థగ్ లైఫ్ కోసం కమల్ ఒంటరి పోరాటం!
సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత ఎప్పుడూ ఏదో వివాదాలు వస్తూనే ఉంటాయి. పోతూనే ఉంటాయి. కొన్ని సార్లు ఈ వివాదాల్లో అనుకోకుండా చిక్కుకుంటే మరికొన్ని సార్లు ఆయా సెలబ్రిటీలు తాము చేసిన కామెంట్స్ వల్ల వివాదాల్లో ఇరుక్కుంటారు.
By: Tupaki Desk | 2 Jun 2025 1:46 AM ISTసినీ ఇండస్ట్రీ అన్న తర్వాత ఎప్పుడూ ఏదో వివాదాలు వస్తూనే ఉంటాయి. పోతూనే ఉంటాయి. కొన్ని సార్లు ఈ వివాదాల్లో అనుకోకుండా చిక్కుకుంటే మరికొన్ని సార్లు ఆయా సెలబ్రిటీలు తాము చేసిన కామెంట్స్ వల్ల వివాదాల్లో ఇరుక్కుంటారు. ఇప్పుడు లోక నాయకుడు కమల్ హాసన్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. దానికి కారణం ఆయన అందరి ముందూ చేసిన వ్యాఖ్యలే.
ప్రస్తుతం కమల్ హాసన్ లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కర్ణాటక వెళ్లి అక్కడ కన్నడ భాషపై కమల్ కామెంట్స్ చేశారు. కన్నడ భాష కూడా తమిళ భాష నుంచే పుట్టిందని అన్నారు. అసలే కన్నడిగులకు భాషపై ప్రేమాభిమానాలు ఎక్కువ కావడంతో కమల్ చేసిన కామెంట్స్ వారికి నచ్చలేదు.
దీంతో కర్ణాటకలో ఏకంగా కమల్ హాసన్ థగ్ లైఫ్ ను బ్యాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ రాష్ట్ర థియేటర్లలో థగ్ లైఫ్ సినిమాను ప్రదర్శించే ప్రసక్తే లేదని అక్కడి ఫిల్మ్ ఛాంబర్, పొలిటీషియన్లు అందరూ ఏకతాటిపై నిల్చున్నారు. ఈ విషయంలో కమల్ క్షమాపణ చెప్పే ఉద్దేశంలో లేకపోవడం ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా చేయడంతో పాటూ దీని వల్ల కర్ణాటకలోని కమల్ ఫ్యాన్స్ కు ఆ సినిమా థియేటర్లలో చూసే అవకాశం కూడా కోల్పోయారు. పైగా కర్ణాటకలో కమల్ కు వ్యతిరేకంగా నిరసలు, దిష్టిబొమ్మ దహనాలు, ధర్నా, ప్రెస్‌మీట్లు జరుగుతూనే ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కమల్ కు మద్దుతుగా ఎవరు నిలుస్తారనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అయితే ఈ విషయంలో కోలీవుడ్ నుంచి ఎవరూ నోరు తెరిచి మాట్లాడింది లేదు. దీన్ని ఖండిస్తూ కమల్ కు మద్దతుగా నడిగర్ సంఘం నుంచి ఓ లెటర్ అయితే రిలీజైంది కానీ వ్యక్తిగతంగా ఎవరూ దీనిపై మాట్లాడలేదు. ఇప్పుడు కమల్ కు మద్దతిస్తే రేపు తమ సినిమాలను కన్నడలో ఎక్కడ అడ్డుకుంటారో అని అందరూ సైలెంట్ గా ఉంటున్నారు. ఇదంతా చూస్తుంటే ప్రస్తుతం కమల్ ఒంటరి పోరాటం చేస్తున్నట్టే తెలుస్తోంది. ఆయన తన మాటలకు కట్టుబడి సారీ చెప్పేదే లేదంటున్నారు. దీని వల్ల రూ. 25 కోట్లు నష్టమొచ్చే అవకాశమున్నప్పటికీ దానిక్కూడా కమల్ రెడీగా ఉన్నట్టే తెలుస్తోంది. మరి ఈ వివాదం చివరకు ఎలా ముగుస్తుందో చూడాలి.
