ఈ స్టార్‌డమ్ ఎంతో ఇబ్బందిగా ఉంది
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ థగ్ లైఫ్. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను బాగా వేగవంతం చేసింది.
By: Tupaki Desk | 23 May 2025 12:19 PM ISTమణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ థగ్ లైఫ్. జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను బాగా వేగవంతం చేసింది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ తెలుగు మీడియా ముందుకొచ్చింది. ఈ ఈవెంట్ లో కమల్ హాసన్ తో పాటూ శింబు, మణిరత్నం, త్రిష, అభిరామి, అశోక్ శెల్వన్, నాజర్, తనికెళ్ల భరణి పాల్గొన్నారు.
తెలుగు ఆడియన్స్ తనకెంతో స్పెషల్ అని, తన మొదటి సినిమా మన్మథకు తెలుగు ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ను ఇప్పటికీ మర్చిపోలేనని, ఇప్పట్నుంచి గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తానని, ఓజి నుంచి త్వరలోనే సాంగ్ రాబోతుందని, ఆ సాంగ్ ను తమన్ చాలా గొప్పగా కంపోజ్ చేశాడని, పవన్ కళ్యాణ్ కోసం సాంగ్ పాడటం ఎంతో ఆనందంగా ఉందని శింబు ఈ సందర్భంగా తెలిపాడు.
ఈ సందర్భంగా కమల్ తో తన ప్రయాణాన్ని మణిరత్నం గుర్తు చేసుకున్నారు. నాయకన్ తో మొదలైన తమ జర్నీ థగ్ లైఫ్ వరకు కొనసాగుతూనే వస్తుందని చెప్పారు. తాను మొదటిసారి కమల్ తో వర్క్ చేసింది నాయకన్‌లో అని, మౌనరాగం సినిమా పూర్తయ్యాక తాను ఇంట్లో ఉన్నప్పుడు నిర్మాత ముక్త శ్రీనివాసన్ తనను కలిసినప్పుడు ఓ వీడియో క్యాసెట్ ఇచ్చి ఇందులో ఓ హిందీ సినిమా ఉందని, ఈ సినిమాను మీరు చూడాలని కమల్ చెప్పమన్నాడని ఇచ్చాడని తెలిపారు.
నేను హిందీ సినిమాకు సరిపోకవచ్చని నిర్మాతతో చెప్పానని, ఆ తర్వాత కలిసినప్పుడు కూడా తాను శ్రీనివాసన్ తో అదే మాట చెప్పడంతో ఈ విషయాన్ని మీరే డైరెక్ట్ గా కమల్ తో చెప్పండని అన్నాడని తెలిపారు. ఆ తర్వాత కమల్ ను కలిసినప్పుడు అతను అసలు సమస్యేంటో అడిగాడని, అప్పుడు నా దగ్గర వేరే ఆలోచనలున్నాయని చెప్పానని, అలా నాయకన్ సినిమా మొదలైందని, థగ్ లైఫ్ విషయంలో కూడా అదే జరిగిందని, ఒక రోజు కమల్ ఫోన్ చేసి మనం కలిసి మూవీ చేద్దామన్నాడని ఆయన చెప్పారు.
ఇన్నేళ్లుగా మణిరత్నం గారిని చూస్తున్నా. నాయకన్ టైమ్ లో ఆ మణిని కలవడం సంతోషంగానే ఉంది, ఇప్పుడు ఈ మణిని కలవడం కూడా సంతోషంగా ఉందని కమల్ అన్నారు. శింబును సినిమా బిడ్డగా చెప్పిన కమల్, అభిరామి తిరిగి సినిమాల్లోకి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమల్ స్టార్‌డమ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నిజాయితీగా చెప్పాలంటే ఆడియన్స్ ఇచ్చిన స్టార్‌డమ్ తనకెంతో ఇబ్బందిగా, అసౌకర్యంగా ఉందని అన్నారు.
స్టార్‌డమ్ ఉన్నప్పటికీ ఆడియన్స్ ను సంప్రదించడానికి తాను ప్రయత్నిస్తూనే ఉంటానని, థగ్ లైఫ్ నాయకన్ కంటే భారీ హిట్ అవుతుందని తాను నమ్ముతున్నట్టు కమల్ చెప్పారు. తనను కేరళ వాళ్లు హీరోగా చేసినప్పటికీ తెలుగులో స్టార్ ను అయ్యానని, స్టార్ గా ఇది నాకు జన్మ స్థలం లాంటిదని, దయచేసి నన్ను గురు అని పిలవొద్దని, కేవలం తనను గుర్తుపెట్టుకుంటే చాలని, తాను చేసిన అన్ని సినిమాల్లోకెల్లా ఈ సినిమా తనకు చాలా ఇష్టమైనదని, ఈ క్యారెక్టర్ నుంచి బయటకు రావడానికి చాలా టైమ్ పట్టిందని కమల్ చెప్పారు.
