Begin typing your search above and press return to search.

కమల్‌హాసన్ 1000 కోట్ల బ‌డ్జెట్ చిత్రం?

మ‌రుద‌నాయ‌గంలో ఒక ముఖ్యమైన సన్నివేశం కోసం కమల్ హాసన్ అత‌డి టీమ్‌కి స‌వాల్ ఎదురైంది.

By:  Tupaki Desk   |   21 Oct 2023 5:33 AM GMT
కమల్‌హాసన్ 1000 కోట్ల బ‌డ్జెట్ చిత్రం?
X

ఎంచుకున్న క‌థ‌, పాత్ర‌కు త‌గ్గ‌ట్టు అంకితభావంతో న‌టించే న‌టీన‌టుల‌కు ఇప్పుడు కొద‌వేమీ లేదు. అయితే ఇలాంటి వారంద‌రికీ విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ ఒక స్ఫూర్తి. అత‌డి టెక్నిక్ అన్ని విధాలుగా నేటిత‌రం తార‌ల‌కు నటనలో మాస్టర్ క్లాస్ కావచ్చు. ఉలగనాయగన్ ఒక పాత్ర‌లోకి, సన్నివేశంలోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయ‌డానికి చాలా లోతుగా వెళ‌తాడు. ఒక్కోసారి త‌న‌ని తాను న‌టుడ‌నే విష‌యాన్నే మ‌ర్చిపోతాడు. అంత‌గా జీవించేయ‌డం అన్న‌ది అతికొద్ది మందికి మాత్ర‌మే సాధ్యం. అతడు త‌న‌ను తాను నటుడనే విషయాన్ని మరచిపోయిన ఘటనలలో ఒకటి ఇప్పుడు నెటిజ‌నుల్లో హాట్ డిబేట్ కి తెర తీసింది.

క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌యోగం -మరుదనాయగం గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది చాలా త‌క్కువ‌. ఈ సినిమా కొంత‌భాగం తెర‌కెక్కి మ‌ధ్య‌లో ఆగిపోయింద‌ని మాత్ర‌మే తెలుసు. దీనికోసం కోట్లాది రూపాయ‌లను క‌మ‌ల్ బూడిద‌లో పోసార‌ని భావిస్తారు. అయితే ఈ సినిమా కోసం ఆరోజుల్లోనే విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ 1000 కోట్ల బ‌డ్జెట్ ని పెట్టాల‌ని ఆశించారని చెబుతారు. 1991లో కమల్ హాసన్ 1000 కోట్ల (ద్రవ్యోల్బణం-సర్దుబాటు) బ‌డ్జెట్ తో సినిమా తీయాల‌ని క‌ల‌లుగ‌న్నారు. మరుదనాయగం అనే అసాధార‌ణ‌మైన ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. ఈ సినిమా క‌థాంశం ఆస‌క్తిక‌రం. 18వ శతాబ్దపు స్వాతంత్య్ర‌ సమరయోధుడు మ‌రుద‌నాయగం పిళ్లై జీవిత‌క‌థ ఆధారంగా ఈ సినిమాని తెర‌కెక్కించాల‌ని భావించారు. ఆరోజుల్లోనే ఆయ‌న లార్జ‌ర్ దేన్ లైఫ్ పాత్ర‌ల‌తో మ్యాజిక్ చేయాల‌నుకున్నారు. అతి భారీత‌నంతో తెర‌కెక్కించాల్సిన సినిమా కాబ‌ట్టి చాలా ఆల‌స్య‌మైంది. చివ‌రికి దీనిని పూర్తి చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు.

అయితే అప్ప‌టికే కొంత భాగం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఇందులో ఒక సీన్ కోసం క‌మ‌ల్ కోట్లు ధార‌పోసాడు. మ‌రుద‌నాయ‌గం క‌థానుసారం చెన్నై పర్యటనలో ఉన్న 'క్వీన్ ఎలిజబెత్ II' కోసం ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉంది. దానికోసం క‌మ‌ల్ కోట్లు ఖర్చు చేశాడు. ఆ సీన్ కోసం క‌మ‌ల్ డెడికేష‌న్ ని చూసిన స‌ద‌రు న‌టి ఆశ్చర్యపోయింది. ప్రతి విభాగంలో పరిపూర్ణతను సాధించడానికి క‌మ‌ల్ హాస‌న్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ తారాగణం, టెక్నీషియ‌న్ల‌ను ఓచోటికి తెచ్చారు. ప్రపంచం గుర్తించే విధంగా భారతీయ సినిమాని మ్యాప్‌లో ఉంచాలనే దృక్పథంతో, గొప్ప‌ ప‌ట్టుద‌ల‌తో అత‌డి ప్ర‌య‌త్నించాడు.

