స్టేజ్‌ను షేక్ చేసేసిన మ్యాడ్ స్క్వేర్ దర్శకుడు
ఇప్పుడు తన బాటలో యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్.. ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్‌లో స్టేజ్‌ను షేక్ చేసి పడేశాడు.
By: Tupaki Desk | 5 April 2025 1:24 PMదర్శకులు అంటే తక్కువ మాట్లాడాలి. ఎక్కువ హడావుడి చేయకూడదు. స్టేజ్ ఎక్కితే పొడి పొడిగా మాట్లాడి దిగిపోవాలి. హుందాగా కనిపించాలి. ఇవి అనధికారిక రూల్స్ అన్నట్లు. లోపల ఉత్సాహం తన్నుకొస్తున్నప్పటికీ డైరెక్టర్లు అంటే ఇలాగే ఉండాలి అనే అభిప్రాయాల వల్ల చాలామంది తమలో ఉన్న జోష్‌ను లోపలే అణిచిపెట్టేస్తుంటారు. కానీ ఈ మధ్య దర్శకుల తీరు మారుతోంది. ప్రమోషన్ వీడియోల్లో, ఈవెంట్లలో నటులను మించి ఉత్సాహం చూపించడం ద్వారా అనిల్ రావిపూడి లాంటి వాళ్లు ట్రెండ్ మొత్తం మార్చేశారు.
ఇప్పుడు తన బాటలో యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్.. ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్‌లో స్టేజ్‌ను షేక్ చేసి పడేశాడు. కళ్యాణ్ ఎన్టీఆర్‌కు పెద్ద ఫ్యాన్. కాలేజీ రోజుల్లో అతను ఎన్టీఆర్ పాటలకు డ్యాన్స్ చేసేవాడట. ‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ ఈవెంట్‌కు తారక్ ముఖ్య అతిథిగా వచ్చిన నేపథ్యంలో అతను రెండుసార్లు ‘ఆంధ్రావాలా’లోని ‘నైరే నైరే’ పాటకు అదిరిపోయే రీతిలో స్టెప్పులేసి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు. ముందుగా తారక్ రావడాని కంటే ముందే తన ‘మ్యాడ్’ బాయ్స్‌తో కలిసి ‘నైరే నైరే’ పాటకు స్టెప్పులేశాడు కళ్యాణ్. ‘ఆంధ్రావాలా’ టైంలో తారక్ బొద్దుగా ఉండేవాడన్న సంగతి తెలిసిందే.
కళ్యాణ్ ఇప్పుడు దాదాపు అదే లుక్‌తో ఉండడంతో తన స్టెప్స్ తారక్‌కు బాగా మ్యాచ్ అయ్యాయి. ఒక దర్శకుడు ఒక ఫ్యాన్ బాయ్ లాగా ఇంత బాగా డ్యాన్స్ వేయడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ఈవెంట్‌కు తారక్, త్రివిక్రమ్ శ్రీనివాస్ రాగా.. యాంకర్ సుమ వారి ముందు నైరే నైరే డ్యాన్స్ వేయాలని అడిగితే.. మళ్లీ స్టెప్స్ వేసి వారు కూడా ఆశ్చర్యపోయేలా చేశాడు కళ్యాణ్. ఇదిలా ఉండగా.. తారక్ మాట్లాడేటపుడు తన అభిమానాన్ని చాటుతూ కళ్యాణ్ తనకు పాదాభివందనం చేయబోగా.. తారక్ తప్పించుకుని దూరంగా వెళ్లిపోయాడు. పాదాలకు నమస్కారం చేయాలనుకుంటే తల్లిదండ్రులకే చేయాలని, తనకు వద్దని తారక్ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది.