Begin typing your search above and press return to search.

'ప్రేమతో అన్నవే సారీ చెప్పను'.. ఇష్యూ క్లోజ్ చేయని కమల్ హాసన్

కాలం మారింది. అందుకు తగ్గట్లు పరిస్థితులు మారుతున్నాయి. ప్రతి అంశం సున్నితంగా మారుతోంది. గతానికి భిన్నంగా ఎవరు ఎవరిని ఏమన్నా ఊరుకునే పరిస్థితుల్లో లేరు.

By:  Tupaki Desk   |   29 May 2025 9:37 AM IST
ప్రేమతో అన్నవే సారీ చెప్పను.. ఇష్యూ క్లోజ్ చేయని కమల్ హాసన్
X

కాలం మారింది. అందుకు తగ్గట్లు పరిస్థితులు మారుతున్నాయి. ప్రతి అంశం సున్నితంగా మారుతోంది. గతానికి భిన్నంగా ఎవరు ఎవరిని ఏమన్నా ఊరుకునే పరిస్థితుల్లో లేరు. అది ప్రేమతో అయినా సరే. చాలామంది చాలా విషయాల్ని అర్థం చేసుకునే కన్నా.. అపార్థం చేసుకోవటమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో తెలివైనోళ్లు ఎవరైనా సరే సమస్యల్ని ఆహ్వానించరు సరికదా.. వీలైనంత వరకు వాటి పరిష్కారాలను వెతుకుతారు. అదేం సిత్రమో కానీ కొందరు ప్రముఖులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. విశ్వ కథానాయకుడు కమల్ హాసన్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

చెన్నైలో ఇటీవల థగ్ లైఫ్ అనే ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన కన్నడ కూడా తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య తీవ్ర వివాదాస్పదంగా మారింది. మామూలుగానే తమిళులకు.. కన్నడిగులకు మధ్య సంబంధాలు అంత గొప్పగా ఉండవని తెలిసిందే. ఇలాంటి వేళ.. అలాంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా భావోద్వేగాల్ని తట్టి లేపటానికి మించి ఇంకేం ఉంటుంది?

గతంలో ఎవరైనా ప్రముఖుడు ఏదైనా మాట్లాడితే దానికి స్పందన ఒక స్థాయి వరకు వచ్చి ఆగేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నది మర్చిపోకూడదు. ఎవరూ విషయాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఇలాంటి వేళలో ఈ తరహా వ్యాఖ్యలు చేయటానికి మించిన తప్పు ఇంకేం ఉండదు. తన వ్యాఖ్యలు పెను వివాదంగా మారిన నేపథ్యంలో కమల్ హాసన్ మళ్లీ స్పందించారు.

భాషా చరిత్ర గురించి ఎంతోమంది చరిత్రకారులు తనకు చెప్పారని.. తన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదని చెబుతూ.. ‘బాష గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదు. ఇది నాకు కూడా వర్తిస్తుంది. ప్రేమతోనే అలా చెప్పాను. ఎంతోమంది చరిత్రకారులు భాషా చరిత్ర గురించి నాకు నేర్పించారు. నేను చేసిన వ్యాఖ్యల్లో మరో ఉద్దేశం లేదు’’ అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తమిళనాడు విలక్షణత గురించి చెప్పుకొచ్చారు. ‘తమిళనాడు ఒక అరుదైన రాష్ట్రం. ప్రతి ఒక్కరిని మిళితం చేసుకునే తత్త్వం ఉంటుంది. ఒక మేనన్ ను (ఎంజీ రామచంద్రన్)ను ముఖ్యమంత్రిగా చేశారు. రెడ్డి సీఎం అయ్యారు (ఒమందూర్ రామసామి రెడ్డియార్ ను ఉద్దేశించి).. మైసూర్ సంస్థానంలో పని చేసిన నరసింహన్ రంగచారి మనమరాలు (జయలలితను ఉద్దేశిస్తూ) సీఎంను చేశారు. చెన్నైలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కర్ణాటక నాకు మద్దతుగా నిలిచింది. మీరు ఎక్కడికి వెళ్లొద్దు. మేం ఆశ్రయం కల్పిస్తామన్నారు. రాజకీయ నాయకులకు భాష గురించి మాట్లాడే అర్హత లేదు. నాతో సహా దానిపై మాట్లాడే అర్హత నాకు లేదు. దీనిపై లోతైన చర్చను చరిత్రకారులకు.. పురావస్తు శాస్త్రవేత్తలు.. భాషా నిపుణులకు వదిలేద్దాం’’ అని పేర్కొన్నారు.

ఇదే తెలివి తాను మాట్లాడే మాటల సమయంలో ఉండి ఉంటే ఇంత రచ్చ ఉండేది కాదు కదా? వివిధ వర్గాల ప్రజలు ఇప్పుడెంతో సున్నితమయ్యారు. ఎవరిని ఏ మాట అన్నా.. వారి మనోభావాలు దెబ్బ తింటున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. నిజాలు చెబుతున్నామన్న పేరుతో వారి మనసు నొప్పించే మాటలు మాట్లాడటం ద్వారా ప్రముఖులు వివాదాల్ని కొని తెచ్చుకోవటం మినహా మరేమీ మిగిలదన్న విషయాన్ని కమల్ హాసన్ గుర్తించినట్లు కనిపించలేదు. దీనికి కారణంతన మాటలతో రేగిన వివాదాన్ని మనోభావాలు దెబ్బ తిని ఉంటే క్షమించండి అన్న మాట చెప్పి ఉంటే బాగుండేది. కానీ ఆయన మాత్రం.. తాను సారీ చెప్పలేనని స్పష్టం చేయటం గమనార్హం. కన్నడ భాషకు సుదీర్ఘ చరిత్ర ఉందని.. ఈ విషయాలేవీ కమల్ కు తెలియకపోవచ్చంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహా కర్ణాటకకు చెందిన పలువురు మండిపడుతున్నరు. విషయాల మీద అవగాహన ఉన్న కమల్ హాసన్ లాంటి వారు తప్పులెందుకు చేస్తారు?