మ‌రుద‌నాయ‌గంలో టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్‌లెట్‌కు మార్షాగా స్త్రీ పాత్రను ఆఫర్ చేసాడు అంటే అర్థం చేసుకోవాలి. అంతే కాదు మరాఠా పాలకుడు, తంజావూరుకు చెందిన ప్రతాప్ సింగ్ పాత్రను పోషించడానికి సూప‌ర్ స్టార్ రజనీకాంత్‌ను సంప్రదించారు. అతిథి పాత్రలో అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. నేటికీ ఏ భారతీయ సినిమాలోనైనా ఇలాంటి తారాగణాన్ని ఊహించలేం. మూడు దశాబ్దాల తర్వాత కూడా ఇలాంటి అసాధార‌ణ‌ ప్రాజెక్టు గురించి చ‌ర్చ సాగుతోంది అంటే దానికోసం క‌మ‌ల్ ఎంత‌గా త‌ప‌న ప‌డ్డారో అర్థం చేసుకోవాలి. క‌మ‌ల్ హాస‌న్ 'అంకితభావం' 30+ సంవత్సరాల వ్యవధిలో అనేక విఫల ప్రయత్నాల తర్వాత కూడా ఈ చిత్రం కోసం ఆయ‌న ఆరాట‌ప‌డుతూనే ఉంటార‌ని స‌న్నిహితులు చెబుతారు.

ఆ సీన్ కోసం విశ్వ‌ప్ర‌య‌త్నం:

మ‌రుద‌నాయ‌గంలో ఒక ముఖ్యమైన సన్నివేశం కోసం కమల్ హాసన్ అత‌డి టీమ్‌కి స‌వాల్ ఎదురైంది. అది చ‌నిపోయిన మాన‌వుడి వ‌ద్ద వాలి అత‌డిని పొడుచుకు తినే గ్ర‌ద్ధ‌కు సంబంధించిన సీన్. ఆ సీన్లో ఎంతో స‌హ‌జంగా మానవ మాంసాన్ని తినడానికి డేగ అవసరం. కానీ అప్ప‌టికి భార‌త‌దేశంలో వీఎఫ్ ఎక్స్ ఆశించిన స్థాయికి ఎద‌గ‌లేదు. నమ్మదగిన VFX లేకపోవడం వల్ల క‌మ‌ల్ హాస‌న్ త‌న‌కు తాను గాయం చేసుకుని గ్ర‌ద్ధ‌లు ఎగిరే చోట‌ పడుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే చివ‌రికి తన కాలు మీద ప్రొస్తెటిక్ మేకప్ తో మ్యానేజ్ చేసి మోకాలి కింద కొంత చికెన్‌ని దాచిపెట్టాడు. ఆ మాంసాన్ని తినడానికి నిజమైన ఈగిల్ ఎగిరిపోనంత‌ వరకు అతడు చనిపోయినట్లు నటిస్తూ నేలపై పడుకున్నాడు. ఆ సన్నివేశాన్ని ఎటువంటి VFX లేకుండా నిజమైన అడవి పక్షితో చిత్రీకరించారు. నిజానికి ఈ ప్ర‌యోగం మ‌తిచెడిపోయే వాస్త‌వం.

నిజానికి 'మరుదనాయగం' పూర్తి చేయ‌గ‌లిగితే.. భార‌త‌దేశంలో 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందిన తొలి సినిమా ఇదే అయ్యేది. ఇప్ప‌టివ‌ర‌కూ ర‌జ‌నీ కాంత్ 2.0 కోసం 500కోట్లు మించి పెట్టుబ‌డి పెట్టార‌ని ప్ర‌చార‌మైంది. ప్రభాస్ న‌టిస్తున్న 'కల్కి 2898 AD' కోసం 600 కోట్లు వెచ్చిస్తున్నార‌ని, భారత దేశంలో అత్యంత ఖరీదైన చిత్రం ఇదేన‌ని ప్ర‌చారం సాగుతోంది. కానీ మ‌రుద‌నాయ‌గం ప్రాజెక్ట్ వ‌ర్క‌వుటైతే ఇలాంటి వార్త‌లు మిగిలేవి కాదు! కానీ అది అసాధార‌ణ ప్ర‌య‌త్నం. అందుకే మ‌ధ్య‌లోనే వీగిపోయింది. ఆ త‌ర్వాత కూడా ఒక ప్ర‌ముఖ దుబాయ్ వ్యాపార‌వేత్త‌- రిల‌య‌న్స్ అంబానీల‌తో క‌లిసి అమీర్ ఖాన్ లాంటి స్టార్ మ‌హాభార‌తాన్ని ఐదు భాగాలుగా 1000 కోట్ల బడ్జెట్ తో తెర‌కెక్కిస్తాన‌ని ప్ర‌క‌టించి మ‌ధ్య‌లోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే.

1991లో మ‌రుద‌నాయ‌గం ప్రారంభించేప్ప‌టికే.. షారూఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ వీ.ఎఫ్.ఎక్స్ సంబంధిత ప‌నులు చేస్తుండేది. కానీ టెక్నిక‌ల్ గా భార‌త‌దేశంలో అప్ప‌టికి అంత నైపుణ్యం లేదు. రెడ్ చిల్లీస్ సంస్థ లేదా ఏదైనా ప్రధాన VFX కంపెనీతో టై అప్ పెట్టుకుని VFX, CGI ద్వారా ఫిలింను డిజిటల్‌గా వీలైనంత వరకు నేచుర‌ల్ గా పండేలా చేయ‌డానికి ప్ర‌య‌త్నించాల‌ని క‌మ‌ల్ హాస‌న్ భావించారు. కానీ అది చివ‌ర‌కు వీలుప‌డ‌లేదు.