కోట్ల ఖర్చు పెడితేనే సినిమా కాదు.. కమల్ హాసన్ సెన్సేషనల్ కామెంట్స్!
సినిమా అనేది కళా? వ్యాపారమా? అనే చర్చ దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను చూస్తే వ్యాపార కోణమే పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు కనిపిస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 7 Jun 2026 6:51 PM ISTసినిమా అనేది కళా? వ్యాపారమా? అనే చర్చ దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులను చూస్తే వ్యాపార కోణమే పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదే అంశాన్ని తాజాగా సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా లోకనాయకుడు కమల్ హాసన్ మరోసారి ప్రస్తావించారు. ఇప్పుడు సినిమాలు తీయడం ప్యాషన్ కంటే బిజినెస్‌గా మారిపోయిందని, వందల కోట్ల బడ్జెట్లు, వేల కోట్ల వసూళ్ల లెక్కల మధ్య అసలు కథలు, క్రియేటివిటీ వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక ప్రసంగంగా కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సాగుతున్న ట్రెండ్‌పై వేసిన గట్టి ప్రశ్నగా మారాయి. ముఖ్యంగా పుష్పక విమానం వంటి క్లాసిక్ సినిమాను ఉదాహరణగా చూపిస్తూ, కేవలం రూ.15 లక్షల బడ్జెట్‌తో తీసిన ఆ సినిమా నేటి లెక్కల్లో వందల కోట్ల విలువైన కంటెంట్‌ను అందించిందని చెప్పడం విశేషం.
కమల్ హాసన్ మాటలకు బలం చేకూర్చే అంశాలు కూడా పరిశ్రమలో కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా పాన్ ఇండియా విజయాల ప్రభావంతో దాదాపు ప్రతి స్టార్ హీరో భారీ స్థాయి కథలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్ పరిమితంగా ఉన్న హీరోలు సైతం వరల్డ్ బిల్డింగ్, భారీ యాక్షన్ ఎపిసోడ్లు, విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన కథలనే కోరుతున్న పరిస్థితి ఏర్పడింది. డైరెక్టర్లు కూడా అదే దిశగా పరుగులు తీస్తున్నారు. ఫలితంగా మధ్యస్థాయి లేదా తక్కువ బడ్జెట్‌లో బలమైన కథలతో వచ్చే సినిమాల సంఖ్య తగ్గిపోయింది. మరోవైపు భారీ బడ్జెట్‌లతో తెరకెక్కిన అనేక సినిమాలు ఆశించిన ఫలితాలు సాధించకపోవడంతో రికవరీ సమస్యలు పెరుగుతున్నాయి. కమల్ ప్రస్తావించిన అంశం కూడా ఇదే. కోట్ల రూపాయలు ఖర్చు చేయడం మాత్రమే గొప్ప సినిమా ప్రమాణం కాదని, ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే కథను చెప్పడం ముఖ్యమని ఆయన గుర్తు చేశారు.
కమల్ కామెంట్స్ కు ఉన్న మరో ప్రత్యేకత ఆయన దూరదృష్టి. విశ్వరూపం రిలీజ్ టైమ్ లో థియేటర్లతో పాటు డీటీఎచ్ ద్వారా కూడా సినిమాను ప్రేక్షకుల ఇళ్లకు తీసుకెళ్లాలన్న ఆలోచనను ఆయన ప్రకటించినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్లో అది అసాధ్యంగా కనిపించినా, కరోనా తర్వాత ఓటీటీ విప్లవం వచ్చిన నేపథ్యంలో కమల్ ఆలోచన ఎంత ముందుచూపుతో కూడుకున్నదో ఇండస్ట్రీ గుర్తించింది. నేడు నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు సాధారణ విషయంగా మారాయి. అందుకే ఆయన ఇప్పుడు చెప్పిన హెచ్చరికను కూడా పరిశ్రమ తేలికగా తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఫ్యూచర్‌ను అంచనా వేసిన వ్యక్తిగా కమల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
సింగ్ గీతం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన ఈ కామెంట్స్ కేవలం ప్రస్తుత పరిస్థితులపై విమర్శ మాత్రమే కాదు, ఫ్యూచర్‌కు ఒక సూచన కూడా. భారీ బడ్జెట్‌లు, పాన్ ఇండియా మోజు, కలెక్షన్ల రేసు మధ్య సినిమా అనే కళ తన అసలు స్వరూపాన్ని కోల్పోకూడదన్న ఆందోళన ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఇదే సమయంలో 94 ఏళ్ల వయసులోనూ సృజనాత్మకంగా ముందుకు సాగుతున్న దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావును ఉదాహరణగా చూపిస్తూ, గొప్ప సినిమాలు డబ్బుతో కాదు ఆలోచనతో పుడతాయని కమల్ పరోక్షంగా గుర్తు చేశారు.
