కమల్ 'థగ్ లైఫ్'.. తగ్గకపోతే భారీ నష్టమే!
స్టార్ హీరో కమల్ హాసన్.. ఇప్పుడు థగ్ లైఫ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 3 Jun 2025 4:00 PM ISTస్టార్ హీరో కమల్ హాసన్.. ఇప్పుడు థగ్ లైఫ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన ఆ సినిమాలో అభిరామి, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో. శింబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కమల్ మణిరత్నం కాంబోలో మూవీ వస్తుండడంతో అంతా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ మరింతగా వాటిని పెంచేసింది. దీంతో సినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సూపర్ హిట్ కచ్చితంగా అవుతుందని అంతా అంచనా వేశారు.
అదే సమయంలో ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ కర్ణాటకలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఆ సమయంలో కమల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపాయి. తమిళం నుంచి కన్నడ పుట్టిందని ఆయన వ్యాఖ్యానించడంతో కన్నడిగులు భగ్గుమన్నారు. భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కూడా వార్నింగ్ ఇచ్చింది. క్షమాపణ చెప్పకపోతే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించింది. ఎగ్జిబిటర్లను థగ్ లైఫ్ ను ప్రదర్శించవద్దని ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు కమల్ సారీ చెప్పలేదు. తాను చెప్పనని కూడా తేల్చి చెబుతున్నారు. ప్రేమతో అన్న మాటలు అవని, చరిత్రకారులు తనకు ఇప్పటికే భాష మూలాల గురించి చెప్పారని అంటున్నారు.
ఇటీవల కమల్ హాసన్.. కర్ణాటక హైకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే. సినిమాను సజావుగా విడుదలయ్యేలా చూడాలని కోర్టును కోరారు. కానీ న్యాయస్థానం చెప్పినా.. కర్ణాటకలో థగ్ లైఫ్ సజావుగా రిలీజ్ అవ్వడం అసాధ్యమే. గందరగోళ వాతావరణం ఉన్నప్పుడు, ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలను చూడటానికి రారు.
మనోభావాలను దెబ్బతీయడం మంచి ఫలితాలను ఇవ్వడం కష్టమే. అందుకే కమల్ వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని క్షమాపణ చెప్పాల్సిందేనని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే బాక్సాఫీస్ వద్ద ఎదురు దెబ్బ తగలడం ఖాయమేనని అంటున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ మూవీ నిర్మాత కూడా కాబట్టి ఒక్కసారిగా ఆలోచించాలని చెబుతున్నారు.
