కమల్ పై కర్ణాటక హైకోర్టు సీరియస్
లోక నాయకుడు కమల్ హాసన్ పై కర్ణాటక హైకోర్టు సీరియస్ అయింది. మీరేమైనా చరిత్రకారులా? లేక భాషావేత్తనా అంటూ మండిపండింది.
By: Tupaki Desk | 3 Jun 2025 3:27 PM ISTలోక నాయకుడు కమల్ హాసన్ పై కర్ణాటక హైకోర్టు సీరియస్ అయింది. మీరేమైనా చరిత్రకారులా? లేక భాషావేత్తనా అంటూ మండిపండింది. కర్ణాటక ప్రజలకు క్షమాపణలు చెప్తే సరిపోయే దానికి మీరు రక్షణ కావాలని కోరుతూ కోర్టుని ఆశ్రయించారని కోర్టు వ్యాఖ్యానించింది. కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో భాగంగా కమల్ హాసన్, బెంగుళూరులో జరిగిన ఓ ఈవెంట్ లో కన్నడ భాష కూడా తమిళ భాష నుంచే పుట్టిందని చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఈ విషయంపై కన్నడిగులు సీరియస్ అయ్యారు. ఈ విషయంలో కమల్ ను క్షమాపణలు చెప్పమన్నప్పటికీ ఆయన దానికి అంగీకరించకపోవడంతో వివాదం మరింత ముదిరింది.
ఫలితంగా కమల్ నటించిన థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో ప్రదర్శించబోమని కన్నడిగులు కమల్ కు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో కర్ణాటకలో థగ్ లైఫ్ రిలీజ్ కు ఎలాంటి అడ్డంకులు లేకుండా రక్షణ కల్పించాలని కోరుతూ కమల్ అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు ఆ పిటిషన్లపై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం కమల్ పై హైకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది.
మీరు కమల్ హాసన్ అయితే ప్రజల మనోభావాలు తీసే హక్కు మీకు లేదు. ప్రజల మనోభావాల్ని దెబ్బతీయకూడదు. ఒక ప్రజా ప్రతినిధిగా అలాంటి కామెంట్స్ చేయకూడదని, మీ వ్యాఖ్యల వల్ల అశాంతి ఏర్పడిందని, కన్నడ ప్రజలు మిమ్మల్ని క్షమాపణలు చెప్పమని మాత్రమే అడిగారు. కానీ మీరు సినిమా రిలీజ్ విషయంలో రక్షణ కల్పించాలని ఇక్కడికి వచ్చారు. నిజంగా సినిమా సాఫీగా రిలీజవాలంటే క్షమాపణ చెప్తే సరిపోతుంది కదా అని హైకోర్టు కమల్ ను మందలించింది.
కన్నడ భాష, తమిళం నుంచి పుట్టిందనే స్టేట్‌మెంట్ ను అసలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ, కన్నడ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని కర్ణాటక హైకర్టు ఆదేశాలు జారీ చేసింది. కన్నడ ప్రజల మనోభావాలను తక్కువ అంచనా వేసినట్టున్నారు. 75 ఏళ్ల కిందట శ్రీ రాజ గోపాలకృష్ణ చార్య ఇలాంటి వ్యాఖ్యలే చేసి క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు మీరు కూడా క్షమాపణలు చెప్పండని హైకోర్టు కమల్ కు సూచించింది. కాగా కమల్ స్టేట్‌మెంట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కమల్ తప్పనిసరిగా కన్నడ ప్రజలకు సారీ చెప్పాల్సిందేనని ఆదేశించింది.
