ఈ క్షణం ఎంతో సంతోషంగా ఉంది
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ఈనాటిది కాదు, గత 50 ఏళ్లుగా వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్.
By: Tupaki Desk | 16 July 2025 5:36 PM ISTసూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అనే సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ఈనాటిది కాదు, గత 50 ఏళ్లుగా వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. ఆ అనుబంధంతోనే రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన సందర్భంగా తన చిరకాల మిత్రుడు రజినీకాంత్ ను కమల్ హాసన్ కలిశారు. ఈ సందర్భంగా రజినీ, కమల్ ను అభినందించగా, ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలను కమల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టేముందు నాకెంతో ఇష్టమైన ఫ్రెండ్ తో నా ఆనందాన్ని పంచుకున్నా.ఈ క్షణం నాకెంతో సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చారు.
రజినీ, కమల్ బాండింగ్ కు ప్రధాన కారణం వీరి గురువు కె. బాలచందర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ తో రజినీకాంత్ హీరోగా పరిచయమవగా అదే సినిమా తెలుగులో తూర్పు పడమరగా రీమేకైంది. ఆ సినిమాతో మొదలైన వారి అనుబంధం 1985లో గిరఫ్తార్ వరకూ కంటిన్యూ అయింది. వారిద్దరూ కలిసి దాదాపు 20 సినిమాల్లో నటించారు.
అందులో ఎత్తుకు పై ఎత్తు, అంతులేని కథ, వయసు పిలిచింది, అందమైన అనుభవం, అల్లావుద్దీన్ అద్భుతద్వీపం, పదనారు వయదినిలె, మూండ్రు ముడిచ్ ,అవర్ గళ్ లాంటివి ఉన్నాయి. వీరిద్దరూ కలిసి చేసిన ఓ సినిమా రిలీజైన సందర్భంగా ఫ్యాన్స్ మధ్య ఏర్పడిన గొడవ చాలా పెద్దదిగా మారి తమిళనాడులోని ఓ థియేటర్ కు భారీ నష్టం వాటిల్లగా ఆ తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం మానేశారు.
కలిసి సినిమాలు చేయడమైతే మానేశారు కానీ వారిద్దరి మధ్య స్నేహం మాత్రం అలానే చెక్కు చెదరకుండా ఉంది. ఒకరి సినిమాలను మరొకరు ప్రశంసించుకోవడం, ఒకరి పనుల్ని మరొకరు సమర్థించుకోవడం మాత్రం ఎప్పుడూ మానలేదు. కమల్ కంటే ముందు రజనినే పాలిటిక్స్ లోకి వస్తారని కూడా అంతా అనుకున్నారు. రజినీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేశారు కానీ తర్వాత మనసు మార్చుకున్నారు. కానీ కమల్ మాత్రం మాటపై నిలబడి తమిళ ప్రజలకు, అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం మక్కల్ నీది మయ్యం అనే పార్టీ పెట్టారు.
గత ఎన్నికల్లో డీఎంకేకు మద్దతు పలుకుతూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోగా, పొత్తులో భాగంగా ఆ పార్టీ కమల్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది. దీంతో మొదటిసారి చట్టసభల్లోకి వెళ్లబోతున్న కమల్, దానికంటే ముందు రజనీను కలిసి, ఆయన విషెస్ అందుకున్నారు. జులై 25న కమల్ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా, సీనియర్ హీరోలిద్దరూ ఇలా కలుసుకోవడం వారి ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపింది.
