విశాఖతో కమల్ ది మరో చరిత్ర
విశ్వ నటుడు కమల్ హాసన్ విశాఖతో తన బంధం గొప్పదని భావోద్వేగానికి లోను అయ్యారు.
By: Tupaki Desk | 30 May 2025 9:13 AM ISTవిశ్వ నటుడు కమల్ హాసన్ విశాఖతో తన బంధం గొప్పదని భావోద్వేగానికి లోను అయ్యారు. ఆయన తాజా చిత్రం థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం వైజాగ్ వచ్చిన కమల్ విశాఖను చూసి ఎంతో ఆనందానికి గురి అయ్యారు. దానిని తన స్పీచ్ లో వ్యక్తం చేశారు. విశాఖ వాసుల రుణం తీర్చుకోలేనిది అని ఉప్పొంగారు.
ఎపుడో తెలిసీ తెలియని వయసులో విశాఖకు వచ్చాను. విశాఖ నుంచే నా సినీ ప్రయాణం మొదలైంది అన్నారు. అవును అది నిజం. 1978లో రిలీజ్ అయిన మరో చరిత్ర షూటింగ్ అంతా దాదాపుగా విశాఖలోనే జరిగింది. తెలుపు నలుపు లో తీసిన ఈ చిత్రం ఈ రోజుకీ టీవీలలో వస్తే ఎన్నో రంగులతో ఇంద్ర ధనుస్సులా మెరుస్తుంది.
విశాఖ టూ భీమిలీ అటూ గంగవరం దాకా బీచ్ తీర ప్రాంతం అంతా తన కెమెరాలో బంధించి ఈ రోజుకీ వసివాడని సోయగాన్ని పరిమళాన్ని వెల్లి విరిసేలా చేసిన ఘనత అచ్చంగా దిగ్గజ దర్శకుడు కె బాలచందర్ కే దక్కుతుంది. విశాఖ సాగరం ఈ సినిమాలో ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా కనిపిస్తుంది.
ఎగిసిపడే కడలి కెరటాలు చూస్తే చాలు మరో చరిత్ర ప్రేమికులను ఆవిష్కరిస్తుంది. భీమిలీ గాలి మేడలు అప్పుడే కొత్తగా నిర్మాణ సన్నాహాలలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రదేశాలు ఇవన్నీ కూడా మరో చరిత్రలో పదిలంగా ఉంటాయి. విశాఖ ప్రేమికులకు అలా మరో చరిత్ర ఒక తీయని జ్ఞాపకం. అలాగే ఈ సినిమాతో స్ట్రెయిట్ గా తెలుగు ప్రజల గుండెల్లో నవ యువ కధానాకుడిగా దూసుకుని వచ్చిన కమల్ హాసన్ కాలంతో సంబంధం లేకుండా అలాగే వచ్చే రాని తెలుగులో మాట్లాడే తమిళ యువకుడిగానే గుర్తుండిపోయారు.
ఇక కమల్ విశాఖలో తీసిన మరో చరిత్ర సూపర్ సక్సెస్ అయి తనకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసింది అని చెప్పారు. విశాఖ వాసుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అన్నారు. తాను తెలుగులో స్ట్రైట్ గా పదిహేను సినిమాలు చేస్తే అందులో పదమూడు సినిమాలు విజయవంతం అయ్యాయని కమల్ గుర్తు చేసుకున్నారు ఆ రెండు సినిమాలూ ఫ్లాప్ కావడానికి తానే కారణం అని తన మీదనే ఆ నింద వేసుకున్నారు.
విశాఖ తన సొంత ఇల్లు లాంటిది అని కూడా కమల్ హాసన్ చెప్పడం విశేషం. తాను కేవలం తెలుగులో సినిమాలు చేస్తేనే కాదు బాలివుడ్ లో సినిమాలు చేసినా తెలుగు ఆడియన్స్ ఆదరించారు అంటే వారి అభిమానం అలాంటిది అన్నారు. మంచి సినిమాలను భాషా భేదం లేకుండా ఆదరించే గొప్ప గుణం తెలుగు వారిది అన్నారు. అందుకే మణిరత్నంతో తాను చాలా కాలం తరువాత చేస్తున్న సినిమాతో ముందుకు వచ్చాను అన్నారు థగ్ లైఫ్ అధ్బుతమైన చిత్రమని సూపర్ హిట్ చేయాలని ఆయన కోరారు.
