'తమిళం నుంచి కన్నడ'- కమల్ హాసన్ వ్యాఖ్యలపై ఫైర్
ప్రముఖ నటుడు కమల్ హాసన్.. కన్నడ భాషపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
By: Tupaki Desk | 28 May 2025 11:21 AM ISTప్రముఖ నటుడు కమల్ హాసన్.. కన్నడ భాషపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ కర్ణాటక చీఫ్ కూడా స్పందించారు. ఆరున్నర కోట్ల కన్నడిగులను అవమానించారని ఆరోపించారు.
అసలేం జరిగిందంటే?
వరుస సినిమాలతో బిజీగా ఉన్న కమల్ హాసన్, ఇప్పుడు థగ్ లైఫ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మణిరత్నం దర్శకత్వం వహించిన ఆ మూవీ.. జూన్ 5వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్.. సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
అదే సమయంలో ఇటీవల చెన్నైలో జరిగిన ఈవెంట్ లో అక్కడే ఉన్న కన్నడ ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ ను ఉద్దేశించి కమల్ హాసన్ మాట్లాడారు. శివరాజ్ కుమార్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ సమయంలో తనకు ఇక్కడ కుటుంబం ఉందని, అందుకే వచ్చానని అన్నారు. కన్నడ కూడా తమిళం నుంచే పుట్టిందని వ్యాఖ్యానించారు.
దీంతో ఒక్కసారిగా ఆ వాఖ్యలు వివాదం సృష్టించాయి. కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర కూడా కమల్ హాసన్ వ్యాఖ్యలను ఖండించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. "ప్రతి ఒక్కరూ ఒకరు తమ మాతృభాషను ప్రేమించాలి. కానీ దాని పేరుతో అహంకారాన్ని ప్రదర్శించడం సాంస్కృతిక దివాలాకు నిదర్శనం" అని అన్నారు.
ముఖ్యంగా కళాకారులకు ప్రతి భాషను గౌరవించే తత్వం ఉండటం చాలా అవసరమని తెలిపారు. అనేక భారతీయ భాషల్లో నటించిన కమల్ హాసన్, నటుడు శివరాజ్ కుమార్ సమక్షంలో తన మాతృభాష తమిళాన్ని కీర్తిస్తూ కన్నడ భాషను తక్కువ చేసి తీవ్ర అహంకారాన్ని ప్రదర్శించారని విజయేంద్ర తీవ్రంగా మండిపడ్డారు.
దక్షిణ భారతదేశంలో సామరస్యాన్ని పెంపొందించడానికి బదులుగా, కమల్ హాసన్ ఇటీవల సంవత్సరాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విజయేంద్ర ఆరోపించారు. ఇప్పుడు కన్నడను అవమానించడం ద్వారా 6.5 కోట్ల కన్నడిగుల మనోభావాలను గాయపరిచారని పోస్ట్ చేశారు. భాషల మాలాల గురించి మాట్లాడడానికి కమలేం చరిత్రకారుడు కారని ఎద్దేవా చేశారు. ఆయన వెంటనే బేషరతుగా కన్నడిగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
