'థగ్ లైఫ్' అంచనాలు పెంచే మరో ఎలిమెంట్ ఇది..!
యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్, లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో రూపొందిన థగ్ లైఫ్ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 2 Jun 2025 10:47 AM ISTయూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్, లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో రూపొందిన థగ్ లైఫ్ సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినిమాకు ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలతో బజ్ క్రియేట్ చేశారు. జూన్ 5న భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి మరో పాటను తాజాగా విడుదల చేశారు. విశ్వద నాయకా అంటూ సాగే ఈ పాట మరోసారి థగ్ లైఫ్‌ను వార్తల్లో నిలిపింది. సినిమా కథ, నేపథ్యం గురించి ఈ పాటలో క్లీయర్‌గా, అర్థం అయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. అంతే కాకుండా కమల్ పాత్ర విషయంలోనూ ఈ పాటలో లీడ్ ఇచ్చినట్లుగా ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన మూడు పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. మూడు పాటలకు మూడు పాటలు విభిన్నంగా నిలిచాయి. తాజాగా వచ్చిన విశ్వద నాయక పాట కూడా లిరిక్స్ పరంగానే కాకుండా, మ్యూజిక్ పరంగా కూడా మెప్పించింది. కమల్ హాసన్ పాత్రకు సంబంధించిన వేరియేషన్స్‌ను ఈ పాటలో చూపించే ప్రయత్నం చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, ఎఆర్ అమీన్ విభిన్నమైన ర్యాప్ మ్యూజిక్‌ను అందించారు. అలెగ్జాండ్రా జాయ్ తన గాత్రంతో పాటకు మరింత హైప్ తీసుకు వచ్చారు. మొత్తానికి సినిమాకు సంబంధించిన హడావుడి ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. ఈ సమయంలో వచ్చిన పాట సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. అయితే కొందరు మాత్రం ఈ పాట విషయమై పెదవి విరుస్తున్నారు.
మణిరత్నం దర్శకత్వంలో చాలా ఏళ్ల తర్వాత కమల్ హాసన్ నటించిన సినిమా కావడంతో అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా గతంలో వీరి కాంబోలో వచ్చిన నాయగన్ సినిమా రేంజ్‌లో మణిరత్నం థగ్ లైఫ్‌ను రూపొందించారని ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్‌కు జోడీగా త్రిష నటించగా ముఖ్య పాత్రలో అభిరామి నటించింది. ఈ సినిమాలో ఉన్న లిప్ లాక్ సీన్స్‌తో ట్రైలర్ మెప్పించింది. అదే సమయంలో కొన్ని వివాదాలు సైతం ఈ సినిమా చుట్టూ ఉన్నాయి. థగ్ లైఫ్ సినిమాలో మరో తమిళ హీరో శింబు సైతం నటించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
తమిళంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమాను కన్నడ ప్రేక్షకులు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కమల్ హాసన్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ కన్నడ భాషను చిన్నతనం చేసే విధంగా మాట్లాడారు అంటూ విమర్శలు వస్తున్నాయి. పలువురు కన్నడ భాష అంటే గౌరవం లేని కమల్ హాసన్ సినిమాను కర్ణాటకలో ఆడనిచ్చేది లేదు అంటూ ఆందోళన చేస్తున్నారు. బెంగళూరులో ఈ సినిమా షోలో పడటం అనుమానంగానే ఉంది. అందుకే థగ్ లైఫ్ తమిళ్‌తో పాటు తెలుగు, హిందీలో మాత్రమే విడుదల అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ప్రమోషన్ మాత్రం అన్ని భాషల్లో చేస్తున్నారు. విడుదల సమయం వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.
