నాకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది తెలుగు వారే: కమల్ హాసన్
38 ఏళ్ల తర్వాత మళ్లీ కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్ వస్తుండటంతో ‘థగ్ లైఫ్’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ ఏర్పడింది.
By: Tupaki Desk | 22 May 2025 8:46 PM IST38 ఏళ్ల తర్వాత మళ్లీ కమల్ హాసన్ - మణిరత్నం కాంబినేషన్ వస్తుండటంతో ‘థగ్ లైఫ్’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ హైప్ ఏర్పడింది. సింబు, త్రిష, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. ఈ చిత్రాన్ని జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మణిరత్నం, కమల్ హాసన్ హైదరాబాద్ వచ్చి మీడియాతో మాట్లాడారు. వారి మాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ.. "నేను కమల్ హాసన్‌ను 38 ఏళ్ల క్రితం డైరెక్ట్ చేస్తానని అనుకోలేదు. ఇప్పుడు మళ్లీ చేస్తానన్నదీ ఊహించలేదు. కానీ కమల్ అడిగితే కాదనకుండా ఉండలేను. అలాంటి భావోద్వేగంతో సినిమా మొదలైందంటూ.. అలాంటి గొప్ప నటులతో పనిచేయడం సులభం అవుతుంది" అంటూ ఆయన చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి.
కమల్ హాసన్ నటనపై ఆయనకు ఉన్న విశ్వాసం, సినిమా ఎమోషనల్ లెవెల్ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పకనే చెప్పారు. కమల్ హాసన్ అయితే తెలుగు ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు. "నాకు స్టార్ స్టేటస్ తీసుకొచ్చింది తెలుగు వారే. ‘మరో చరిత్ర’ సినిమాతోనే ఇతర భాషల్లో అవకాశాలు వచ్చాయి. మీరు చూపిన ప్రేమతోనే ఈ స్థాయికి వచ్చాను" అంటూ భావోద్వేగంతో చెప్పిన మాటలు అభిమానులను ఫుల్ ఫీల్ చేశాయి.
థగ్ లైఫ్ సినిమాకు కూడా అదే స్థాయిలో ఆదరణ ఆశిస్తున్నానని చెప్పిన కమల్.. ఈ సినిమాలో తాను పోషించిన పాత్ర తన జీవితాంతం గుర్తుండిపోతుందని అన్నారు. "కొన్ని పాత్రలలో నటించిన తరువాత అంత సులభంగా వాటిని మర్చిపోలేము. అవి మనలో మిగిలిపోతుంటాయి. అలా ‘థగ్ లైఫ్’ పాత్ర కూడా నాలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అలాంటి పాత్రల్లో నటించే అవకాశం రావడం, అటువంటి సినిమా చేయడం నిజంగా అదృష్టం. ఈ సినిమా ‘నాయకుడు’ కంటే గొప్ప విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను" అంటూ ఆయన చెప్పిన మాటలు సినిమాపై మరింత ఆసక్తిని రేపుతున్నాయి.
ఇక మణిరత్నం సతీమణి సుహాసిని మాట్లాడుతూ.. ఇప్పటికే తాను సినిమా చూశానని.. అది అద్భుతంగా ఉందని చెప్పారు. తెలుగు వర్షన్‌ను శ్రేష్ఠ మూవీస్ విడుదల చేస్తోంది. కమల్ హాసన్ - మణిరత్నం మళ్లీ కలిసి రూపొందించిన ఈ సినిమా ఒక సరికొత్త అనుభూతిని అందించబోతుందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మొత్తానికి జూన్ 5న థియేటర్లలో ‘థగ్ లైఫ్’ ఉత్సవం మొదలుకానుంది. ఇక బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటుందో చూడాలి.
