కత్తి పట్టుకొచ్చిన ఫ్యాన్‌పై కమల్‌హాసన్ కోపం
తన పేరుకు ముందు ఉలగనాయగన్, యూనివర్శల్ హీరో లాంటి బిరుదులు అవసరం లేదని బహిరంగంగా ఫ్యాన్స్ ని కోరారు కమల్ హాసన్.
By: Tupaki Desk | 15 Jun 2025 11:40 AM ISTతన పేరుకు ముందు ఉలగనాయగన్, యూనివర్శల్ హీరో లాంటి బిరుదులు అవసరం లేదని బహిరంగంగా ఫ్యాన్స్ ని కోరారు కమల్ హాసన్. తనకు అభిమానులే పెద్ద కానుకలు.. అంతకుమించి బిరుదులు అవసరం లేదని అన్నారు. తాను ఎప్పటికీ ఒదిగి ఉంటానని కమల్ తెలిపారు.
ఇప్పుడు ఓ బహిరంగ వేదికపై కమల్ హాసన్ కి ఒక స్వోర్డ్ (పొడవాటి కత్తి)ని కానుకగా ఇవ్వబోయిన అభిమాని ప్రవర్తనకు కమల్ హాసన్ కోపగించుకున్నారు. ఇటీవలే రాజ్య సభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్ హాసన్... ఈ శనివారం నాడు పార్టీ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో అభిమానులతో ఫోటోలు దిగిన కమల్, ఒక అభిమాని చర్యను మాత్రం ప్రోత్సహించలేదు. అతడు పొడవాటి కత్తిని తెచ్చి కానుకగా ఇవ్వబోయాడు. కానీ ఆ కత్తిని తిరిగి తీసుకెళ్లాల్సిందిగా కమల్ అతడిపై సీరియస్ అయ్యారు. చాలా మంది అభిమానులు కమల్ తో ఫోటోలు దిగారు కానీ ఈ అభిమాని పదే పదే ఇర్రిటేట్ చేస్తూ, ఆ కత్తిని కమల్ చేతిలో ఉంచేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. కమల్ కొంత అసహనంగా అతడిని మందలిస్తున్నట్టు ఈ వీడియోలో స్పష్ఠంగా కనిపిస్తోంది.
చివరికి ఆ అభిమానిని అక్కడ ఉన్న కొందరు పక్కకు తొలగించారు. పోలీసులు కూడా అతడిని ఆపేందుకు ప్రయత్నించారు. మక్కల్ నీది మైయం (ఎం.ఎన్.ఎం) అధ్యక్షుడు కమల్ హాసన్, అధికార డీఎంకే నుండి ముగ్గురు అభ్యర్థులు, ప్రతిపక్ష ఏఐఏడిఎంకే నుండి ఇద్దరు అభ్యర్థులు తమిళనాడు నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. కమల్ `మక్కల్ నీది మయ్యమ్`, డీఎంకేతో పొత్తు పెట్టుకోగా అతడికి రాజ్యసభ సీటును కట్టబెట్టారు. 2026 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డీఎంకే యువనాయకుడు ఉదయనిధి స్టాలిన్ ని తమిళనాడు ఉపముఖ్యమంత్రిని చేసిన సంగతి తెలిసిందే. ఉదయనిధితో కమల్ హాసన్ అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు.
