Begin typing your search above and press return to search.

కమల్ హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా.. ఆ వివాదమే కారణమా ?

విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమల్ హాసన్ ఇటీవల 'థగ్ లైఫ్' సినిమా ఈవెంట్‌లో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   4 Jun 2025 5:32 PM IST
కమల్ హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా.. ఆ వివాదమే కారణమా ?
X

విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమల్ హాసన్ ఇటీవల 'థగ్ లైఫ్' సినిమా ఈవెంట్‌లో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ భాషా వివాదం నేపథ్యంలో ఆయన రాజ్యసభ నామినేషన్‌ను వాయిదా వేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తన తాజా చిత్రం 'థగ్ లైఫ్' వ్యవహారాలు కొలిక్కి వచ్చిన తర్వాతే నామినేషన్ దాఖలు చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం కమల్ హాసన్ రాజకీయ ప్రవేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని ఉత్కంఠగా ఉంది.

కమల్ హాసన్ 2018లో స్థాపించిన ఎంఎన్ఎం పార్టీ, ప్రతిపక్ష 'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉంది. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి ఆయన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాల్లో, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఎంఎన్ఎం ప్రచారం నిర్వహించింది. ఈ పొత్తులో భాగంగా 2025లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్ఎంకు ఒక రాజ్యసభ సీటు కేటాయించడానికి డీఎంకే-నేతృత్వంలోని కూటమి అంగీకరించింది. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో చేసుకున్న ఈ ఒప్పందం ప్రకారం.. ఎంఎన్ఎంకు ఒక రాజ్యసభ సీటు కేటాయించింది. దీంతో, కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లడం ఖాయమని డీఎంకే-ఎంఎన్ఎం ఇటీవల ఖరారు చేశాయి.

ఇటీవల 'థగ్ లైఫ్' సినిమా ఈవెంట్‌లో కమల్ హాసన్ "కన్నడ భాష తమిళం నుండే పుట్టింది" అని వ్యాఖ్యానించారు. కమల్ వ్యాఖ్యలపై కన్నడ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని ఫలితంగా, కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 'థగ్ లైఫ్' చిత్రాన్ని రాష్ట్రంలో నిషేధించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, కమల్ హాసన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "మీరు కమల్ హాసన్ కావచ్చు, మరెవరైనా కావచ్చు, ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. తప్పు జరిగితే క్షమాపణ చెప్పడం మంచిది" అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఒక్క క్షమాపణ చెబితే అంతా పరిష్కారమవుతుందని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో కమల్ హాసన్ ప్రస్తుతానికి కర్ణాటకలో సినిమాను విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత, కమల్ 'కెఎఫ్‌సిసి'కి ఒక లేఖ రాస్తూ తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఆ లేఖలో కూడా ఆయన క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం.