంగా సీనియర్ స్టార్‌ హీరోలు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. కాని కమల్ హాసన్ నుంచి రాబోయే రెండేళ్లలో అయిదు ఆరు సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కమిట్ అయ్యి ఉన్న సినిమాలు కాకుండా కొత్తగా సినిమాలు ఒప్పుకుంటూనే ఉన్నాడు.

తాజాగా కమల్‌ హాసన్ నుంచి మరో సినిమా ప్రకటన వచ్చి అందరికి సర్‌ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అయిన అన్బుమణి, అరివుమణి (అన్బరివ్‌) ల దర్శకత్వంలో తన 237వ సినిమా ను చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయడంతో పాటు ఒక వీడియోను కూడా విడుదల చేశారు.

సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్‌ సినిమాలకు యాక్షన్ కొరియోగ్రఫీ ని అందించిన అన్బరివ్‌ లు దర్శకులుగా మారి యూనివర్శిల్‌ స్టార్‌ తో ఒక భారీ యాక్షన్ సినిమాను రూపొందించేందుకు సిద్ధం అవుతున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని తమిళ మీడియా వర్గాల్లో కథనాలు వస్తున్నాయి.

ఇక కమల్‌ ఇతర సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఇండియన్‌ 2 షూటింగ్ పూర్తి అయ్యింది. త్వరలో విడుదల అవ్వాల్సి ఉంది. మరోవైపు ప్రభాస్ తో కలిసి కల్కి సినిమాలో నటిస్తున్నాడు. ఇక మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్నాడు.

ఈ సినిమాలు కాకుండా మరో రెండు సినిమాలు కూడా కమిట్ అయ్యాడు. ఇదే ఏడాదిలో ఆ సినిమాల షూటింగ్స్ ప్రారంభం అవ్వబోతున్నాయి. మొత్తానికి ఏడు పదుల వయసుకు చేరువ అయినా కూడా కుర్ర హీరో మాదిరిగా స్పీడ్ కనబరుస్తున్న కమల్ ను చూసి చాలా మంది యంగ్‌ హీరోలు ముక్కున వేలు వేసుకుని ఉంటారు.