రుణం తీర్చుకోవడానికే థగ్ లైఫ్ చేశా
యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఆరు దశాబ్దాలు అవుతోంది. కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న కమల్ హాసన్ కు తెలుగు ఆడియన్స్ తో చాలా మంచి బాండింగ్ ఉంది.
By: Tupaki Desk | 30 May 2025 11:19 AM ISTయూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు ఆరు దశాబ్దాలు అవుతోంది. కోలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్న కమల్ హాసన్ కు తెలుగు ఆడియన్స్ తో చాలా మంచి బాండింగ్ ఉంది. ఆయన అరవై ఏళ్ల కెరీర్ లో తెలుగులో మరో చరిత్ర, సాగర సంగమం, స్వాతి ముత్యం లాంటి ఎన్నో ఐకానిక్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
ప్రస్తుతం కమల్ హాసన్ థగ్ లైఫ్ అనే పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా చేశారు. రిలీజ్ కు రెడీ గా ఉన్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించారు. జూన్ 5న థగ్ లైఫ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు టైమ్ బాగా దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
ప్రమోషన్స్ లో భాగంగా గురువారం వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా అందులో కమల్ హాసన్, శింబు, త్రిష, అభిరామితో పాటూ థగ్ లైఫ్ తెలుగు ప్రెజెంటర్ సుధాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో కమల్ మాట్లాడుతూ తనకు తెలుగు వారిపై ఉన్న ప్రేమను బయటపెట్టడంతో పాటూ వైజాగ్ తనకెంత స్పెషల్ అనే విషయాన్ని కూడా వెల్లడించారు.
తాను 21 సంవత్సరాల వయసులో వైజాగ్ లో మరో చరిత్ర కోసం షూటింగ్ చేశానని, అప్పట్నుంచి వైజాగ్ ప్రజలు తనపై ప్రేమ, ఆప్యాయతలు చూపిస్తూనే ఉన్నారని, మరో చరిత్ర సినిమా తర్వాత వైజాగ్ తనను రాత్రికి రాత్రే స్టార్ గా మార్చిందని, తాను నటించిన సాగర సంగమం, ఏక్ దుజే కే లియే, శుభ సంకల్పం లాంటి ఎన్నో సినిమాలను వైజాగ్ లో షూట్ చేశానని, వైజాగ్ తన రెండో ఇల్లు లాంటిదని ఆయన గుర్తు చేసుకున్నారు.
తన నుంచి ఎన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చినా, ఆడియన్స్ మాత్రం మంచి సినిమాలను మాత్రమే గుర్తుంచుకుంటారని, ఆడియన్స్ తనపై ఉంచిన దయకు ఎంత చెప్పినా తక్కువేనని, తాను తెలుగు 15 స్ట్రయిట్ సినిమాలు చేశానని, వాటిలో 13 బాక్సాఫీస్ హిట్లయ్యాయని, ఆడియన్స్ రుణం తీర్చుకోవడానికే తాను థగ్ లైఫ్ సినిమా చేశానని, థగ్ లైఫ్ తప్పకుండా గొప్ప సినిమా అవుతుందని, రిలీజ్ తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ కోసం తానెంతగానో ఎదురుచూస్తున్నట్టు కమల్ తెలిపారు.
